మద్యం సేవించడం హానికరం.. ఒక్క పెగ్గూ ప్రాణాంతకమే!
Single Glass Of Alcohol Also Affects Atrial Fibrillation: ఒక్క పెగ్గు మద్యంతో నష్టం లేదు.. పైగా ఆరోగ్యానికి మంచిది అని చాలామంది భావిస్తుంటారు. అయితే ఒక్క స్మాల్ వేసుకున్నా సరే.. అది గుండెకు చేటే అంటోందీ తాజా పరిశోధన! ఆరోగ్యంపై మద్యం ప్రభావంపై చర్చ ఈ రోజు తాజాది కాదు. కాకపోతే చాలాకాలంగా అందరూ బలంగా విశ్వసించిన విషయం ఏమిటంటే.. ‘ఏదో.. అప్పుడప్పుడూ సరదా కొద్దీ... విందు భోజనం తరువాత కొంచెం ‘పుచ్చుకుంటే’ తప్పేమీ కాదు’ అన్నది! కానీ... కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన ఒక పరిశోధన మాత్రం అవన్నీ హంబగ్ అని తేల్చేసింది.
వీరి లెక్క ప్రకారం.. ఒక్క డ్రింక్ తీసుకున్నా గుండె కొట్టుకోవడంలో తేడాలొచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుంది. గుండె కొట్టుకునే తీరులో హెచ్చుతగ్గులు ఉంటే దాన్ని ఆట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు. కొన్ని సందర్భాల్లో ఈ ఆట్రియల్ ఫిబ్రిలేషన్ ప్రాణాంతకమూ అయ్యే అవకాశం ఉంది. ‘‘ఈ సమస్య తాగుబోతుల్లో ఎక్కువని ఒక అంచనా ఉండేది. కానీ ఒక డ్రింకు పుచ్చుకున్నా ప్రమాదం ఎక్కువయ్యే అవకాశం ఉంది’’ అని తాజా పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవ్తేత గ్రెగరీ మార్కస్ చెబుతున్నారు.
తాము వంద మంది రోగులపై పరిశోధన చేశామని, ఒక డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వారికి ఆట్రియల్ ఫిబ్రిలేషన్ వచ్చే అవకాశం రెట్టింపు అయ్యిందని చెప్పారు. వీరు రెండో డ్రింక్ కూడా తీసుకుంటే ప్రమాదం మూడు రెట్లు పెరిగిందని అన్నారు. అయితే తాము పరిశోధనలు చేసిన వారు ముందుగానే ఈ సమస్యతో బాధపడుతున్న వారు కాబట్టి సాధారణ వ్యక్తుల్లో ఒక్క డ్రింక్ కూడా ప్రమాద హేతువు కావచ్చునని చెప్పవచ్చునని వారు వివరించారు.
శషభిషలకు తావు లేకుండా...
ముందుగా చెప్పుకున్నట్లు ఆరోగ్యంపై మద్యం ప్రభావాన్ని కచ్చితంగా లెక్కకట్టడం అంత సులువైన పనేమీ కాదు. పరిశోధనలో పాల్గొన్న వారు తాము ఎంత మద్యం పుచ్చుకున్నదీ స్పష్టంగా తెలియజేయాల్సి ఉండటం దీనికి ఒక కారణం. అంతేకాకుండా.. వారి జీవితాల్లోని ఇతర అంశా లను కూడా పరిగణనలోకి తీసుకుని తుది అంచనా వేయాల్సి ఉంటుంది. కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ శషభిషలను, ఊహాగానాలను తొలగించేందుకు వీలైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించారు.
పరిశోధనల్లో పాల్గొన్న వారు తరచూ తమ రక్తాన్ని స్వయంగా పరీక్షించుకునే ఏర్పాట్లు చేశారు. మధుమేహ పరీక్ష తరహాలో రక్తంలో మద్యం మోతాదును లెక్కకట్టారు. ‘‘ఫలితాలు చెప్పే విషయం ఒక్కటే.. మద్యం ఎంత ఎక్కువైతే.. ప్రమాదమూ అంతేస్థాయిలో పెరుగుతోంది’’ అని మార్కస్ వివరించారు. ఈ పరిశోధన ఫలితాలు దశాబ్దాలుగా చాలామంది రోగులు చెప్పిన అంశాలకు దగ్గరగా ఉన్నాయని, కాకపోతే ఈసారి కచ్చితమైన లెక్కలతో తాము ఫలితాలను నిర్ధారించగలిగామని వివరించారు.
తగినన్ని నీళ్లే ఆయుధం...!
గుండెజబ్బులను నివారించేందుకు జీవనశైలి మార్పులు ఎంత అవసరమో.. తగినన్ని నీళ్లు తాగడం కూడా అంతే ముఖ్యం. యూరప్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు దీన్ని పరిశోధన పూర్వకంగా నిర్ధారించారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది రోజూ తగినన్ని నీళ్లు తాగడం లేదని, కనీసం ఒక్క గ్లాసు అదనంగా తాగినా గుండెసంబంధిత సమస్యలను అధిగమించవచ్చునని వీరు చెబుతున్నారు.
‘గుండె విఫలమయ్యేందుకు ఉన్న అవకాశాలను నివారించేందుకు లేదా ఆలస్యం చేసేందుకు నీళ్లు చాలా ఉపయోగపడతాయి’ అంటారు ఈ తాజా పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త నటాలియా దిమిత్రైవ. ప్రతిరోజూ పురుషులైతే మూడు లీటర్ల వరకూ నీరు తీసుకోవాలని, మహిళలైతే 1.6 నుంచి 2.1 లీటర్ల వరకూ ఉండాలని తెలిపారు.
– సాక్షి, హైదరాబాద్
చదవండి: National Nutrition Week: ఆరోగ్యానికి 5 చిట్కాలు.. అన్నీ తెలిసినవే!
Comments
Please login to add a commentAdd a comment