కార్డియాలజీ కౌన్సెలింగ్ | Cardiology counseling | Sakshi
Sakshi News home page

కార్డియాలజీ కౌన్సెలింగ్

Published Mon, Jul 27 2015 10:58 PM | Last Updated on Sun, Sep 3 2017 6:16 AM

Cardiology counseling

ట్రై గ్లిజరైడ్స్ అంటే ఏమిటి?
 
నా వయసు 48. ఎత్తు 5 అడుగుల ఆరంగుళాలు. బరువు 78 కేజీలు ఉన్నాను. నాకు ఇటీవల ఛాతీలో నొప్పిగానూ, శరీరమంతా భారంగానూ ఉన్నట్లు అనిపిస్తోంది. నడుస్తుంటే ఆయాసం వస్తోంది. దాంతో డాక్టర్‌ను సంప్రదించాను. ఆయన నన్ను లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష  చేయించుకోమని చెప్పారు. అందులో నాకు ట్రై గ్లిజరైడ్స్ ఉండవలసిన మోతాదు కన్నా చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇంతకూ ట్రై గ్లిజరైడ్స్ అంటే ఏమిటి? అవి అధికంగా ఉండటం వల్ల ఏమైనా ప్రమాదమా? వాటిని తగ్గించుకోవడం ఎలా?
 - వేణు బెక్కెం, విజయవాడ

మీ ఎత్తుకు మీరు ఉండవలసిన దానికన్నా చాలా ఎక్కువ బరువున్నారు. అందుకే మీ డాక్టర్ మిమ్మల్ని ఆ పరీక్ష చేయించుకోమని సూచించి ఉండవచ్చు. రక్తంలో కొలెస్ట్రాల్‌లా, కొవ్వులో ఉండే ఒక రకం జీవ రసాయనాలను ట్రైగ్లిజరైడ్స్ అంటారు. ఇవి ఎక్కువగా ఉంటే ‘హైపర్ ట్రైగ్లిజరైడేమియా’ అంటారు. రక్తంలో వీటి పాళ్లు పెరిగితే అది గుండె జబ్బులకు దారితీయవచ్చు. డయాబెటిస్ వంటి జబ్బులు ఉన్న సందర్భాల్లోనూ రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ పాళ్లు పెరిగే అవకాశం ఉంది. ట్రై గ్లిజరైడ్స్‌ను మరో విధంగా చెప్పాలంటే హానికరమైన కొవ్వు. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ పాళ్లను కొన్ని ఆహార నియమాలతో తగ్గించుకోవచ్చు.

హైపర్ ట్రైగ్లిజరైడేమియా ఉన్నప్పుడు జీవనశైలిలో మార్పులు తప్పనిసరి. మీరు ఎక్కువ బరువుంటే దాన్ని సాధారణ స్థాయికి వచ్చేలా మీ ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అంటే మీరు తీసుకునే క్యాలరీలను తగ్గించుకోవాలి.మీరు తీసుకునే ఆహారంలో నెయ్యి, వెన్న, మాంసాహారం (రొయ్యలు, చికెన్ స్కిన్), వేపుళ్లను తగ్గించాలి.ఆల్కహాల్ మానేయాలి. తాజా పళ్లు, కూరగాయలు, ఆకు కూరలు బాగా తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్‌లో పీచు ఎక్కువగా ఉండి, ట్రైగ్లిజరైడ్స్ పాళ్లను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. దాంతోపాటు వెజిటబుల్ సలాడ్స్, తేలిగ్గా ఉడికించిన కాయగూరలు తీసుకోవాలి.స్వీట్స్, బేకరీ ఐటమ్స్ బాగా తగ్గించాలి. ప్రతిరోజూ 30 నిమిషాలపాటు శారీరక శ్రమ / వాకింగ్ వంటి వ్యాయామాలు చేయాలి.

కనీసం వారంలో మూడుసార్లు చేపలు తీసుకోవాలి. అది కూడా కేవలం ఉడికించి వండినవి, గ్రిల్డ్ ఫిష్ మాత్రమే తీసుకోవాలి.పొగ తాగడం పూర్తిగా మానివేయాలి. పైన చెప్పిన సూచనలను పాటిస్తూ, మీ డాక్టర్ రాసిచ్చిన మందులను క్రమబద్ధంగా వాడుతూ ఉంటే మీకు వచ్చిన సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి.
 
డాక్టర్ అనూజ్ కపాడియా
సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్,
హైదరాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement