అమరిక : ఇంటి కళకు ఇత్తడి, రాగి...
ఇంటి అలంకరణలో ఎంత ఆధునికత చోటుచేసుకుంటున్నా ప్రాచీన వస్తువుల పట్ల మనిషికి మక్కువ ఎక్కువవుతూనే ఉంటుంది. అంతటా ప్లాస్టిక్‌మయమైన ఈ రోజుల్లో ఇంటి అలంకరణలో ఇత్తడి, రాగి వస్తువులను ఉపయోగిస్తే ఆ కళ తీరే శోభాయమానంగా ఉంటుంది. ఇంట్లో స్టోర్ రూమ్‌లోనో, అటకమీదో పడేసిన వస్తువులను దించి, దుమ్మ తుడిచేయండి. పాతగా అనిపిస్తే కొత్తగా మెరిపించడానికి కింది చిట్కాలూ పాటించవచ్చు.
ముందుగా చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి. ఎమెరీ క్లాత్(లోహాలను మెరుగుపెట్టడానికి ఉపయోగించేది)తో ఇత్తడి పాత్రల, వస్తువుల అంచులను రుద్దాలి. దీనివల్ల అంచుల తయారీలో లోపాలు ఉండి, కొనలాంటి భాగాలు గుచ్చుకోకుండా కుదురుగా చేయొచ్చు. తర్వాత మెత్తని కాటన్ క్లాత్‌తో తుడవాలి.
టొమాటో గుజ్జు ఇత్తడి పాత్రలకు రాసి, మెత్తటి కుచ్చు ఉన్న బ్రష్‌తో రుద్దాలి. తర్వాత మంచి నీటితో శుభ్రపరిచి కాటన్ వస్త్రంతో తుడవాలి.
ఒక భాగం నీళ్లలో రెండు భాగాలు పాలు పోసి అందులో ఇత్తడి వస్తువులు కొన్ని గంటల పాటు ఉంచాలి. తర్వాత మంచినీటితో శుభ్రపరిచి పొడిక్లాత్‌తో తుడవాలి. రెండు భాగాలు వెనిగర్, ఒక భాగం నీరు కలిపి అందులో రెండు గంటలు ఇత్తడి వస్తువులను ఉంచాలి. తర్వాత శుభ్రపరచాలి. పొడి క్లాత్‌కు కొద్దిగా ఆలివ్ ఆయిల్ అద్దుకుని, దాంతో ఇత్తడి వస్తువులను బాగా రుద్దుతూ తుడిస్తే మెరుపు తగ్గదు.
రాగి, ఇత్తడి వస్తువులను నిమ్మముక్కతో రుద్దినా పాత్రలకు కొత్తదనం వస్తుంది.
ఇప్పుడిక అమ్మమ్మ వాడిన పూలసజ్జనో, నానమ్మ పెట్టిన నగలపెట్టెనో, తాతయ్య తాగిన మరచెంబునో పనికిరాదని పడేసే అవసరమే ఉండదు!