చర్మకాంతికి...
బ్యూటిప్స్
వేసవిలో చర్మం కమలడం, చమట కారణంగా జిడ్డుగా మారుతుంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ట్యాన్, మొటిమల సమస్య బాధిస్తుంటుంది. ఈ సమస్యల నివారణకు...
♦ బార్లీ గింజలను నీళ్లలో వేసి, రాత్రంగా ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని తాగాలి. అలాగే కొద్దిగా బార్లీ నీళ్లను ముఖానికి రాసుకోవాలి. రోజూ ఇలా చేయడం వల్ల ఎండ కారణంగా కమిలిన చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుంది. అలాగే మొటిమలు, యాక్నెసమస్యలు తగ్గుతాయి. చర్మం సహజకాంతితో మెరుస్తుంది.
♦ టీ స్పూన్ బార్లీ పొడిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్, తేనె, గుడ్డులోని తెల్లసొన కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరాక శుభ్రపరుచుకోవాలి. ఎండదెబ్బకు కందిపోయిన చర్మానికి జీవకళ తీసుకువస్తుంది.
♦ ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ చొప్పన ఉల్లి, క్యారెట్ రసం, గుడ్డు సొన, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని యాక్నె, మొటిమలు ఉన్న చోట రాయాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. యాక్నె, మొటిమలు తగ్గి ముఖం కాంతిమంతం అవుతుంది.
♦ వెల్లుల్లి రెబ్బను చిదిమి, మొటిమ అయిన చోట రాయాలి. అర గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. ఇలా చేస్తే ఇన్ఫెక్షన్ తగ్గి, మొటిమల సమస్య బాధించదు.
♦ ఓట్స్, బాదంపప్పు పొడి, తేనె, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని, వేళ్లతో వలయకారంగా రుద్దుతూ సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత పది నిమిషాలు వదిలేసి, చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖ చర్మం మృదువుగా మారుతుంది.
♦ ముల్తానీమిట్టి, తేనె, బొప్పాయిపండు గుజ్జు సమభాగాలుగా తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా, కాంతివంతంగా కనిపిస్తుంది.