ఊ కొడుతున్నారా? ఉలిక్కిపడుతున్నారా?
కేరెంటింగ్
ఇంచుమించు అన్ని స్కూళ్లకూ వేసవి సెలవులు ఇచ్చేశారు. ఈ సెలవుల్లో పిల్లలు ఇంటి దగ్గరే ఉండి అల్లరి చేస్తుంటారు. వారి సెలవులను సద్వినియోగం చేసేందుకు చాలామంది తలిదండ్రులు వారిని సమ్మర్ కోచింగ్‌లోనో, స్విమ్మింగ్, డ్యాన్సింగ్, సింగింగ్ వంటి వాటిలో చేర్చి, చేతులు దులుపుకుంటారు. అయితే చిన్నారులకు కావలసింది తలిదండ్రుల సామీప్యం. వారిని దగ్గర కూర్చోబెట్టుకుని చక్కటి కథలు చెప్పడం వల్ల వారిలో ఊహాకల్పన, ఆలోచనాశక్తి అలవడతాయి. సృజనాత్మకత పెరుగుతుంది. ఒకవేళ మీకు కథలేమీ రాకపోతే, నేర్చుకోండి. లేకపోతే వారి నానమ్మలు, అమ్మమ్మలు, తాతల దగ్గరకో, ఇతర పెద్దవాళ్ల దగ్గరకో పంపండి. అంతేకానీ, వారిని వాళ్ల అల్లరి తప్పించుకోవడానికి దూరంగా పంపకండి. మా పిల్లలు కథలు వినడానికి సుతరామూ ఇష్టపడరు, అని పెదవి విరవకండి. అనగా అనగా అని మొదలు పెట్టి, వారికి ఆసక్తి కలిగించే కబుర్లే కథలుగా అల్లండి.
కథలతో మొదలు పెట్టి, క్రమక్రమంగా పురాణాలు కూడా చెప్పండి. పురాణాలలోని పాత్రలు ఉన్నత విలువలతో, సమాజాన్ని ముందుకు నడిపించడంతో పాటు చక్కని సందేశాలనిస్తాయి. సత్యహరిశ్చంద్రుడు, శ్రీరాముడు వంటివారు ఎంత ఆపద వాటిల్లినా, ఎంతటి కష్టం ఎదురైనా సరే, తాము నమ్ముకున్న సత్యాన్ని ఆచరించడంలో వెనుకడుగు వేయని ఆ ధీరత్వం ముందు సర్వజగత్తు తలవంచడాన్ని వారికి చెప్పండి. ఇతర మతాలలోని కథలు కూడా నేర్పండి. వాటిలోని మంచిని కూడా గ్రహించేలా చేయండి. భగవద్గీతతో పాటు బైబిల్ కథలు కూడా చదివించండి. ఖొరాన్‌తోపాటు, కృష్ణుడి అల్లరి కూడా కళ్లకు కట్టండి. పురాణాలు, రామాయణ, భారతభాగవతాలు చదివితే చాలు అని మన పూర్వీకులు అనడంలోని ఉద్దేశ్యం వాటి ద్వారానే భవిష్యత్తుకు కావలసిన పాఠాలు నేర్చుకుంటారనే తప్ప మరోటి కాదు.