
మేకప్ వేసుకునేటప్పుడే కాదు తొలగించేటప్పుడూ జాగ్రత్తలు తీసుకోవాలి. సహజమైన పద్ధతిలో మేకప్‌ని తొలగించాలంటే పాలు లేదా పెరుగును ముఖానికి పట్టించి దూదితో తుడిచేయాలి.ఇంట్లోనే ఐ మేకప్ రిమూవర్‌ని తయారు చేసుకోవచ్చు. ఒక పాత్రలో టీ స్పూన్ ఆముదం, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ వంటనూనె వేసి మూడూ బాగా కలపాలి. ఈ నూనెను దూదితో అద్దుకుని కంటి చుట్టూ, ఐలైనర్, మస్కారా వాడినచోట సున్నితంగా రుద్దితే ఐ మేకప్ సులభంగా తొలగుతుంది. గోరువెచ్చటి నీటిలో దూది లేదా మెత్తని కాటన్ క్లాత్‌ను ముంచి గట్టిగా పిండాలి. ఆ తడి క్లాత్‌తో మరోసారి ముఖాన్ని తుడవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి.మేకప్ వేసుకునే అలవాటు ఉన్నవారు బయటకు వెళ్లేటప్పుడు వెంట లిప్‌స్టిక్, బ్లషర్, పౌడర్, దువ్వెన, టిష్యూపేపర్, సేఫ్టీపిన్స్... ఇలాంటివన్నీ ఉండే చిన్న ‘టచ్–అప్’ కిట్‌ని వెంట తీసుకెళ్లాలి. మేకప్ చెదిరినా, తీసివేయాలన్నా తడుముకోవాల్సిన అవసరం ఉండదు.