మచ్చమటలు తుడిచేద్దాం..! | Brightness through Melanin | Sakshi
Sakshi News home page

మచ్చమటలు తుడిచేద్దాం..!

Published Fri, Jun 19 2015 11:59 PM | Last Updated on Wed, Apr 3 2019 5:34 PM

మచ్చమటలు తుడిచేద్దాం..! - Sakshi

మచ్చమటలు తుడిచేద్దాం..!

ఒక వ్యక్తి మేనికి రంగును ఇచ్చేది మెలనిన్ అనే పిగ్మెంట్. దాని పైనే శరీర వర్ణం ఆధారపడి ఉంటుంది. మేనిలో మెలనిన్ పెరుగుతున్న  కొద్దీ వాళ్లలో నలుపుదనం పెరుగుతుంటుంది. అలాగే మెలనిన్ తక్కువ ఉన్న కొద్దీ వారు తెల్లబడుతూ ఉంటారు. మెలనిన్ మేనంతా సమానంగా పరుచుకుంటుంది కాబట్టి ఒంటి రంగంతా ఒకేలా ఉంటుంది. అయితే కొందరిలో మెలనిన్ అంతా ఒకేచోట పోగుబడటంతో ఆ ప్రాంతం నల్లబారుతుంటుంది. నల్లమచ్చల్లా కనిపిస్తుంటుంది. మన ఒంటిపై వచ్చే నల్లమచ్చలకు కారణాలు, నివారణ, చికిత్స వంటి అనేక అంశాలను తెలుసుకుందాం. ముచ్చెమటలు పోయించే ఆ మచ్చెమటలు తుడిచేద్దాం.
 
ముఖంపైనా, మేనిపైనా వేర్వేరు కారణాలతో నల్లమచ్చలు రావచ్చు. మచ్చలు వచ్చేందుకు కారణాలు ఇవి...
ఎండలో ఎక్కువగా తిరగడం: నేరుగా ఒంటి మీద సూర్యకాంతి పడేలా ఎండలో తిరగడం వల్ల మన చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దాంతో ఈ మెలనిన్ మేని భాగంలో ఒకేచోట పోగుపడితే అక్కడ చర్మం నల్లగా మారుతుంది. సాధారణంగా నుదుటిపైనా, కణతల వద్ద, మెడకు ఇరువైపులా, మెడదగ్గర ఇంగ్లిష్ అక్షరం వి ఆకృతిలో, చెవులు... ఈ భాగాలు నల్లబారుతాయి.

సూర్యుడి ప్రభావం వల్ల కనిపించే దుష్పరిణామాలు ఈ కింది విధంగా ఉంటాయి. ట్యాన్ : పిగ్మెంటేషన్ పొర ఉన్న చోట చర్మం... మిగతా దాని కంటే కాస్త ఉబ్బెత్తుగా ఉంటుంది.
చికిత్స : సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (ఎస్‌పీఎఫ్) ఎక్కువగా... అంటే 50 వరకు ఉండే సన్‌స్క్రీన్ లోషన్లను ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాసుకోవడం  చర్మం రంగును తేలిక పరిచే క్రీములు: యాస్కార్బిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, ఆర్బుటిన్ వంటి క్రీములతో ఇవి తగ్గుతాయి.
 
కెమికల్ పీలింగ్: ఈ తరహా చికిత్స ఒకేసారి కాకుండా కొన్ని విడతల్లో చేయాల్సి ఉంటుంది. ఇందులో నల్లమచ్చ ఉన్నచోట కొన్ని మందులు పూస్తారు. ఆ తర్వాత మృతచర్మం దానంతట అదే ఒలిచినట్లుగా (పీలింగ్) తొలగిపోతుంది. దాంతో మచ్చలోని నల్లదనం తగ్గుతంది.
 
యాంటీఆక్సిడెంట్స్: శరీరంలోకి విడుదలయ్యే అపాయకరమైన విషపదార్థాలను హరించే పోషకాలను యాంటీఆక్సిడెంట్స్ అంటారు. ఈ విషాలు చర్మాన్ని ఉన్న వయసు కంటే ఎక్కువగా కనిపించేలా చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ అనే పోషకాలు ఈ విషాలను హరించి, చర్మం వయసును తగ్గించి చూపుతాయి. అందుకే యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను క్రమం తప్పక తీసుకుంటూ ఉంటే మేనిలో నిగారింపు వస్తుంది.
 
లేజర్ : కొన్ని సందర్భాలలో నల్లమచ్చపై లేజర్ కిరణాలను ప్రసరింపజేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.
ప్రికిల్స్ : ఇవి సాధారణంగా చెంపలపైనా, ముక్కుకు ఇరువైపులా చుక్కలు చుక్కలుగా కనిపించే ముదురు గోధుమరంగు మచ్చలు. కొన్నిసార్లు ఇవి మెడకింది భాగంలోని ఛాతీ మీద కూడా చుక్కలుగా కనిపిస్తాయి. కొందరిలో ఇవి భుజాలు, వీపు మీద కూడా రావచ్చు.
చికిత్స : క్రమం తప్పకుండా సన్‌స్క్రీన్ లోషన్ రాయడం.  కెమికల్ పీలింగ్ ప్రక్రియలు చేయించుకోవడం.  చర్మపు రంగును తేలికపరిచే స్కిన్ లెటైనింగ్ క్రీమ్స్ రాయడం.  లేజర్ చికిత్స చేయించుకోవడం
లెంటిజిన్స్ : ఇవి కూడా సూర్యుడి వల్ల వచ్చే మచ్చలు కాబట్టి వీటిని ‘సన్‌స్పాట్స్’ అని అంటారు. అయితే ఇవి వయసు పెరుగుతున్నకొద్దీ  వృద్ధుల చర్మంపై చుక్కలుచుక్కలుగా కనిపిస్తుంటాయి.
చికిత్స : ముందు పేర్కొన్న చికిత్సలే వీటికీ పనికివస్తాయి.
యాక్టినిక్ కెరటోసిస్ : ఇవి తేనెరంగులోనూ, గోధుమరంగులోనూ ఉండే మచ్చలు. సాధారణంగా ఇవి నుదురు, కణతల వద్ద కొంతమందిలో వస్తుంటాయి. ఇలాంటి మచ్చలు ఒక్కోసారి క్యాన్సర్‌కు ముందుదశగా కనిపించవచ్చు.
చికిత్స : వీటిని ఎంత త్వరగా గుర్తించి, తగిన చికిత్స తీసుకుంటే అంత మేలు. సాధారణంగా ప్రికిల్స్‌కు చేసే చికిత్సే దీనికీ ఉపకరిస్తుంది.
ఎఫ్‌డీఈ : ‘ఫిక్స్‌డ్ డ్రగ్ ఎరప్షన్’ అనే ఈ సమస్య కొన్ని మందులు తీసుకున్నప్పుడు, అవి వారికి సరిపడకపోవడం  మచ్చల రూపంలో వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. ఈ మచ్చలు ముఖంపైనా, పెదవులపైనా కనిపించవచ్చు. ఫలానా మందు సరిపడకపోవడం వల్ల ఇవి వస్తున్నాయని గుర్తించి... ఆ మందు ఆపేసిన రెండుమూడు వారాల్లో ఇవి వాటంతట అవే తగ్గిపోతాయి.

ఇలాంటి మచ్చలకు కారణమయ్యే మందులివి... నిమెల్యుసైడ్, ప్రిమాక్విన్, సల్ఫర్ ఉన్న మందులతో ఈ సమస్య వస్తుంది.
చికిత్స : ప్రికిల్స్‌కు చేసే చికిత్సే దీనికీ పనిచేస్తుంది.
ఎకాంథోసిస్ నెగ్రిక్యాన్స్ : మన శరీరం ఇన్సులిన్‌కు ప్రతికూలంగా పనిచేయడం (ఇన్సులిన్ రెసిస్టెన్స్) వల్ల లేదా స్థూలకాయం వచ్చినప్పుడు ఈ తరహా మచ్చలు వస్తాయి. సాధారణంగా ఇవి నుదురు, గదమ (చుబుకం), మెడ వెనక భాగంలో నల్లగా దళసరిగా  ఏర్పడతాయి.
చికిత్స : ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను సరిచేయడం  శరీర బరువును తగ్గించుకోవడం  పై రెండు సూచనలను అనుసరిస్తూ, ప్రికిల్స్‌కు తీసుకునే చికిత్సనే కొనసాగిస్తే మంచిది. ఆ సూచనలను పాటించకుండా కేవలం చికిత్స మాత్రమే ఇస్తే తగిన గుణం కనిపించకపోవచ్చు.  
పీడీఎల్ : పిగ్మెంటరీ డిమార్కెటింగ్ లైన్స్ అనే ఈ కండీషన్ దక్షిణ ఆసియా దేశాల వారిలో చాలా ఎక్కువ. ఇవి కంటి చుట్టూ, చెంపలపైనా, పెదవుల చుట్టూ వస్తాయి  మహిళల్లో హార్మోన్ల అసమతౌల్యత ఉన్నవారిలో ఇవి మరింత ఎక్కువగా కనిపిస్తుంటాయి. గర్భందాల్చిన వారిలో చాలా సాధారణం. ఎండలో తిరిగినా కనిపిస్తాయి.
చికిత్స : ప్రికిల్స్‌కు తీసుకునే చికిత్సే దీనికీ పనిచేస్తుంది. అయితే ఇవి చికిత్సకు అంతగా లొంగవు. ఇవి తగ్గాలంటే నిరవధికంగా మెయింటెనెన్స్ చాలా ఎక్కువ అవసరం.
డర్మటోసెస్ పాప్యులోజా నిగ్రా : ఇవి ముఖంపై ఉబికినట్లుగా కనిపించే చిన్న  మచ్చలు. వీటిని వదిలేస్తే పులిపిరి కాయలుగా మారే అవకాశం ఉంది. ఇవి మెడ, లేదా శరీరంలోని పైభాగంలో ఎక్కడైనా రావచ్చు. ముఖంపైన కూడా రావచ్చు. ఇవి సాధారణంగా వంశపారంపర్యంగా వస్తుంటాయి.
చికిత్స : అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ చికిత్స లేదా ఎలక్ట్రో కాటరీ చికిత్స.
ఇలా రకరకాల మచ్చలకు తగిన చికిత్స తీసుకోవడం ద్వారా వాటిని తొలగించుకోవచ్చు. పుట్టుమచ్చలు, సెబోరిక్ కెరటోసిస్‌కు వచ్చే మచ్చలకూ ఇదే చికిత్స పనికివస్తుంది.
 
 
మెలాస్మా : ఇది ఆసియా ఖండానికి చెందినవారిలో కనిపించే చాలా సాధారణమైన సమస్య. వాడుక భాషలో దీన్ని ‘మంగు’ అని అంటారు. ముఖంపై ముక్కుకు ఇరువైపులా సీతాకోకచిలుక ఆకృతిలో నల్లమచ్చ వచ్చి కనిపిస్తుంది. ఇది సాధారణంగా వంశపారంపర్యంగా వస్తుంటుంది. మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వారిలో వచ్చే హార్మోన్ల అసమతౌల్యత, సూర్యకాంతిలో ఎక్కువగా తిరగడం  మెలాస్మా సమస్యకు దోహదం చేస్తుంది. కొంతమందిలో గర్భందాల్చినప్పుడు ఇది కనిపిస్తుంది. అప్పుడు దీన్ని క్లొయాస్మా అంటారు.
చికిత్స : ప్రికిల్స్‌కు చేసే చికిత్స దీనికీ పనిచేస్తుంది. కొన్నిసార్లు చికిత్స తీసుకుంటున్నా ఇది మళ్లీ తిరగబెడుతూ ఉండవచ్చు.
 
 డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
 చీఫ్ డర్మటాలజిస్ట్,
 త్వచ స్కిన్ క్లినిక్,
 గచ్చిబౌలీ, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement