పిల్లలూ... పెద్దలూ... బ్రష్‌ చేసుకోండిలా! | Brushing Habits Can Help Protect Teeth | Sakshi
Sakshi News home page

పిల్లలూ... పెద్దలూ... బ్రష్‌ చేసుకోండిలా!

Published Sat, Sep 21 2019 1:28 AM | Last Updated on Sat, Sep 21 2019 1:28 AM

 Brushing Habits Can Help Protect Teeth - Sakshi

మనం బ్రషింగ్‌ ప్రక్రియను చాలా తేలిగ్గా తీసుకుంటాం. కానీ మంచి బ్రషింగ్‌ అలవాట్ల వల్ల దాదాపు జీవితకాలమంతా మన దంతాలను రక్షించుకోవచ్చు. జీవితాంతం మన స్వాభావిక దంతాలతోనే హాయిగా నమిలి తింటూ, ఎన్నెన్నో రుచులు ఆస్వాదించవచ్చు. ఇలా రోజూ మంచి బ్రషింగ్‌ అలవాట్లను అనుసరిస్తే... భవిష్యత్తులో దంతవైద్యం కోసం వెచ్చించాల్సిన ఖర్చులూ తగ్గుతాయి. అందుకే వీటిని అనుసరించండి. దంతాలు మెరిపిస్తూ మంచి చిరునవ్వుతో హాయిగా ఉండండి.

పిల్లల బ్రషింగ్‌ కోసం సూచనలివి...  
►చంటి పిల్లల తల్లులు మొదట తల్లులు తమ నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చాలా సందర్భాల్లో తల్లులు, పిల్లలు ఒకే చెంచాను ఉపయోగిస్తుంటారు. అందువల్ల తల్లుల నోట్లోని బ్యాక్టీరియా పిల్లల లాలాజలంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువ. అందుకే తల్లులు జాగ్రత్తగా ఉండాలి. తమ కోసం విడిగా చెంచాను ఉంచుకోవాలి. పిల్లల కోసం ఉద్దేశించిన చెంచాను ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదు.


►ప్రతిసారీ పిల్లలకు పాలుపట్టాక వాళ్ల నోటిని తడి గుడ్డతో గానీ, మామూలు నీళ్లలో  ముంచిన దూదితో గానీ శుభ్రం చేయాలి. పాలపళ్లు వచ్చాక టూత్‌బ్రష్‌తో పళ్లు శుభ్రం చేసుకునేలా శిక్షణ ఇవ్వాలి. రెండేళ్ల వయసు కంటే ముందే ఫ్లోరైడ్‌ టూత్‌పేస్ట్‌ వాడాలనుకుంటే మొదట డెంటిస్ట్‌ను కలిసి వారి సలహా తీసుకోవాలి.

►పిల్లలు ఊయగలరు, టూత్‌పేస్ట్‌ను మింగబోరని నిర్ధారణ అయ్యాక వాళ్ల టూత్‌బ్రష్‌పై బఠాణీగింజంత టూత్‌పేస్ట్‌ వేసి వాళ్లు పళ్లు తోముకునేలా చేయాలి.

►చిన్నారులకు ఆరేళ్ల వయసు వచ్చే వరకు తల్లిదండ్రులే బ్రష్‌ చేస్తుండటం మంచిది.

►చక్కెర కలిపిన జ్యూస్‌ల వంటి ద్రవాహారాలను పాల బాటిళ్లలో ఇవ్వవద్దు.

►పిల్లలు నిద్రపోవడానికి ముందే పాలుపట్టడం పూర్తిచేయండి. వాళ్లు నిద్రపోయాక ఎట్టిపరిస్థిల్లోనూ బాటిల్‌ను అలాగే నోట్లో ఉంచవద్దు. బాటిల్‌ నోట్లో పెట్టేసి మరచిపోవద్దు. దాని వల్ల పళ్లన్నీ పుచ్చిపోయి ‘నర్సింగ్‌ బాటిల్‌ కేరిస్‌’ అనే పళ్లసమస్య వచ్చే ప్రమాదం ఉంది.

►పిల్లల మొదటి పుట్టినరోజు నాటి నుంచే... కప్స్‌ సహాయంతో  వాళ్లు ఆహారాన్ని చప్పరించి తీసుకునేలా ప్రోత్సహించండి.

►పిల్లలు ఘనాహారం తీసుకోవడం మొదలుపెట్టాక... వారు మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా అలవాటు చేయండి. ఆహారంలో ఆకుకూరలు, పళ్లు, కాయధాన్యాలు ఎక్కువగా తినేలా, ఆహారం తీసుకునేప్పుడు చక్కెర పదార్థాలు తక్కువగా తినేలా చూడండి. తినగానే నోరు పుక్కిలించేలా జాగ్రత్త తీసుకోండి.

►ఇక బ్రషింగ్‌ విషయానికి వస్తే... పిల్లలు ఉపయోగించే బ్రష్‌ మృదువైన బ్రిజిల్స్‌ ఉన్నదై ఉండాలి.

►పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్‌ చేసుకునేలా వారికి బ్రషింగ్‌ నేర్పాలి.
 
►బ్రష్‌ చేసుకునే సమయంలో చాలా మృదువుగా బ్రష్‌ చేసుకోవడం నేర్పాలి. రఫ్‌గా బ్రష్‌ చేసుకోవడం పిల్లల చిగుళ్లకు హాని జరగవచ్చు.  

►పంటికి బయటివైపే కాదు... లోపలి వైపునా బ్రష్‌ చేసుకోవడం వారికి నేర్పాలి.  

►పిల్లలు అదేపనిగా బ్రష్‌ను నములుతూ ఉండకుండా చూసుకోవాలి. ఆ అలవాటును ప్రోత్సహించవద్దు.

►బ్రష్‌ చేసుకునే ప్రక్రియ కనీసం రెండు నిమిషాల పాటు కొనసాగాలి. మరీ ఎక్కువ సేపు కూడా బ్రషింగ్‌ చేయకుండా చూడాలి.

►నాలుకపైనున్న బాక్టీరియాను తొలగించుకునేలా టంగ్‌క్లీనింగ్‌ కూడా పిల్లలకు నేర్పాలి.

►చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్‌ చేసినట్లు రుద్దితే దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

పెద్దలు బ్రషింగ్‌ ఎలా చేసుకోవాలంటే...
►పెద్దలు ప్రతిరోజూ క్రమం తప్పకుండా రెండుమార్లు పళ్లు తోముకోండి. కొందరు రాత్రివేళ బ్రషింగ్‌ అనవసరం అనుకుంటారు. కానీ మన ఆరోగ్యమంతా చాలాకాలం పాటు బాగుండాలంటే రాత్రి బ్రషింగ్‌ చాలా అవసరం.

►ఆర్నెల్లకోమారు మీ డెంటిస్ట్‌ను  కలిసి అవసరమైన పరీక్షలు చేయించుకోండి.

►మీరు బ్రష్‌ చేసుకునేందుకు మృదువైన బ్రిజిల్స్‌ ఉన్న బ్రష్‌నే వాడండి.

►డాక్టర్లు సూచించే ప్రత్యేకమైన మెడికేటెడ్‌ టూత్‌పేస్ట్‌లు మినహా మిగతా టూత్‌పేస్ట్‌లన్నీ బ్రష్షింగ్‌ సమయంలో ఘర్షణను (ఫ్రిక్షన్‌ను) తగ్గిస్తాయి. కాబట్టి ఫలానా టూత్‌పేస్ట్‌ మాత్రమే మంచదని అనుకోకండి. మీకు సంతృప్తి కలిగేదాన్ని  ఎంచుకోండి. ఏవైనా దంతసమస్యలు వస్తే డాక్టర్లు ఎలాగూ ప్రత్యేకమైన వాటిని సూచిస్తారు.

►పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్‌ చేసుకోండి.

►బ్రష్‌ చేసుకునే సమయంలో చాలా మృదువుగా బ్రష్‌ చేసుకోండి. రఫ్‌గా బ్రష్‌ చేసుకుంటే అది మీ చిగుళ్లకు హాని చేకూర్చవచ్చు. అప్పుడు చిగుళ్లు త్వరగా వ్యాధుల బారినపడే అవకాశం ఉంటుంది.

►మీ పంటికి బయటివైపే కాదు... లోపలి వైపునా బ్రష్‌ చేసుకోవాలి. నమిలే ప్రదేశాలల్లో పంటిపైన వెడల్పుగా ఉంటే ప్రాంతంలోనూ బ్రష్‌ చేసుకోవాలి.

►లోపలివైపున బ్రష్‌ చేసుకోడానికి బ్రష్‌ను నిలువుగా పట్టుకొని పైకీ, కిందికీ మృదువుగా కదిలించండి.

►కనీసం రెండు నిమిషాల పాటు బ్రష్‌ చేసుకోవాలి.

►నాలుకపైనున్న బ్యాక్టీరియాను తొలగించుకోడానికి కనీసం 30 సెకన్ల పాటు స్క్రబ్‌ చేయండి.

►బ్రష్షింగ్‌ తర్వాత టూత్‌బ్రష్‌ను మృదువుగా రుద్దండి.

►చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్‌ చేసినట్లు రుద్దితే దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

►ప్రతి మూడు నెలలకు ఓమారు బ్రష్‌ను మార్చేయండి. లేదా బ్రిజిల్స్‌ వంగినట్లు, దెబ్బతిన్నట్లు కనిపించినా బ్రష్‌ను వెంటనే మార్చండి. ఒకసారి మీకేదైనా జ్వరం వచ్చి తగ్గాక పాత టూత్‌బ్రష్‌ను వెంటనే మార్చండి. దాన్ని అలాగే కొనసాగించకండి.

►పిల్లల బ్రష్‌లైనా లేదా పెద్దలవైనా... బ్రష్‌ ఉపయోగించాక వాటిని టాయిలెట్‌ ఉన్న గదిలో ఉంచకూడదు. పక్కన  ఆ గది బయట వాటిని విడిగా ఉంచాలి. ఎందుకంటే... మనం ఫ్లష్‌ చేసే సమయాల్లో టాయిలెట్‌లో ఉన్న బ్యాక్టీరియా మన బ్రిజిల్స్‌కు అంటుకునే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అందుకే వాటిని టాయిలెట్‌ రూమ్‌లో ఎప్పుడూ ఉంచకూడదని గుర్తుంచుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం... మనం బ్రష్‌ చేసుకున్న తర్వాత అలా తడిగా వదిలేస్తాం. కానీ టవల్‌తో తుడవడం లాంటిది చేసి, అది పొడిబారాకే దాన్ని భద్రపరచుకోవాలి. బ్రష్‌కు క్యాప్‌లాంటి కేస్‌లు ఉంటే అది మరింత మంచిది.

డాక్టర్‌ ప్రత్యూష దంత వైద్య నిపుణులు
 ప్రొఫెసర్‌ ఓరల్‌ మెడిసిన్‌ అండ్‌ రేడియాలజీ,
కిమ్స్‌ హాస్పిటల్, సికింద్రాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement