గుహాలయాలు
పుణ్యతీర్థం
ఆదిమానవుడు గుహతో పాటు గుడిని కూడా కనుగొన్నాడు. గుహను గుడిగా మలుచుకున్నాడు. అజంతా, ఎల్లోరాలు అలాంటి గుహాలయాలే. మన తెలుగువారి తావుల్లో కూడా అలాంటి గుహాలయాలు ఉన్నాయి. విజయవాడలో ఉన్న అక్కన్న మాదన్న గుహలు, మొగల్రాజపురం గుహలు ఎందరికి తెలుసు? వాటిని చూడాలని మనం ఒకరికొకరం చెప్పుకున్నామా?
విజయవాడకు వెళ్లినవాళ్లు కనకదుర్గ ఆలయానికి తప్పక వెళతారుకాని దుర్గమ్మ పాదాల చెంత కొలువై ఉన్న అక్కన్న మాదన్న గుహలను ప్రత్యేకంగా పరికించి చూడరు. ప్రకృతి రమణీయతకే కాకుండా, చారిత్రక ప్రాధాన్యతను కూడా కలిగి ఉన్న ఈ గుహలు 6వ,7వ శతాబ్దాల నాటివని తెలుస్తోంది. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపాలు శిథిలావస్థలో దర్శనమిస్తాయి. ఇవి గుహలే అయినప్పటికీ వీటిలో భగవంతుని మూర్తులను ఉంచడం వలన ఇవి గుహాలయాలు అయ్యాయి.
అక్కన్న మాదన్నలు
ఇంద్రకీలాద్రి కొండకు తూర్పు దిశగా కొండ కింది భాగంలో ఈ ఆలయాలు ఉంటాయి. 17వ శతాబ్దంలో గోల్కొండను పాలించిన తానీషా చక్రవర్తి దగ్గర అక్కన్నమాదన్నలు మంత్రులుగా పనిచేసేవారు. రాజుగారికి నమ్మిన బంట్లు. ఈ గుహలు ఆరు ఏడు శతాబ్దాలకు చెందినవే అయినా ఈ గుహలతో అక్కన్న మాదన్నలకు విడదీయరాని అనుబంధం ఉండటంతో వీటిని వారి పేరుతో పిలుస్తారు.
గుహల నిర్మాణం
ఈ గుహలు తూర్పుముఖంగా దీర్ఘ చతురస్రాకారంలో నిర్మితమయ్యాయి. కింద భాగంలో మూడు గుహలు ఉన్నాయి. వాటికి ఎదురుగా ఒక స్తంభం ఉంది. శిల్పనిర్మాణం చూస్తే బౌద్ధులకు చెందినదిగా అనిపిస్తుంది. కాని ఈ గుహలు చాళుక్య, విష్ణుకుండిన, పల్లవ సామ్రాజ్యాలకు చెందినవిగా భావిస్తున్నారు.
లోపలకు ప్రవేశించగానే అందమైన, సువాసన భరితమైన పూల చెట్లు స్వాగతం పలుకుతాయి. నాలుగడుగులు వేయగానే గుహలు మనలను కొన్ని వంద సంవత్సరాలు వెనక్కు తీసుకువెళ్తాయి. తూర్పు ముఖంగా ఉన్న ఈ గుహలకు దక్షిణ భాగంలో వినాయకుని విగ్రహాన్ని శిల్పులు చెక్కారు. అయితే ఇది కొంచెం శిథిలావస్థలో ఉంది. ఆ గుహలను చూసి బయటకు వచ్చి ఉత్తరాన ఉన్న మెట్లు ఎక్కితే పైన కూడా గుహాలయం ఉంది. ఓం నమశ్శివాయ.. అంటూ అక్కడ లింగాకారంలో ఉన్న శివుడు సాక్షాత్కరిస్తాడు. ఎవరికి వారు పూజ చేసుకునే అవకాశం ఉన్న శివాలయం ఇది. ప్రతి సోమవారం నాడు భక్తులు ఇక్కడకు వచ్చి స్వయంగా అభిషేకాలు చేస్తుంటారు. అక్కడ నుంచి పైకి చూస్తే దుర్గమ్మ గుడికి వెళ్లే ఘాట్ రోడ్ మనకు కనిపిస్తుంది. ఈ శివుడే గంగ బదులు కనకదుర్గమ్మను తన తల మీద మోస్తున్నాడేమోననే భావన కలుగుతుంది. అక్కడక్కడ పడిన శిల్పాలను ఒక దగ్గర చేర్చి అందంగా ప్రేక్షకులకు కనువిందు కలిగేలా అమర్చారు. మండపం మీద సంగీత వాద్యపరికరాలు వాయిస్తూన్న శిల్పం నాటి రాజుల సంగీతాభిమానాన్ని ప్రతిబింబిస్తుంది. ధనుస్సు సంధించిన అర్జునుడు, స్థూపం మీద నాలుగు వైపులా దేవతామూర్తులు, మండపం నాలుగు స్తంభాల మీద శాసనం చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలబడతాయి. ప్రస్తుతం ఈ గుహాలయాలు, పరిసరాలు పురావస్తు శాఖవారి ఆధ్వర్యంలో ఉన్నాయి.
మొగల్రాజపురం గుహలు
మొగల్రాజపురం విజయవాడలో ప్రధానమైన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని మొగలులు సందర్శించిన కారణంగా మొగల్‌రాజపురం అని పిలుస్తారని స్థానికులు చెబుతారు. ఇక్కడ 5వ శతాబ్దానికి చెందిన ఐదు ప్రధాన గుహలు ఉన్నాయి. ఈ గుహలు కృష్ణానది నుంచి సుమారు 2 కి.మీ. దూరంలో ఉన్నాయి. దక్షిణ భారతదేశ పర్యటన చేస్తున్న సమయంలో బుద్ధుడు ఇక్కడకు వచ్చి విశ్రాంతి తీసుకున్నాడని చరిత్ర చెబుతోంది. కృష్ణాజిల్లాప్రాంతాన్ని 5వ శతాబ్దంలో పరిపాలించిన విష్ణుకుండినులు ఈ గుహలను, అందులో దేవతా మూర్తులను చెక్కించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ గుహలలో మొత్తం ఐదు దేవతామూర్తులు ద ర్శనమిస్తాయి. శిల మీద చెక్కిన ఈ శిల్పాలు పవిత్రతను సంతరిస్తాయి. గుహలను తొలుచుకుంటూ ఈ మూర్తులను చెక్కారు.
ఐదు గుహలు
మొత్తం ఐదు గుహలలో మొదటిది గిరిపురంలో ఉంది. ఇక్కడ గుహలను నేల పాద ప్రాంతంలోనే చెక్కారు. కాని ఇక్కడ శిల్ప సంపద లేదు. గిరిపురం నుంచి కొద్ది దూరంలో మధు కల్యాణమండపం ప్రాంతంలో రెండవ గుహ ఉంది. ఇక్కడ ఆర్చి మీద నటరాజ విగ్రహం శిథిలావస్థలో ఉంది. ఆర్చి మీద వరుసగా ఏనుగు, సింహం, నంది శిల్పాలను అందంగా తీర్చారు. ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు నంది, భృంగి శిల్పాలు కూడా శిథిలావస్థలోనే ఉన్నాయి. లోపల ముక్కలుగా ఉన్న శివలింగం మాత్రం కనిపిస్తుంది. బౌద్ధులు ఇక్కడకు వచ్చినప్పుడు, విగ్రహాలకు వ్యతిరేకంగా వీటిని ధ్వంసం చేసినట్లు స్థానికులు చెబుతారు.
ఇక మొగల్రాజపురం మెయిన్ రోడ్‌లో ఉన్న మూడవ గుహలో త్రిమూర్తుల శిల్పాలు శిథిలావస్థలో కనిపిస్తాయి. ఇక్కడ కూడా ఈ గుహలను కిందిభాగంలోనే చెక్కారు. ఈ గుహకు పక్కనే నాలుగవ గుహ దర్శనమిస్తుంది. ఈ గుహను కొండ మీద చెక్కారు. ఇక్కడ త్రిగుణాత్మకతను చూపేలా మూడు గుహలు కనిపిస్తాయి. ఇక అక్కడ నుంచి పక్క సందులోకి కొద్దిగా లోపలకు వెళితే ఐదవ గుహ కనిపిస్తుంది. ఇక్కడి నల్లరాతి మండపం నాటి కళను కళ్లకు కడుతుంది. మధ్యలో ఉన్న శాసన స్తంభం మహేశ్వరుని వివిధ రూపాలను చూపుతుంది. ఈ ఐదు గుహల నిర్మాణం ఉండవల్లి గుహల నిర్మాణం మాదిరిగానే ఉండటం చూస్తే, వీటిని నిర్మించినవారు ఒకరే అనిపిస్తుంది.
గుహల గురించిన పూర్తి సమాచారం అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం యాత్రికులను ఆకర్షించే ప్రయత్నాలు ఏమీ జరగడం లేదు. జాతీయ వారసత్వ సంపదగా గుర్తింపు పొందినప్పటికీ ఈ గుహాలయాలకు సందర్శకులు ఒక గైడ్‌తో పాటు, వీటికి తగిన ప్రాధాన్యత, గుర్తింపు, ప్రచారం కలిగిస్తే, అజంతా ఎల్లోరా గుహలకు ఏ మాత్రం తీసిపోకుండా నగర ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తం చేస్తాయనడంలో సందేహం లేదు. - డా.పురాణపండ వైజయంతి
ఇలా చేరుకోవాలి...
విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ఈ గుహాలయాలు 3 కిలోమీటర్లు. ఇంద్రకీలాద్రి కొండకు చేరుకొని, అక్కడ నుంచి కాలి నడకన ఈ గుహాలయాలను సందర్శించవచ్చు. విజయవాడ బస్ స్టేషన్ నుంచి 2 కిలోమీటర్లు.క్యాబ్, హోటల్ వసతి సదుపాయాలున్నాయి. సమీప విమానాశ్రయం గన్నవరం. దాదాపు 17 కిలోమీటర్లు అన్ని ప్రధాన నగరాల నుంచి రవాణా సదుపాయాలున్నాయి.