గెస్ట్ కాలమ్
కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్).. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 13 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) లలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష. మేనేజ్‌మెంట్ విద్య ఔత్సాహికులైన ప్రతి ఒక్క విద్యార్థీ క్యాట్‌కు హాజరు కావాలని ఆశిస్తారనడంలో సందేహం లేదు. ఇక.. కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) -2014కు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ ఏడాది కూడా క్యాట్ నిర్వహణ బాధ్యతలను ఐఐఎం-ఇండోర్‌కే కేటాయించారు. ఆన్‌లైన్ టెస్టింగ్ ప్రక్రియను ప్రొమెట్రిక్ బదులుగా ఈ ఏడాది నుంచి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిర్వహించనుంది. ఈ మేరకు ఐఐఎం-టీసీఎస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో క్యాట్-2014 కన్వీనర్, ఐఐఎం-ఇండోర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రోహిత్ కపూర్‌తో ఇంటర్వ్యూ.....
వరుసగా రెండో ఏడాది క్యాట్ నిర్వహణ బాధ్యతలు అందుకోవడంలో ఏమైనా ప్రత్యేకత ఉందా?
క్యాట్-2014 నిర్వహణను ఐఐఎం-ఇండోర్‌కు కేటాయించడం, కన్వీనర్‌గా మళ్లీ నన్నే నియమించడం ఆనందాన్ని కలిగిస్తోంది. ఇది ఉన్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయం. గత ఏడాది క్యాట్ చరిత్రలో తొలిసారి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను ప్రవేశపెట్టాం. ఇది ఎందరో విద్యార్థులకు దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసింది. మొత్తం దరఖాస్తుల్లో సుమారు 55శాతం ఆన్‌లైన్‌లోనే వచ్చాయంటేనే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విజయవంతమైందనడానికి నిదర్శనం. ఈ ఏడాది కూడా ఈ విధానాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా నిర్దేశిత బ్యాంక్ బ్రాంచ్‌ల నుంచి కూడా దరఖాస్తులు పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాం.
ఆన్‌లైన్ టెస్టింగ్ విధానంలో అభ్యర్థులు ఎన్నో సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు?
ఇబ్బందులు వాస్తవమే. అయితే ప్రతి ఏటా అంతకుముందు సమస్యలను పరిష్కరించుకుంటూ ఆన్‌లైన్ టెస్టింగ్‌ను ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహిస్తున్నాం. ఫలితంగా గత ఏడాది విద్యార్థులకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. ఈసారి.. పూర్తిగా ఎలాంటి సమస్యలు లేకుండా టెస్టింగ్ ప్రక్రియను నిర్వహిస్తాం.
ప్రొమెట్రిక్ నుంచి టీసీఎస్‌కు ఆన్‌లైన్ టెస్టింగ్ బాధ్యతలు అప్పగించడానికి కారణం?
క్యాట్‌లో కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్టింగ్ విధానానికి తొలుత ప్రొమెట్రిక్‌తో ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ ఒప్పందం గత ఏడాది ముగియడంతో కొత్తగా బిడ్లు స్వీకరించి.. వాటిలోంచి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ను ఎంపిక చేశాం.
ఆన్‌లైన్ టెస్టింగ్ ప్రక్రియ ప్రారంభించాక ప్రతిఏటా అభ్యర్థుల సంఖ్యలో తగ్గుదల కనిపించడానికి కారణం?
దీనికి ప్రత్యేక కారణాలను విశ్లేషించలేం. అయితే అభ్యర్థులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు కంప్యూటర్ లిటరసీ విషయంలో కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. దాంతో ఆన్‌లైన్ టెస్టింగ్ విషయంలో భయపడుతున్నారు. అదేవిధంగా గత కొన్నేళ్లుగా విద్యార్థుల దృక్పథంలో మార్పు వచ్చింది. మేనేజ్‌మెంట్‌తోపాటు తమ కోర్ సబ్జెక్ట్‌లలో ఉన్నత విద్యను ఆశించే వారి సంఖ్య పెరగడం కూడా కారణం కావొచ్చు.
గతేడాది క్యాట్‌కు ఎలాంటి ఆదరణ లభించింది? ముఖ్యంగా మహిళా అభ్యర్థుల నుంచి ఆసక్తి ఎలా ఉంది?
దరఖాస్తుల పరంగా దాదాపు రెండు లక్షల మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ పరీక్షకు హాజరైంది మాత్రం 1.74 లక్షల మంది మాత్రమే. మహిళా అభ్యర్థుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. క్యాట్-2013లో యాభై వేలకు పైగా మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. క్యాట్-2012తో పోల్చితే ఇది 12 శాతం ఎక్కువ.
టెక్నికల్ నేపథ్యం ఉన్నవారికే క్యాట్ అనుకూలమనే వాదనలపై మీ అభిప్రాయం?
ఇది వాస్తవం కాదు. ఆన్‌లైన్ టెస్ట్‌లో ఎలాంటి స్లాట్‌లో అయినా ప్రశ్నల క్లిష్టత స్థాయి ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. రెండు సెక్షన్లుగా నిర్వహించే క్యాట్‌లో అన్ని నేపథ్యాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్రశ్నల రూపకల్పన జరుగుతుంది. అయితే దరఖాస్తుల సంఖ్య.. హాజరైన వారి సంఖ్య పరంగా విజేతల్లో ఎక్కువ మంది టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న విద్యార్థులు కనిపిస్తున్నారు. క్యాట్-2013లో నాన్-టెక్నికల్ విద్యార్థుల శాతం 23కు పెరిగింది. 2012తో పోల్చితే అయిదు నుంచి ఆరు శాతం పెరుగుదల నమోదైంది.
క్యాట్-2014లో మార్పులు, టెస్ట్ సెంటర్ల పెంపుపై తీసుకున్న నిర్ణయాలు?
వీటి గురించి ఇంకా నిర్ణయించలేదు. టెస్ట్ ప్యాట్రన్ గత ఏడాది మాదిరిగానే ఉంటుంది. ఇక.. టెస్ట్ సెంటర్లు పెరిగే అవకాశాలున్నాయి. విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతిఏటా టెస్ట్ సెంటర్లను పెంచుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా అది పునరావృతం కావొచ్చు.
క్యాట్-2014 పూర్తి క్యాలెండర్‌ను ఎప్పుడు ప్రకటిస్తారు?
ఈ ఏడాది రిజిస్ట్రేషన్ ప్రక్రియను జూలైలో ప్రారంభించాలని యోచిస్తున్నాం. జూన్ రెండో వారంలో పూర్తిగా స్పష్టమైన క్యాలెండర్‌ను ప్రకటిస్తాం. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆన్‌లైన్ టెస్ట్ ప్రక్రియ పూర్తి చేయాలని అనుకుంటున్నాం.
క్యాట్ ఔత్సాహిక అభ్యర్థులకు మీరిచ్చే సలహా?
క్యాట్ ప్యాట్రన్, ప్రశ్నల శైలి పరిశీలనలోకి తీసుకుని.. అభ్యర్థులు బేసిక్ ఫండమెంటల్స్‌పై పట్టు సాధించాలి. ప్రతి ఐఐఎం నిష్ణాతులైన అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేసుకోవాలని ఆశిస్తుంది. అందుకే క్యాట్ స్కోర్‌కు అదనంగా ప్రతి ఐఐఎం ప్రత్యేకంగా మలి దశలో గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూ/రిటెన్ ఎబిలిటీ టెస్ట్ వంటివి నిర్వహిస్తుంది. కాబట్టి అభ్యర్థులు క్యాట్‌లో మంచి స్కోర్‌తోపాటు వీటిలోనూ విజేతగా నిలవడానికి కృషి చేయాలి. వీటన్నిటికంటే ముఖ్యమైంది మానసిక సన్నద్ధత. క్యాట్ అంటే క్లిష్టం అనే అపోహను వీడి.. సాధించాలి అనే లక్ష్యంతో ఉండాలి.
క్యాట్ క్లిష్టం కాదు!
Published Sun, May 18 2014 10:59 PM | Last Updated on Sat, Sep 2 2017 7:31 AM
Advertisement