ఆయనొక పరుసవేది! | brazil writer Paulo Coelho | Sakshi
Sakshi News home page

ఆయనొక పరుసవేది!

Published Mon, Jan 20 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM

ఆయనొక పరుసవేది!

ఆయనొక పరుసవేది!

 అంతర్జాతీయం

  ‘‘ఒక నిర్ణయం దృఢంగా తీసుకోవడం ఉద్ధృతంగా ప్రవహించే ఏరులోకి దూకడంలాంటిది. అది ఎక్కడకు తీసుకెళ్లినా తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి’’ అంటాడు ప్రఖ్యాత రచయిత పాలో కొయిలో! జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని విజయ తీరాలకు చేరిన అనుభవసారంతో చెప్పాడు ఈ మాటలు! నిర్ణయమంటూ ఒకటి తీసుకుని, దాన్నే లక్ష్యంగా చేసుకున్నాక, అది జరిగి తీరాలన్న కోరిక బలంగా ఉండాలి. అప్పుడే దాన్ని నిజం చేయడానికి పంచభూతాలు అనువైన పరిస్థితులు సృష్టిస్తాయి... ఇది కొయిలో రాసిన ప్రసిద్ధ నవల ‘ఆల్కెమిస్ట్’ సారాంశం!
 
 బ్రెజిల్‌కు చెందిన కొయిలోకు రచయిత కావాలన్న తపన బాల్యం నుంచే మొదలైంది. కానీ చుట్టూఉన్నవాళ్లు దానిని నీరుగార్చే ప్రయత్నాలు చేశారు. ఆయన తల్లి స్వయంగా ‘రచయిత కావాలనుకోవడం అర్థం లేని లక్ష్యం’ అని చెప్పటమే కాకుండా, ‘నీ తండ్రి ఒక ఇంజినీర్, నువ్వు కూడా అలానే ఏదైనా ఉద్యోగాన్ని ఎంచుకో’ అని సూచించింది. అయితే కొయిలో దృష్టంతా రాయడం మీదే ఉండేది. తన ఉత్సాహాన్ని చూసి ‘పిచ్చి’ అనుకొని, ఆయనను పిచ్చాసుపత్రిలో కూడా చేర్చారు. అక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి విఫలుడై, ఎట్టకేలకు ‘లా’ చదవడానికి ఒప్పుకోవడంతో, కొయిలోకు పిచ్చి తగ్గిందనుకొంది ఆ పిచ్చితల్లి. అయితే చదువులో పడ్డాక కొయిలో డ్రగ్స్‌కు బానిసై, 1960లో అరెస్టయ్యాడు. తిరిగి బయటపడి బ్రెజిల్ చేరుకొన్నాక కొయిలో జీవనశైలే మారిపోయింది.  ఈసారి మరింత పట్టుదలతో రచనా వ్యాసంగంపై దృష్టిపెట్టాడు. మొదట్లో రాసిన ఒకటి రెండు నవలలు పెద్దగా ప్రభావం చూపక పోయినా, 1988లో రాసిన ‘ఆల్కెమిస్ట్’ నవలతో ఆయన విజయప్రస్థానం మొదలైంది.
 
 ‘నా విజయానికి కారణం ఆశ, ఆశయాలు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని వదులుకోలేదు. ఆశలు వదులుకొన్నవాడు తప్ప అందరూ విజేతలే’ అంటున్న కొయిలో పుస్తకాల్లో ఉత్ప్రేరకాల్లాంటి ఇటువంటి వాక్యాలు ఎన్నో ఉంటాయి. ఆ నవలలో విజయకాంక్షను రగిలించే ఉదాహరణలు, ఆలోచనలను రేకెత్తించే మంచి మాటలు, పట్టుదలను పెంచే సలహాలు ఉంటాయి. అందుకే ఆయన పుస్తకాలు సామాన్యుడిని సైతం విజేతగా తీర్చిదిద్దే పరుసవేది.
 - జీవన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement