తెలివైన సింగర్...జస్టిన్ బీబర్
బేబీ, యాజ్ లాంగ్ యాజ్ యు లవ్ మీ పాటలతో హోరెత్తిస్తూ రెండు పదుల వయసు కూడా దాటకుండానే .. వందల కోట్లు కూడబెట్టేశాడు జస్టిన్ బీబర్. ఏటా సుమారు రూ. 300 కోట్ల పైచిలుకు ఆదాయం అందుకుంటున్నాడు. ఆడుతూ పాడుతూ గత రెండేళ్లలో రూ. 660 కోట్లు సంపాదించాడు. కడు పేదరికం నుంచి కరోడ్‌పతి దాకా ఎదిగిన ఈ టీనేజ్ సెన్సేషన్ పాటల్లోనే కాదు వ్యాపారంలో కూడా దిట్ట. తన పాపులారిటీని ఎలా క్యాష్ చేసుకోవాలో బాగా తెలిసినవాడు.
30 సెకన్ల యాడ్‌లో కనిపించినందుకు పది లక్షల డాలర్లు తీసుకున్నాడు బీబర్. ఒకవైపు పాటల రికార్డు అమ్మకాలు మరోవైపు కాన్సర్ట్‌లు, తన పేరుతో దుస్తులు, క్యాప్‌లు వంటి ఉత్పత్తుల అమ్మకాలు, స్పాన్సర్‌షిప్ డీల్స్.. వీటితో పాటు అప్పుడప్పుడు సినిమాలు మొదలైన వాటితో బ్యాంకు బ్యాలెన్సులు భారీగా పెంచుకుంటున్నాడు. వీటికి మాత్రమే పరిమితం కాలేదు బీబర్.
ఇన్వెస్టరు అవతారం కూడా ఎత్తాడు. డబ్బులకు కటకటలాడే టీనేజర్లు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎక్కువగా సోషల్ మీడియాను ఆశ్రయిస్తారు కాబట్టి.. ఈ తరహా స్టార్టప్స్ ద్వారా వారికి చేరువై రాబడి మరింత పెంచుకోవాలని ఎంచుకున్నాడు బీబర్. అందుకే, ప్రధానంగా టెక్నాలజీ సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. టైనీచాట్ అనే మెసేజింగ్ ప్లాట్‌ఫాంలో ఇన్వెస్ట్ చేశాడు. అలాగే సోషల్ మీడియా యాప్ స్టాంప్డ్‌లో కూడా పెట్టుబడులు పెట్టాడు.
అటు సోజో స్టూడియోస్ అనే గేమింగ్ కంపెనీలో, స్పాటిఫై అనే మరో సంస్థలో సైతం ఇన్వెస్ట్ చేశాడు. మిగతా స్టార్స్ లాగా యాడ్స్ చేసి ప్రతిఫలంగా కంపెనీలో వాటాలు తీసుకోవడం కాకుండా పక్కా క్యాష్‌తోనే పెట్టుబడులు పెట్టేందుకు ప్రాధాన్యం ఇస్తాడు బీబర్. అలాగే పనిలో పనిగా కాస్త ముందు చూపుతో రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేశాడు. 60 లక్షల డాలర్లతో కాలిఫోర్నియాలో 9,000 చ.అ. మాన్షన్‌ని, హాలీవుడ్ హిల్స్‌లో మరో 1.1 కోటి డాలర్లతో ఇంకో ప్రాపర్టీని కొని పెట్టుకున్నాడు.