రాణివ్వండి | Britain is Queen and Family | Sakshi
Sakshi News home page

రాణివ్వండి

Published Fri, May 10 2019 12:08 AM | Last Updated on Fri, May 10 2019 4:57 AM

Britain is Queen and Family - Sakshi

ఆకలయిందాడైనింగ్‌ టేబుల్‌ మీదకు వచ్చామాతిన్నామావెళ్లిపోయామా..ఇదేం కుదరదు ప్యాలెస్‌లో.రాణిగారు రావలసిందేరూల్సన్నీ ఫాలో అవాల్సిందే!రాణిగారు రాకపోతే..?రానివ్వండి అంటారంతే..!

వంద దేశాలు కలిస్తే అమెరికా.వంద పద్ధతులు కలిస్తే బ్రిటన్‌. బ్రిటన్‌ అంటే రాణిగారు అండ్‌ ఫ్యామిలీ. రాణిగారింట్లో.. కూర్చున్నా రాయల్‌గానే కూర్చోవాలి. నిలుచున్నా రాయల్‌గానే నిలుచోవాలి. మెట్లు ఎక్కుతున్నా, దిగుతున్నా రాయల్‌గానే ఎక్కాలీ దిగాలి. ఇంటి ఆడపడుచులు రాణిగారికి మోకాళ్ల మీద కాస్త వంగి అభివాదం చెయ్యాలి. అదీ ఎవరూ గమనించకుండా క్షణాల్లో చేసేయాలి! అంతఃపుర వనితలు దుస్తులు సరిగా వేసుకోవాలి. ఒంటి మీద అవి కుదురుగా ఉండాలి. తలపై టియారా (అర్ధ చంద్రాకారపు ఆభరణం) ధరించాలి. ఇంట్లో పిల్లలు గానీ, పెద్దలు గానీ ‘మోనోపలి’ (బిజినెస్‌ గేమ్‌) ఆడకూడదు. ఎక్కడికైనా వెళ్లినా, కూర్చున్నా అంతా ఒక ఆర్డర్‌లోనే ఉండాలి.

(మొదట రాణి గారు. తర్వాత ఆమె భర్తగారు. తర్వాత ఆమె కొడుకు గారు. తర్వాత ఆ కొడుకు భార్యగారు. తర్వాత కొడుకు పెద్ద కొడుకు గారు. తర్వాత ఆ పెద్దకొడుకు భార్యగారు.. ఇదీ లైన్‌!). షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడానికి, తీసుకోడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. అలాగే రాచకుటుంబీకులెవరూ బ్రిటన్‌ ఎన్నికల్లో ఓటు వేయకూడదు. ఆటోగ్రాఫ్‌లు ఇవ్వకూడదు. అమెరికన్‌ అమ్మాయి మేఘన్‌ మార్కల్‌ బ్రిటన్‌ రాచకుటుంబానికి కొత్త సభ్యురాలిగా వచ్చాక ఈ పద్ధతుల్లో కొన్ని బ్రేక్‌ అయ్యాయి. రాణిగారు చూసీ చూడనట్లు పోనిచ్చారు. తోడికోడలు (భర్త అన్నగారు ప్రిన్స్‌ విలియమ్‌ సతీమణి కేట్‌ మిడిల్టన్‌) దగ్గరుండి కొన్ని పద్ధతులు నేర్పించారు.

ఇప్పుడు మళ్లీ రాజప్రాసాదంలో సందడి మొదలైంది. ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ దంపతులకు పెళ్లయి ఏడాది అవుతుండగా బకింగ్‌హ్యాప్‌ ప్యాలెస్‌కి మరో కొత్త మెంబర్‌ వచ్చాడు. సోమవారం మేఘన్‌ మార్కల్‌ పండంటి కొడుక్కి జన్మనిచ్చారు. వాడికీ ఈ పద్ధతులు తప్పనివే. అయితే కొంత టైమ్‌ పడుతుంది. ఊహ వచ్చేవరకు వాడేం చేసినా, ఎలా ఉన్నా ఎవరూ పట్టించుకోరు. ఇప్పుడిక రాణిగారింటి విందుల సమయమిది. కనీసం కొన్నాళ్ల వరకైనా అయినవాళ్లు, అతిథులు వచ్చిపోతుంటారు. ఆ ఆతిథ్యం అంతా కూడా రాచకుటుంబ పద్ధతులకు అనుగుణంగానే ఉంటుంది. ఒక్క మాటలో దానిని ‘టేబుల్‌ మేనర్స్‌’ అనలేం. ‘భోజన సంప్రదాయం’ అనే మాటేదో అనాలి. 

నో తొందర.. నో నిదానం
అమెరికాలోని ముప్ఫైమూడు కోట్ల మందిలో ఎవరిష్టం వాళ్లది. బ్రిటన్‌లో మాత్రం.. అంత పెద్ద రాచకుటుంబం అయినా సరే అందరూ ఒకే ట్రాక్‌ మీద ఉండాలి. మేఘన్‌మార్కల్‌ అమెరికా అమ్మాయి కనుకే ఈ పోలిక తేవడం. డైనింగ్‌ దగ్గరా అంతే. ఇష్టమైన ఐటమ్స్‌ వేర్వేరుగా ఉండొచ్చు. పద్ధతుల పాటింపును మాత్రం ఎవరూ తప్పకూడదు. భోజనానికి త్వరపడకూడదు. భోజనానికి ఆలస్యం చేయకూడదు. భోజనం త్వరగా చేసేయకూడదు.

మరీ నెమ్మదిగా భోజనం చేయకూడదు. భోంచేస్తున్నప్పుడు ఏ చేతిలో ఉండాల్సిన స్పూన్, ఫోర్క్‌ ఆ చేతిలోనే ఉండాలి. అల్లరల్లరిగా భోజనం చేయకూడదు. భోజనం అయ్యాక పాత్రలు, డైనింగ్‌ టేబులూ కదిలేలా కుర్చీల్లోంచి లేవకూడదు. క్వీన్‌ ఎలిజబెత్‌కి ఫుడ్డును వేస్ట్‌ చెయ్యడం ఇష్టం ఉండదు. అంతా తిని లేచాక గిన్నెల్లో ఆహార పదార్థాలు మిగిలిపోతే, వాటిని రూపురేఖలు మార్చి తర్వాతి భోజనానికి సిద్ధం చేయమని వంటవాళ్లకు చెబుతారు రాణిగారు! 

వెల్లుల్లికి అల్లంత దూరం
అంతఃపుర వంటశాలలో వెల్లుల్లి వాడకమే ఉండదు. ఘాటైన ఆ వాసనకు నోటి దుర్వాసన వస్తుందని రాజ కుటుంబం తమ వంటల్లో వెల్లుల్లిని ఏళ్ల క్రిందటే నిషేధించింది. రాణి గారి పెద్ద కుమారుడు ప్రిన్స్‌ చార్ల్స్‌ అందరూ తినే కాయగూరలు తినరు. ఆయన తనకై తాను పండించుకున్నవే తింటారు! ఆయనకో తోట ఉంది. ఆ తోటలో తనకు ఇష్టమైన కూరగాయల్ని ఎరువులు వాడకుండా పండించుకుంటారు. రాణిగారింట్లో పెంకు చేపల్ని (షెల్‌ ఫిష్‌) తినడం నిషిద్ధం. పెంకు చేపల్ని తింటే ఎంతటి ఆరోగ్యవంతులైనా తేలిగ్గా జబ్బున పడతారని ఇంగ్లండ్‌లో ఒక నమ్మకం. అదే నమ్మకం రాచకుటుంబానికీ ఉంది. అయితే ఈ నిషేధాన్ని కుటుంబంలోని యంగ్‌ జనరేషన్‌ చాటు మాటుగా బ్రేక్‌ చేస్తుంటారట.

ఏళ్లతరబడి వాళ్ల వంట శాలలో పని చేసి బయటికి వచ్చిన షెఫ్‌లు మంచి మూడ్‌లో ఉన్నప్పుడు ఇలాంటివి బయపెడుతుంటారు. ప్రిన్స్‌ చార్ల్స్‌ తన భోజనాన్ని ఎవరితోనూ షేర్‌ చేసుకోడానికి ఇష్టపడరు. అందుకే రాయల్‌ షెఫ్స్‌ ఆయన కోసం వండినవి ఎవరికీ వడ్డించకుండా జాగ్రత్త పడతారు. రాణిగాకి సైడ్‌ డిష్‌గా పెద్ద బౌల్‌ నిండా కాయగూరల సలాడ్స్‌ ఉండాలి. మధ్యమధ్య వాటిని భుజిస్తూ, ముఖ్యాహారాన్ని ఆరగిస్తారు. డార్క్‌ చాక్లెట్‌ బిస్కెట్‌లంటే రాణిగారికి మహా ప్రీతి. పర్యటనలకు, విహారాలకు వెళ్లినప్పుడు కూడా ఇంటి నుంచి ఆమె డార్క్‌ చాక్లెట్‌ బిస్కెట్లు తీసుకుని వెళ్తారు.

పర్సు తీశారంటే ఫినిష్‌!
డైనింగ్‌ టేబుల్‌ మీద ఆ పూట పాస్తా ఉందంటే ప్రత్యేక సందర్భం ఏదో ఉందనే అర్థం. ఎప్పుడో కానీ ప్యాలెస్‌ డైనింVŠ టేబుల్‌పై పాస్తా కనిపించదు. డిన్నర్‌ పార్టీలప్పుడు మస్ట్‌గా ఉంటుంది. వడ్డన సేవకులకు రాచ కుటుంబీకులు ఏదీ నేరుగా చెప్పరు. టేబుల్‌ మీద ఫోర్క్‌పై, నైఫ్‌ని అడ్డంగా పెడితే ప్లేట్‌లకు చేతుల్ని, గరిటెల్ని తాకించవద్దని చెప్పడం. రాణిగారి భోజనం పూర్తయితే ఇక మిగతావాళ్లెవరూ తినడానికి లేదు. అందరూ ఆపేయాల్సిందే. రాణిగారి కన్నా ఎవరూ ముందు మొదలెట్టడానికి లేదు. పిల్లలైనా సరే! తింటూ తింటూ రాణిగారు బల్లమీద తన పర్సు పెట్టారంటే కుటుంబ సభ్యులకు గానీ, అతిథులకు గానీ ఐదునిముషాల్లో భోజనం ముగించాలని సంకేత పరచడం.

రాణిగారు తన కుడివైపు కూర్చొని ఉన్న వారితో మాటకలుపుతూ భోంచేయడం ప్రారంభిస్తారు. రెండో వడ్డనలో తన ఎడమవైపు కూర్చొని ఉన్నవారితో మాట కలుపుతూ భోజనం కొనసాగిస్తారు.  స్పూన్‌తో తింటున్నప్పుడు ఆహారాన్ని సరిగ్గా బ్యాలెన్స్‌ చేసుకుంటూ నోట్లో ఉంచుకోవడం కోసం ఫోర్క్‌ వెనుక భాగాన్ని ఉపయోగించాలి. అందుకోసం ఫోర్క్‌ని ఎడమ చేతిలో ఉంచుకోవాలి. ఒక రోజులోని భోజనాలన్నిటికీ కూడా డైనింగ్‌ హాల్‌కి ఒకే విధమైన ఫార్మల్‌ డ్రెస్‌లో వెళ్లాలి. అన్నట్లు రాణిగారికి డార్క్‌ చాక్లెట్‌ బిస్కెట్‌లతో పాటు మామిడి పండ్లన్నా కూడా మహా ఇష్టం.  

అసలు రాణిగారితో భోజనం అంటేనే తినే ఐటమ్స్‌ కన్నా, పాటించాల్సిన రూల్సే ఎక్కువగా ఉంటాయి. ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ల పెళ్లికి అనుబంధంగా జరిగిన విందుల్లో ఆ రూల్స్‌ అన్నిటినీ ఆ అమెరికా అమ్మాయి మేఘన్‌ తప్పని సరిగా పాటించవలసి వచ్చింది. మినహాయింపులేమీ లభించలేదు. కనీసం రెండు రూల్స్‌ అయితే తప్పనిసరి. డైనింగ్‌ చైర్‌ మీద రాణిగారు కూర్చున్నాకే మిగతావాళ్లు కూర్చోవాలి. అదీ ఆర్డర్‌లో. ఇది రూల్‌ నెంబర్‌ వన్‌. రాణిగారు భోజనం పూర్తవ్వగానే మిగతావారూ తమ భోజనాన్ని ముగించాలి. ఇది రూల్‌ నెంబర్‌ టూ. 

రాణిగారికి అబద్ధాలు!
వలసలు పెరిగినప్పుడు పద్ధతులు తగ్గుముఖం పడతాయి. వయసు పెరుగుతున్నప్పుడు పద్దతుల పాటింపు ఓపికా తగ్గుతుంది. రాణిగారి ప్యాలెస్‌లో డిన్నర్‌కి అంతా ఒకే టైమ్‌కి రావాలి. అది రూలు. రాణిగారు వస్తే కానీ భోజన కార్యక్రమం మొదలవదు. అయితే కొన్నిసార్లు రాణిగారు రావడం ఆలస్యం అయ్యేది. అప్పటికే ఆకలితో నకనకలాడుతున్నవారు రాణి గారి కోసం ఎదురుచూస్తూ ఉండేవారు. ఇక అలా లాభం లేదని భోజన సమయాన్ని ఇవతలికి జరిపి రాణిగారికి వర్తమానం పంపేవారు. డిన్నర్‌ రాత్రి తొమ్మిది గంటలకు అనుకుంటే.. ఎనిమిదీ నలభై ఐదుకు అని చెప్పేవారు. అలాగే అందరికీ ఎనిమిదిన్నరకు అని చెబితే, రాణిగారికి మాత్రం ఎనిమిదింపావుకే అని కబురు చేరవేసేవారు. అలా అనేకసార్లు అబద్దాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయని షెప్‌ గార్డన్‌ బయటపెట్టారు.

వంటింట్లోకి రాణిగారి భర్త!
1982–1993 మధ్య కాలంలో డారెన్‌ మెక్‌గ్రేడి అనే ఆయన రాణిగారి కుటుంబ సభ్యులకు పర్సనల్‌ షెప్‌గా పని చేశారు. ఆయన రిౖటñ ర్‌ అయ్యి బయటికి వచ్చాక కొన్ని ఆసక్తికరమైన సంగతులు కూడా ఆయనతోపాటు బయటికి వచ్చాయి. అవన్నీ పద్ధతులు బ్రేక్‌ అయిన సందర్భాలు. ఫిలిప్‌ ఓసారి వంటగదికి వెళ్లారు. అక్కడ పదుల సంఖ్యలో వంట సిబ్బంది ఉంటారు. ఫిలిప్‌ అంటే క్వీన్‌ ఎలిజబెత్‌ భర్త. ఆయనంతటి వారు డైనింగ్‌ హాల్‌లో కనిపించాలి కానీ, కిచెన్‌లోనా! సిబ్బంది అంతా ఒక్కసారిగా అలెర్ట్‌ అయ్యారు. ‘‘రాత్రికి డిన్నర్‌లోకి ఏముంది?’’ అని అడిగారు ఫిలిప్‌.

‘‘మీ కోసం చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయించిన లేత మాంసం ఉంది యువర్‌ రాయల్‌ హైనెస్‌’’ అని చెప్పాడు షెఫ్‌ డారెన్‌. ‘‘ఆ వైపున ఉన్నదేమిటి?’’ అని అడిగారు ఫిలిప్‌. ‘‘అవి మాకోసం చేసుకున్న చాప్స్‌’’ అని చెప్పాడు షెఫ్‌. ‘మా కోసం’ అంటే కిచెన్‌ సిబ్బంది కోసం. చాప్స్‌ అంటే పెద్ద పెద్ద ముక్కలుగా వేయించిన మాంసం. ‘‘అయితే అవే నాకూ కావాలి’’ అని చాప్స్‌ తెప్పించుకుని తిన్నారు ఫిలిప్‌ ఆ రాత్రి డిన్నర్‌లో!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement