
క్యాన్సర్... ఆహార ప్రణాళిక!
గుడ్‌ఫుడ్
⇒ క్యాన్సర్ చికిత్సలో కీమో థెరపీ, క్రమం తప్పకుండా మందుల వాడకం ఎంత అవసరమో... డైట్ చార్ట్ కూడా అంతే అవసరం. ఆహారం తీసుకోవడంలో పాటించే నిడివి తగ్గాలి. అలాగే ఏది తినాలి? ఎలా తినాలి? అనేది ప్రధానమైన అంశం. చికిత్సకు ముందు, చికిత్స సమయంలో, ఆ తర్వాత మంచి ఆహారం తీసుకోవడం రోగులను శారీరకంగా దృఢంగా ఉంచుతుంది.
⇒ క్యాన్సర్ వ్యాధిని మాన్పడం (హీలింగ్), ఇన్షెక్షన్లను ఎదుర్కోవడం, అవసరమైన శక్తిని సమకూర్చడం అనే విషయాల్లో ప్రొటీన్లు, క్యాలరీలదే కీలక భూమిక. కాబట్టి క్యాన్సర్ రోగుల ఆహారం తగినన్ని ప్రొటీన్లు, క్యాలరీలు అందేలా ఉండాలి. రోజూ మూడు పూటల తీసుకునేందుకు బదులుగా ప్రతి గంటా – రెండు గంటలకోమారు ఆహారం తీసుకునేలా ఆహార ప్రణాళిక ఉండాలి.
⇒ శాకాహారులైతే... క్యాలరీలు, ప్రోటీన్లు అధికంగా ఉండే పదార్థాలు, తక్కువ కొవ్వుండే పాల ఉత్పాదనలు (లో ఫ్యాట్ డైరీ ప్రాడక్ట్స్), స్కిమ్‌డ్ మిల్క్ పౌడర్, తేనె, చక్కెర, నెయ్యి, పెరుగు, పాలతో చేసిన స్వీట్స్, ఫ్రూట్ మిల్క్ షేక్స్, పనీర్ వంటివి ఆహారంలో ఉండాలి. మాంసాహారం తీసుకునే వారైతే... చికెన్, చేపలు, గుడ్లు వంటివి తినవచ్చు. డ్రైఫ్రూట్స్, నట్స్ వంటి వాటి ద్వారా కూడా ప్రోటీన్లు, క్యాలరీలు ఎక్కువగా దొరుకుతాయి. ఈ సాధారణ సూచనలతో పాటు రోగి వ్యక్తిగత అంశాలను పరిగణనలోకి తీసుకొని న్యూట్రిషనిస్ట్ సలహా మేరకు ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది.
⇒ క్యాన్సర్ పేషెంట్లు... అన్ని పోషకాలు... (విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, నీరు) ఉండే సమతుల ఆహారం తీసుకోవాలనేది మర్చిపోకూడదు. ఎందుకంటే దేహం... చికిత్సను తట్టుకోవాలి, వ్యాధిని అరికట్టాలి... ఇందుకు మానసిక ధైర్యంతోపాటు శారీరక దృఢత్వం ఉండాలి.