ఇవి పశ్చిమాసియాలో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదం, బ్రెజిల్ అంతర్గత పోరుకు నిదర్శనాలు! వీటిని ఫ్రేమ్‌లో బంధించిన సాహసి.. కరోల్ గూజి! ప్రపంచ ప్రఖ్యాత ఫొటో జర్నలిస్ట్. సంక్లిష్ట జీవితాలను కెమెరాతో ప్రపంచానికి చూపించి.. ప్రతిష్ఠాత్మకమైన పులిట్జర్ పురస్కారాన్ని పొందారు.. ఒకటి.. రెండు కాదు నాలుగు సార్లు. ఈ ఘనత సాధించిన తొలి జర్నలిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు. పనికి జెండర్ కాదు సామర్థ్యం ముఖ్యమని నిరూపించారు.
నేపథ్యం..
అరవై మూడేళ్ల కరోల్.. అమెరికా వాస్తవ్యురాలు. చిన్నప్పుడే తండ్రి చనిపోతే తల్లి రెక్కల కష్టంతో పెరిగారు. తల్లి ఆర్థిక బాధ్యతలను పంచుకోవడానికి నర్స్‌గా ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ సమయంలోనే కరోల్ ఫ్రెండ్ ఒకతను ఆమెకు ఎస్‌ఎల్‌ఆర్ కెమెరాను కానుకగా ఇచ్చాడు. అది ఆమె లక్ష్యాన్ని ఫోకస్ చేసింది. ఫొటోజర్నలిస్ట్ కావాలని ఫొటోగ్రఫీ కోర్స్‌లో జాయిన్ అయ్యారు. ‘ది మియామీ హెరాల్డ్’లో ఇంటర్న్‌గా అవకాశం వచ్చింది. తర్వాత 1988లో ‘ది వాషింగ్టన్ పోస్ట్’లో స్టాఫ్ ఫొటోగ్రాఫర్‌గా ఉద్యోగం దొరికింది. 2014 వరకు అక్కడే ఉన్నారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ ఫొటో జర్నలిస్ట్‌గా జగమంత వేదిక చేసుకున్నారు.
ప్రకృతి వైపరీత్యాలు, సంఘర్షణ పరిస్థితుల మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టారు?
కళ్లముందు జరుగుతున్న నిజాలను లోకానికి తెలియజేయాలి. అవి ప్రకృతి వైపరీత్యాలైనా(హైతీ), సంఘర్షణాత్మక ప్రాంతాల్లోని పరిస్థితులనైనా. ఆ బాధితుల పట్ల మిగిలిన ప్రపంచానికున్న బాధ్యతను గుర్తు చేయాలి. ఫొటో జర్నలిస్ట్‌గా అది నా రెస్పాన్స్‌బులిటీ. అందుకే ఆ వాస్తవాల చుట్టే తిరుగుతున్నా ఇప్పటికీ.
సవాళ్లు?
నేను వచ్చిన కొత్తలో ఈ రంగంలో మహిళలు చాలా చాలా తక్కువ. అంతర్జాతీయ సమస్యల మీద రాసేవాళ్లు మరీ తక్కువ. ఇప్పుడలా లేదు. చాలా మారిపోయింది. చాలామంది అమ్మాయిలు ఈ కెరీర్‌ను ఎంచుకుంటున్నారు. మంచి పరిణామం. అయినా పని విషయంలో జెండర్ కాదు, సామర్థ్యాన్ని చూడాలి. వృత్తి పట్ల నిబద్ధతను చూడాలి. దేన్నయినా జనరలైజ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఒక్కొక్కరిది ఒక్కో దృక్పథం. మహిళలకు భిన్నమైన జీవితానుభవాలుంటాయి. ఆ అనుభవాల్లోంచి వాళ్ల దృష్టికోణం ఏర్పడుతుంది. ఆ మాటకొస్తే మనం నివసించే ప్రాంతం, వాతావరణం, సంస్కృతి.. వీటన్నిటి ప్రభావమూ మన ఆలోచనల మీద ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్లే భిన్నమైన వాళ్లు. ఈ భిన్నత్వంతోనే ప్రపంచం బ్యాలెన్స్ అవుతోంది.
తుపాకులు, బాంబుల మోతలో కెమెరాతో సైలెంట్‌గా ఎలా?
బేసిగ్గా నేను వార్ ఫొటోగ్రాఫర్‌ని కాను. కాబట్టి ఫ్రంట్‌లైన్ ఎక్స్‌పీరియెన్స్ ఏమీ నాకు లేదు. కాని ఈ మధ్య ఐఎస్‌ఐఎస్ కాన్‌ఫ్లిక్ట్ జోన్‌కి వెళ్లాను. ఆ విధ్వంసం తర్వాత ఉండే ఎమోషనల్ డ్రామా నన్ను బాగా కలచివేసింది, భయపెట్టింది. సూసైడ్ బాంబర్స్‌గా తండ్రులు చనిపోతారు. తల్లులు గాయాలతో పడి ఉంటారు. తల్లిదండ్రుల కోసం ఆ పిల్లలు పెట్టే ఆర్తనాదాలు.. వెంటాడుతుంటాయి.
ఆడవాళ్ల పరిస్థితుల్లో తేడాలు గమనించారా?
మీరెక్కడ ఉన్నారన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. సపోజ్ నా విషయానికి వస్తే.. మిగతా వాళ్లతో పోలిస్తే అమెరికన్ ఉమన్‌గా నాకు చాలా స్వేచ్ఛ ఉంటుంది. కొన్ని దేశాల సంస్కృతి వేరు. తగ్గట్టే స్త్రీల స్థితీ వేరుగానే ఉంటుంది. ఇప్పుడు పరిస్థితులు చాలా మారినా లింగ వివక్ష, మహిళల పట్ల వేధింపులు మాత్రం తగ్గలేదు. మహిళలు, పిల్లలు ఇంకా వల్నరబులే. దీని మీద మెయిన్ స్ట్రీమ్ మీడియా దృష్టి పెట్టాలి. మహిళల దృక్పథంలో మనందరం పనిచేయాలి.
భావప్రకటనా స్వేచ్ఛ
ప్రపంచంలోని దాదాపు అన్ని చోట్లా ప్రమాదంలోనే ఉంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమిది. తమ హక్కుల గురించి మాట్లాడేందుకు, జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛను మించిన ఆయుధాల్లేవు. ముఖ్యంగా ఆడవాళ్లకు. వీటి మీద ఆంక్షలు పెడుతూ ప్రజలకు నిజాలు తెలియనీయకుండా చేస్తున్నాయి ప్రభుత్వాలు.
జర్నలిస్ట్‌లు..
జర్నలిస్ట్‌లు, ఫొటోజర్నలిస్ట్‌లు.. ఎవరైనా సరే.. నిజాలను వెలికి తీయాలి. మీ పనే మీ గురించి చెబుతుంది. పని.. విశ్వజనీనమైన భాష.
– సరస్వతి రమ ఫొటోలు: నోముల రాజేశ్‌రెడ్డి
►ఇండియా పర్యటన ఇదే మొదటిసారి కాదు. చాలాసార్లు వచ్చాను అసైన్‌మెంట్స్ మీద. మదర్ థెరిస్సా అంతిమయాత్రనూ కవర్ చేశాను. హైదరాబాద్‌కు రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్. ట్రాఫిక్ తప్ప అంతా బాగుంది (నవ్వుతూ)ఈ దేశం విజువల్‌గా బ్రైట్ అండ్ బ్యూటిఫుల్. పీపుల్ ఆర్ సో స్వీట్.
Comments
Please login to add a commentAdd a comment