రక్తపరీక్షతోనే... క్యాన్సర్ నిర్ధారణ | Cancer is diagnosed with a blood test | Sakshi
Sakshi News home page

రక్తపరీక్షతోనే... క్యాన్సర్ నిర్ధారణ

Published Tue, Jun 7 2016 11:15 PM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM

రక్తపరీక్షతోనే...   క్యాన్సర్ నిర్ధారణ

రక్తపరీక్షతోనే... క్యాన్సర్ నిర్ధారణ

లేటెస్ట్

 

క్యాన్సర్...ఇవాళ్టికీ అందరూ భయపడే వ్యాధుల్లో ఒకటి. క్యాన్సర్ బారిన పడితే చికిత్స, ఆరోగ్య సంరక్షణ విషయంలో చాలా శ్రమించాలని బెంగపడుతుంటారు. ఆ మాటకొస్తే, క్యాన్సర్ వచ్చినట్లు కనిపెట్టడానికి చేసే పరీక్షలు కూడా కొంత క్లిష్టమైనవే. కణజాలంలో వచ్చిన అసాధారణమైన పెరుగుదలను గుర్తించి, ఆ కణితి (ట్యూమర్)ని సూదితో కానీ, శస్త్రచికిత్స ద్వారా కానీ కొద్దిగా కత్తిరించి, దాన్ని బయాప్సీ చేసి, వచ్చిన ఫలితాలను బట్టి క్యాన్సర్‌ను నిర్ధారించడమనేది సర్వసాధారణంగా అనుసరించే పద్ధతి. కానీ, అంత శ్రమ లేకుండా చాలా వ్యాధుల లాగానే కేవలం మామూలు రక్త పరీక్ష ద్వారానే క్యాన్సర్‌ను గుర్తించే సౌకర్యం వస్తే? ఎంత బాగుండు కదూ! శుభవార్త ఏమిటంటే, ఆ రోజులు వచ్చేశాయ్! రక్త పరీక్ష ద్వారా శరీర కణజాలంలో క్యాన్సర్ ఉత్పరివర్తనాలను (మ్యుటేషన్స్) కనిపెట్టే వీలు వచ్చిందని తాజాగా పరిశోధనల్లో తేలింది.

 
ఈ క్యాన్సర్ రక్త పరీక్ష ద్వారా వచ్చిన వైద్య ఫలితాలు, కత్తితో కణితిని కోసి బయాప్సీ చేయడం ద్వారా వచ్చిన వైద్య ఫలితాలు ఒకేలా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. ఈ రక్తపరీక్షలే గనక పాపులర్ అయితే - క్యాన్సర్ వచ్చిందీ, లేనిదీ నిర్ధారించడం, వ్యాధి తాలూకు పురోగతిని కనిపెట్టడం - మునుపటి కన్నా తక్కువ రిస్కుతో, తక్కువ బాధతో కూడుకున్నది అవుతుంది. ఈ క్యాన్సర్ నిర్ధారక రక్తపరీక్షలను ‘లిక్విడ్ బయాప్సీ’ అని పిలుస్తున్నారు. క్యాన్సర్ రోగ చికిత్స వైద్యశాఖ అయిన ‘ఆంకాలజీ’లో ఇప్పుడిది లేటెస్ట్ ట్రెండ్. ట్యూమర్లలోని డి.ఎన్.ఎ. తునకలు కొద్ది మొత్తంలో క్యాన్సర్ రోగుల రక్తంలో కనిపిస్తాయి. దాన్ని వాటంగా తీసుకొని, పరిశోధకులు ఇప్పుడీ ‘లిక్విడ్ బయాప్సీ’ రక్తపరీక్షల్ని వెలుగులోకి తెచ్చారు. సర్వసాధారణంగా చేసే ట్యూమర్ బయాప్సీల బదులు ఇలాంటి పరీక్షలు ప్రత్యామ్నాయంగా మారతాయని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ రక్తపరీక్షల వల్ల ట్యూమర్ బయాప్సీలో ఉండే అనేక రకాల చిక్కుల్నీ, బాధల్నీ తప్పించుకోవచ్చు.

 
ఇప్పటి దాకా ఈ ‘లిక్విడ్ బయాప్సీ’లను క్యాన్సర్ నిర్ధారణకు వాడడం లేదు. కేవలం వ్యాధి తాలూకు పురోగతిని కనిపెట్టడానికే ఉపయోగిస్తూ వచ్చారు. ట్యూమర్‌లోని జన్యుపరమైన ఉత్పరివర్తనాలను కనిపెట్టడానికీ, తద్వారా వ్యాధి చికిత్సకు ఏయే మందులు వాడాలో తెలియడానికి మాత్రమే ఈ రక్తపరీక్షల్ని సాధనంగా చేసుకుంటూ వచ్చారు. కాగా, తాజా పరిశోధన, అధ్యయన ఫలితాల వల్ల ఈ రక్తపరీక్షల ఉపయోగం మరింత ఎక్కువని నిగ్గు తేలింది. ఇకపై క్యాన్సర్ నిర్ధారణకు ‘లిక్విడ్ బయాప్సీ’ పరీక్షల మార్గాన్ని అనుసరించడానికి వీలు చిక్కింది. క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని ‘డేవిస్ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్’లో మాలిక్యులర్ ఫార్మకాలజీ డెరైక్టర్ పేర్కొన్నారు. మొత్తానికి, ఈ రక్తపరీక్షల ద్వారా క్యాన్సర్ నిర్ధారణ పాపులర్ అయితే, రోగులకూ, డాక్టర్లకూ ఎంతో ఉపశమనమే!



రక్తనాళాలు ఉబ్బి కనిపిస్తున్నాయి...
హోమియో కౌన్సెలింగ్

 

నా వయసు 45 ఏళ్లు. కనీసం పది నిమిషాల పాటు కూడా నిల్చోలేకపోతున్నాను. కాళ్లపై నరాలు (రక్తనాళాలు) ఉబ్బి పాదాలు నలుపు రంగులోకి మారుతున్నాయి. హోమియోలో పరిష్కారం ఉందా? - రమాదేవి, ఆదిలాబాద్
మీకు ఉన్న సమస్య వేరికోస్ వెయిన్స్. ఇటీవలి కాలంలో రోజురోజుకూ వేరికోస్ వెయిన్స్ వ్యాధి బాధితులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. శరీరంలోని సిరలు బలహీనపడటం వల్ల ఏర్పడే సమస్యనే వేరికోస్ వెయిన్స్ అంటారు. అంటే శరీరంలోని రక్తనాళాలు రంగు మారతాయి లేదా నలుపు రంగులోకి మారతాయి. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్లలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, అవగాహన లేమి వల్ల ఈ వ్యాధి తీవ్రరూపం దాల్చి ఇతర సమస్యలకు దారి తీస్తోంది. సాధారణంగా రక్తం కింది నుంచి గుండె వైపునకు వెళ్లే సమయంలో భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో రక్త సరఫరా అవుతుండటం వల్ల  రక్తప్రసరణ మందగించడం, కాళ్ల ఒత్తిడి పెరగడం జరగవచ్చు. ఈ క్రమంలో సిరలు (రక్తనాళాలు) నలుపు లేదా ఊదా రంగుకు మారుతాయి. దీనివల్ల కాళ్లలో తీవ్రమైన నొప్పి ఏర్పడి నడవడానికీ వీలు కాదు. ఈ వేరికోస్ వెయిన్స్ వ్యాధి శరీరంలోని ఇతర భాగాలలోనూ వస్తుంది కానీ 80 శాతం కేసుల్లో ఇది కాళ్లపైనే కనిపిస్తుంది. సాధారణంగా 30 ఏళ్ల పైబడిన వారిలో ఈ వేరికోస్ వెయిన్స్ కనిపిస్తుంది. మహిళలు, స్థూలకాయులు, వ్యాయామం చేయనివారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.


కారణాలు:  ముందుకు ప్రవహించాల్సిన రక్తం వెనకకు రావడం  కొంతమంది మహిళల్లో గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ మార్పులు  ఎక్కువ సేపు నిలబడి చేయాల్సిన ఉద్యోగాల్లో (పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది, కండక్టర్, వాచ్‌మేన్, సేల్స్‌మన్, టీచర్లు వంటి) ఉద్యోగాలలో ఉండేవారికి ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ.

 
లక్షణాలు:  కాళ్లలో నొప్పి, మంట, కాళ్లలోని కండరాలు బిగుసుకుపోవడం   కొద్దిసేపు నిలబడితే నొప్పి రావడం  చర్మం దళసరిగా మారడం  చర్మం ఉబ్బడం, పుండ్లు పడటం


వ్యాధి నిర్ధారణ: అల్ట్రాసౌండ్, డ్యూప్లెక్స్ డాప్లర్ అల్ట్రా సౌండ్.

 
చికిత్స
: వేరికోస్ వెయిన్స్, వేరికోసిల్ వంటి వ్యాధులకు హోమియోపతి చికిత్సలో  అనుభవం ఉన్న, పరిశోధనల అనుభవం ఉన్న వైద్యులు చికిత్స చేస్తారు. వ్యాధి తీవ్రతను పరిశీలించి, రోగి వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఆపరేషన్ అవసరం లేకుండానే మంచి మందులు సూచిస్తారు. హోమియోలో ఈ సమస్యకు హామామెలిస్, పల్సటిల్లా, కాల్కేరియా, గ్రాఫైటిస్, కార్బోవెజ్, ఆర్నికా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి.

 

డాక్టర్ మురళి  కె. అంకిరెడ్డి  ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్

 


కిడ్నీలో స్టోన్స్ పోయేదెలా?
నా వయసు 21 సంవత్సరాలు. నాకు ఈ మధ్య పొట్ట సైడ్ భాగంలో నొప్పి రావడం మొదలైనంది. రెండు రోజుల తర్వాత మూత్ర విసర్జన ఇబ్బందికరంగా మారింది. మూత్రం వాసన రావడం, కాస్త ఎరుపురంగులో ఉండటం కూడా గమనించాను. దాంతో వెంటనే డాక్టర్‌ను కలిశాను. ఆయన కొన్ని పరీక్షలు చేసి కిడ్నీలో రెండు 10 ఎంఎం సైజు రాళ్లు ఉన్నాయనీ, వాటిని సర్జరీ చేసి తీసేయాల్సి ఉంటుందని చెప్పారు. సర్జరీ అంటే శరీరంపై కోత, ఆ తర్వాత ఆపరేషన్ మచ్చ ఉంటాయి కదా. అలా కాకుండా సర్జరీ లేకుండా కిడ్నీలో రాళ్లను తొలగించడం సాధ్యం కాదా? దయచేసి చెప్పగలరు. - ప్రభు, హైదరాబాద్
కిడ్నీలో రాళ్ల సమస్య ఇటీవల బాగా పెరిగింది. ఈ సమస్య సాధారణంగా యువకులు, మధ్యవయస్కుల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. స్త్రీలలో కంటే పురుషుల్లో ఈ సమస్య మూడు రెట్లు అధికం. కిడ్నీలో రాళ్లు ఇసుక రేణువు సైజు నుంచి గోలీకాయ సైజు వరకు ఉంటాయి. అయితే పేషెంట్లు అనుకుంటున్నట్లు అవి రాళ్లు కాదు. మూత్రంలో ఉండే క్యాల్షియమ్, ఆక్సలేట్ ఘనీభవించి స్ఫటికంలా మారతాయి. మూత్రనాళం (యురెథ్రా) ద్వారా మూత్రాశయానికి (బ్లాడర్‌కు) చేరుతాయి. కిడ్నీలో మూత్రం తయారయ్యే ప్రాంతంలోనే సాధారణంగా రాళ్లు ఏర్పడుతుంటాయి. వీటి సైజు చిన్నగా ఉంటే మనకు తెలియకుండానే మూత్రంతో పాటే శరీరం నుంచి బయటకు వచ్చేస్తాయి. సాధారణంగా రాళ్ల సైజు 8 ఎంఎం వరకు ఉంటే కేవలం మందుల ద్వారా వాటిని కరిగించేయవచ్చు. కానీ వాటి సైజు మీకు ఉన్నట్లుగా 10 ఎంఎం స్థాయిలో ఉండి కిడ్నీలోనో, మూత్రాశయంలోనో కదలకుండా తిష్ఠ వేసినప్పుడు మాత్రం సర్జరీ అనివార్యమవుతుంది. అయితే మీరు భయపడుతున్నట్లుగా ఓపెన్ సర్జరీ చేయకుండానే వైద్యవిధానంలో వచ్చిన ఆధునిక సాంకేతికత సహాయంతో ‘లేజర్ చికిత్స’ ద్వారా శరీరంపై ఎలాంటి కోతా లేకుండా సర్జరీ నిర్వహించవచ్చు.

 
ఈ ప్రక్రియలో యురెట్రోస్కోప్ అనే సాధనానికి కెమెరా బిగించి, మూత్రమార్గం ద్వారా మూత్రాశయం, మూత్రనాళం గుండా మూత్రపిండంలోకి పంపి, అందులో రాళ్లు కచ్చితంగా ఎక్కడున్నాయో టీవీ ద్వారా కనిపెట్టి, వాటిపై శక్తిమంతమైన లేజర్ కిరణాలను ప్రయోగించి, రాళ్లను పూర్తిగా విచ్ఛిన్నం చేస్తారు. 10 ఎంఎం రాళ్లే కాదు... ఒకవేళ వాటి పక్కన 3 ఎంఎం సైజు రాళ్లు ఉన్నప్పటికీ అవి కూడా ఈ లేజర్ కిరణాల ధాటికి పిండిపిండి కావాల్సిందే. ఈ విధానం చాలా సురక్షితమైనది. దీనివల్ల మీకు ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ ఉండవు కూడా. అయితే మంచి నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలోనే ఈ చికిత్స జరగాలి. లేకపోతే ఏకంగా కిడ్నీ పాడయ్యే అవకాశాలున్నాయి.


మీరు ఎలాంటి భయాందోళన పెట్టుకోకుండా నిపుణులైన వైద్యులతో చికిత్స చేయించుకోండి. ఈ సమస్య మళ్లీ ఉత్పన్నం కాకుండా ఉండాలంటే శరీరానికి తగినంత నీటిని అందిస్తూ ఉండండి. రోజుకు 5 లీటర్లకు తగ్గకుండా మంచినీళ్లు తాగండి.
డాక్టర్ సూరిబాబు, సీనియర్ యూరాలజిస్ట్ అండ్ కిడ్నీ 
ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్,  యశోద హాస్పిటల్స్,  సికింద్రాబాద్

 

బాబుకు పదే పదే విరేచనాలు...
పీడియాట్రిక్ కౌన్సెలింగ్

 

 మా బాబుకు ఏడాదిన్నర వయసు. రెండు నెలల క్రితం వాడికి చాలా ఎక్కువగా విరేచనాలు అయ్యాయి. అప్పుడు హాస్పిటల్‌లో కూడా అడ్మిట్ చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచీ తరచూ విరేచనాలు అవుతున్నాయి. మందులు వాడినప్పుడు కొద్దిగా తగ్గి, వెంటనే మళ్లీ పెరుగుతున్నాయి. ఎందుకిలా జరుగుతోంది?  - శిరీష, విశాఖపట్నం
మీరు వివరించిన లక్షణాలను బట్టి మీ అబ్బాయికి దీర్ఘకాలిక (క్రానిక్) డయేరియా ఉన్నట్లు చెప్పవచ్చు. ఇలా విరేచనాలు రెండు వారాల కంటే ఎక్కువగా కొనసాగితే వాటిని దీర్ఘకాలిక డయేరియాగా పరిగణించవచ్చు. దీర్ఘకాలిక డయేరియాకు మన పరిసరాలను బట్టి ఇన్ఫెక్షన్స్ ప్రధాన కారణం. వైరల్, బ్యాక్టీరియల్, పోస్ట్  ఇన్ఫెక్షియస్, ట్రాపికల్ స్ప్రూ వంటివి ఇన్ఫెక్షన్స్ కారణమవుతాయి. ఈ అంశాలతో పాటు ఎంజైమ్స్, ఆహారం అరుగుదలలో మార్పులు... అందులోనూ మరీ ముఖ్యంగా చక్కెర పదార్థాలు, ప్రోటీన్ల అరుగుదలలో మార్పులు కూడా ఇందుకు కారణాలు  కావచ్చు. వాటితో పాటు ఇమ్యూనలాజికల్, అలర్జిక్ వంటి అంశాలు కూడా  విరేచనాలకు కారణమవుతాయి. అలాగే పేగుల స్వరూపంలో లోపాలు (స్ట్రక్చరల్ డిఫెక్ట్స్) కూడా కారణం కావచ్చు. పేగుల కదలిక (మొబిలిటీ)లో మార్పులు కూడా విరేచనాలకు దోహదం చేస్తాయి.


వీటికి తోడు ఎండోక్రైన్ కారణాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి అనేక కారణాల వల్ల పిల్లలకు దీర్ఘకాలిక విరేచనాలు రావడం జరుగుతుంటుంది. పిల్లల్లో వాళ్ల బరువు / ఎదుగుదల నార్మల్‌గా ఉంటే చాలావరకు తీవ్రమైన (సీరియస్) అంశాలు అందుకు కారణం కాకపోవచ్చు. అంటే... ఐబీడీ, ఎంజైముల్లో లోపాలు, అనటామికల్ లోపాలు, ఇమ్యూనలాజికల్ సమస్యల వంటివి అందుకు కారణం అయ్యే అవకాశం పెద్దగా లేదు. ఇక పిల్లలకు దీర్ఘకాలిక విరేచనాలు అవుతున్న సందర్భంలో కంప్లీట్ స్టూల్ ఎగ్జామినేషన్ (క్రానిక్ డయేరియా వర్కప్), కొన్ని స్పెషల్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, ఎంజైమ్ పరీక్షలు, అవసరాన్ని బట్టి ఇంటస్టైనల్ బయాప్సీ, మైక్రో బయలాజికల్ పరీక్షలు, ఇంటస్టినల్ మార్ఫాలజీ పరీక్షలు, ఇమ్యూనలాజికల్ పరీక్షలు చేయించడం వల్ల నిర్దిష్టంగా కారణాన్ని తెలుసునే అవకాశం ఉంటుంది. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ బాబుకు ‘పోస్ట్ ఎంటరైటిస్’ అనే కండిషన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే... ఒక ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గాక లోపల జరిగిన నష్టం (డ్యామేజీ) వల్ల కొన్ని ఆహారాల పట్ల అతడి కడుపు సెన్సిటివిటీని వృద్ధి చేసుకొని ఉండవచ్చు. దీనివల్ల పదే పదే మోషన్స్ అవుతుండవచ్చు. అయితే మీ బాబు వయసున్న పిల్లల్లో కొన్నిసార్లు రోజుకు 3 నుంచి 6 సార్లు విరేచనాలు కావడం నార్మల్‌గా కూడా జరగవచ్చు. దీన్ని ‘టాడ్లర్స్ డయేరియా’ అంటారు.


మీ బాబు తీసుకున్న ఆహారం అతడి ఆహారకోశంలో ఉండాల్సిన టైమ్ కంటే తక్కువగా ఉండటం (డిక్రీజ్డ్ గట్ ట్రాన్‌జిట్ టైమ్) కూడా ఒక కారణం కావచ్చు. పై కండిషన్స్ వాటంతట అవే తగ్గిపోతాయి. తీసుకునే ఆహారంలో కొద్దిగా ఫైబర్ తగ్గించడం, చక్కెర పదార్థాలను పూర్తిగా మానేయడం ద్వారా గట్‌ఫ్లోరా పూర్తిగా రీప్లేస్ చేయడం వల్ల ఈ కండిషన్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలాంటి పిల్లలకు సరైన ఆహారం ఇవ్వడం, జింక్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు, విటమిన్-ఏ ఇవ్వడం, ఇన్ఫెక్షన్ ఉంటే దానికి తగిన చికిత్స చేయడం వల్ల పై కండిషన్‌లను పూర్తిగా నయం చేయవచ్చు. అప్పటికీ డయేరియా లక్షణాలు తగ్గకుండా ఉంటే ఇతర కారణాలను కనుగొని, వాటికి తగు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి మీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించి తగు చికిత్స తీసుకోండి.

 

డాక్టర్ రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్,  విజయనగర్ కాలనీ,  హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement