శీతాకాలంలో శారీరక శ్రమ తగ్గడం, కాలానుగుణ మార్పులు తదితరాల కారణంగా అధిక రక్తపోటు, కొలస్ట్రాల్ స్థాయిలు పెరగడం జరుగుతుంది. ఈ కాలంలో హృదయనాళం పనితీరుకు అనుగుణమైన ఆహారపదార్థాలు తీసుకుంటే గుండె సంబంధిత ప్రమాదాలను నివారించొచ్చని చెబతున్నారు నిపుణులు. ఈ కాలంలో ఎక్కువగాయాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉన్నవి తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఈ వణికించే చలిలో రక్తపోటుని నిర్వహించి, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వడం మేలని చెబుతున్నారు. అవేంటో చూద్దామా..
ఆకు కూరలు
పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరల్లో విటమిన్ ఏ, సీ, కే, ఫైబర్ తోపాటు ఫోలేట్ వంటివి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ ఆకుకూరలు నైట్రేట్‌లను కలిగి ఉంటాయి. అందువల్ల రక్తపోటును తగ్గించి, ధమనుల పనితీరును మెరుగ్గా ఉంచడంలో కీలకంగా ఉంటాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు గుండెకు హాని కలిగించే ఆక్సీకరణ ఒత్తిడిని కూడా నివారిస్తాయి.
నారింజ
దీనిలో విటమిన్ సీ, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. నారింజలోని పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడగా, ఫైబర్ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. ఇక విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
నట్స్:
ముఖ్యంగా వాల్‌నట్‌లు, బాదంపప్పులలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, ఫైబర్, మెగ్నీషియం తదితరాలు గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఒమేగా -3లు వాపును తగ్గిస్తాయి, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తాయి. అయితే మెగ్నీషియం ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇవి రోజూ కొద్దికొద్దిగా తీసుకుంటే.. ఎలాంటి హృదయ సంబంధ సమస్యలు తలెత్తవు.
దానిమ్మ..
దానిమ్మపండులో పాలీఫెనాల్స్ అని పిలువబడే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ధమనులలో ఫలకం ఏర్పడటాన్ని తగ్గిస్తాయి. దానిమ్మ రసం త్రాగడం లేదా విత్తనాలు తినడం రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
వెల్లుల్లి
వెల్లుల్లిలో రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే సామర్థ్యం ఉంటుంది. అందువల్ల ఇది గుండె-ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో అత్యంత కీలకమైనదిగా చెప్పొచ్చు. ఈ చలికాలంలో దీన్ని జోడించటం వల్ల రక్తనాళాల్లో ఎలాంటి బ్లాక్‌లు ఏర్పడే అవకాశం ఉండదు, గుండె పనితీరు కూడా బాగుంటుంది.
క్యారెట్లు
క్యారెట్‌లో బీటా కెరోటిన్, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను, రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యానికి దోహదడతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మంటను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తాయి. క్యారెట్‌లు పచ్చిగా, ఆవిరిలో ఉడికించి లేదా సూప్‌లాగా తీసుకోవచ్చు.
బీట్‌రూట్‌లు
బీట్‌రూట్‌లలో నైట్రేట్‌లు ఎక్కువగా ఉంటాయి. వీటిని శరీరం నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుస్తుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ బీట్‌రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, పీచుపదార్థాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ సాఫీగా ఉండేలా చేసి గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.
ఇవన్నీ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ శీతాకాలంలో వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడమే గాక సమతుల్యమైన ఆహారం శరీరానికి అందించగలుగుతాం.
గమనించి: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించి అనుసరించడం మంచిది.
(చదవండి: సోరియాసిస్‌ను తగ్గించే సహజసిద్ధమైన ఆయిల్..)
Comments
Please login to add a commentAdd a comment