క్యాన్సర్ కౌన్సెలింగ్
తగ్గిన వ్యాధి తిరగబెట్టే అవకాశముందా?
మా అమ్మగారికి రొమ్ము క్యాన్సర్ ఉంది. ఆమెకు సర్జరీ చేసి, కీమోథెరపీ, రేడియోథెరపీ ఇచ్చారు. ఆమెకు ‘టామోక్సిఫెన్ 20 ఎంజీ’ టాబ్లెట్లు వాడమని సూచించారు. దాంతో ఆమె గత ఐదేళ్లుగా ఆ టాబ్లెట్లు వేసుకుంటోంది. ఇప్పుడు బాగానే ఉంది. అయితే, మళ్లీ మరో ఐదేళ్ల పాటు అదే టాబ్లెట్లను కొనసాగించమని డాక్టర్ చెబుతున్నారు. ఇలా కొనసాగించడం సరైనదేనా? మాకు తగిన సలహా చెప్పండి.
- ఎస్.ఆర్.వి., ఖమ్మం
మీ అమ్మగారు చాలా మెరుగుపడ్డారని మీ లేఖ వల్ల తెలుస్తోంది. అందుకు చాలా సంతోషం. ఇక గతంలో మీరు రాసిన మందును ఐదేళ్ల పాటే వాడేవారు. కానీ మరో ఐదేళ్ల పాటు టామోక్సిఫెన్ 20 ఎంజీ వాడటం రోగికి మరింత ప్రయోజనం చేకూరుస్తుందని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇలా ఆ మందును పదేళ్లు వాడటం వల్ల అది రొమ్ముక్యాన్సర్ మళ్లీ తిరగబెట్టకుండా మరో 15 ఏళ్ల పాటు రక్షణ ఇస్తుంది. ఈలోపు మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పరీక్ష చేయించడం మంచిది. దీనివల్ల ఆమె గర్భసంచి, ఎండోమెట్రియమ్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది.
నాకు 2005లో రొమ్ముక్యాన్సర్ వచ్చింది. చికిత్స తర్వాత పూర్తిగా తగ్గింది. ఇటీవల నాకు వెన్నునొప్పి రాగా డాక్టర్‌గారికి చూపించుకున్నాను. వారు బోన్‌స్కాన్ పరీక్ష చేసి ‘ఎల్2’ వెన్నుపూసకు క్యాన్సర్ వ్యాపించినట్లు చెప్పారు. దాంతో నేను షాక్ అయ్యాను. ఇలా పదేళ్ల తర్వాత కూడా వ్యాధి తిరగబెట్టే అవకాశం ఉందా?
- ఒక సోదరి, మిర్యాలగూడ
క్యాన్సర్లు ఏవైనా సరే... చికిత్స తర్వాత అవి ఐదేళ్లలోపు మళ్లీ తిరగబెట్టకుండా ఉంటే దాన్ని పూర్తిగా నయమైనట్లుగా డాక్టర్లు పరిగణిస్తారు. కానీ ఐదు శాతం కేసుల్లో క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంది. అందుకే క్యాన్సర్ పూర్తిగా తగ్గిన రోగులైనా సరే... వారు ప్రతి ఐదేళ్లకోసారి క్యాన్సర్ సంబంధిత లక్షణాలు ఏవైనా కనిపిస్తున్నాయా అని భౌతికంగా పరీక్షించి చూసుకోవడమే కాకుండా, కొన్నిసార్లు అవసరాన్ని బట్టి వైద్య పరీక్షలూ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ శుభవార్త ఏమిటంటే... ఐదేళ్ల తర్వాత తిరగబెట్టిన క్యాన్సర్‌ను చాలా తేలిగ్గా మళ్లీ నయం చేయవచ్చు. మీ విషయంలో ఎస్‌ఆర్‌ఎస్ (స్టీరియోస్టాటిక్ రేడియో సర్జరీ) అనే ప్రక్రియ ద్వారా ఒకే సిట్టింగ్‌లో మీకు రేడియేషన్ ఇచ్చి వ్యాధిని నయం చేసేందుకు అవకాశం ఉంది.