పిల్లి విశ్వాసం
నిరీక్షణ
కుక్కలు తమ యజమానుల పట్ల విశ్వాసం చూపుతాయి. అది వాటి సహజ లక్షణం. యజమానుల పట్ల విశ్వాసం చూపే పిల్లులు ఎక్కడైనా ఉంటాయా? లోకంలో అలాంటి పిల్లులు కూడా ఉంటాయని కాలజ్ఞానులెవరూ చెప్పలేదు. అయితేనేం, ఫొటోలో కనిపిస్తున్న ఈ పిల్లిని మాత్రం విశ్వాసానికి మారుపేరుగా చెప్పుకోవచ్చు. విశ్వాస ప్రదర్శనలో దీని తీరు జాగిలాలకు సాటి వస్తుంది. అయితే, పాపం దీని యజమానులకే దీని పట్ల విశ్వాసం లేకపోవడమే విషాదం. రష్యాలోని బెల్‌గొరోడ్ నగరంలో జనసమ్మర్దం గల కూడలి వద్ద ఒక మ్యాన్‌హోల్ మూత మీద బుద్ధిగా కూర్చున్న ఈ పిల్లి దాదాపు ఏడాదిగా తన యజమాని కోసం పడిగాపులు పడుతోంది.
ఓస్తాప్ జదునేస్కీ అనే ఫొటోగ్రాఫర్ గత వేసవిలో ఈ పిల్లి ఫొటో తీశాడు. కొద్దిరోజుల తర్వాత అతడు ఈ పిల్లిని మళ్లీ అదే ప్రదేశంలో చూడటంతో అతడికి ఆసక్తి పెరిగింది. దాని కదలికలను గమనించడం మొదలుపెట్టాడు. ఆ పిల్లి ప్రతిరోజూ అక్కడకు వచ్చి పడిగాపులు పడుతుండటాన్ని గుర్తించాడు. స్థానికులను ఆరాతీసి అసలు విషయం తెలుసుకున్నాడు. ఏడాది కిందట ఈ పిల్లి యజమానులు దీనిని ఇక్కడకు తెచ్చి వదిలేశారు. వాళ్లు కారులో తిరిగి వెళ్లిపోతున్నప్పుడు ఈ పిల్లి కూడా కారును వెంబడించేందుకు విఫలయత్నం చేసింది. చివరకు ఇక్కడే మిగిలిపోయింది. అప్పటి నుంచి ఇలా ఎదురు చూపులు చూస్తోంది. ఓస్తాప్ ఈ పిల్లి ఫొటోతో పాటు దీని దీనగాథను సోషల్ నెట్‌వర్క్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయడంతో చాలామంది నెటిజన్లు దీనిపై సానుభూతి కురిపిస్తున్నారు.