మూడు రోజుల ‘హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్’ లో చివరి రోజు సెషన్‌లలో ప్రముఖంగా ఆకర్షించిన సెలబ్రిటీ షబానా ఆజ్మీ. ఆదివారం నాడు ఆమె తన తండ్రి, ప్రముఖ ఉర్దూ కవి కైఫీ ఆజ్మీ రాసిన కవితలను, పాటలను పాడి అలరించారు. అరవై ఎనిమిదేళ్ల వయసులో ఆమె గ్లామర్‌తోపాటు స్వరంలో తియ్యదనం ఆకట్టుకున్నాయి. తండ్రి కైఫీ జీవితాన్ని ‘కైఫీయత్’ పుస్తకంగా వెలువరించారు షబానా. ఆ పుస్తకం మీద చర్చతో పాటు, కైఫీ జీవితం మీద ఏర్పాటు చేసిన చర్చాగోష్టిలో పాల్గొనడానికి హైదరాబాద్‌కి వచ్చారు షబానా. ఆమె పుట్టింది కూడా హైదరాబాద్‌లోనే. షబానా తల్లి షౌకత్‌ది హైదరాబాద్. ఆమె కైఫీ రచనలకు అభిమాని. ఆయన హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఆయన దృష్టిలో పడడానికి ప్రయత్నించి మరీ తన ప్రేమను వ్యక్తం చేసినట్లు చెప్పారు షబానా.
కైఫీ రక్తంతో రాసిన ప్రేమలేఖలను నమ్మవద్దని, అందులో వ్యక్తం చేసిన భావుకతలకు మురిసిపోవద్దని షౌకత్‌ను ఆమె తండ్రి (షబానా తాతగారు) హెచ్చరించినట్లు కూడా చెప్పారు షబానా. అయినప్పటికీ పట్టుపట్టి మరీ అతడినే పెళ్లి చేసుకున్న వైనాన్ని వివరించారు, పెళ్లి తర్వాత పెద్దగా సంపాదన లేని కైఫీ ఎనిమిది కుటుంబాలకు కలిపి ఒకటే టాయిలెట్ ఉండే ఇంట్లో కాపురం పెట్టారు. డబ్బు లేని బాల్యమే అయినా అందమైన జీవితాన్ని గడిపిన రోజులవి అన్నారామె. తండ్రి ఫొటో పేపర్‌లో ప్రచురించినప్పుడు ఫ్రెండ్స్ ప్రశంసలను ఎంజాయ్ చేయడం వంటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారామె.కైఫీ చిన్నప్పటి నుంచి పండక్కి కొత్త దుస్తులు వేసుకోవడాన్ని వ్యతిరేకించేవారని, రైతు బిడ్డ కొత్త దుస్తుల కోసం ఆరాటపడకూడదని చెప్పేవారని ఆమె తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు.
పదకొండేళ్ల వయసులో తండ్రి రాసిన కవితను, ఆయన తండ్రి విశ్వసించకపోవడాన్ని, మళ్లీ రాసి చూపించిన తర్వాత నమ్మిన విషయాలను పంచుకున్నారు. ‘‘మా అమ్మ చాలా ప్రాక్టికల్‌గా ఉండేది. వారి దాంపత్యంలో ఎంత ప్రేమ ఉండేదో అంతటి గొడవలు కూడా ఉండేవి. మా నాన్న చాలా నైస్‌గా చక్కదిద్దేవారు. వాళ్ల కాపురంలో సమానత్వం కోసం ప్రయత్నించడం జరగలేదు, వారి ఆచరణలో ఉండేది. నాన్న రాసిన ‘నా వెనుక నడిచే అనుచరురాలు కాదు... నువ్వు నా పక్కన నడిచే సహచరిగా ఉండాలి’ అనే కవిత మా అమ్మను ఆయన ప్రేమలో పడేసింది. అది చివరి వరకు వాళ్ల జీవితంలో కొనసాగింది.
అది మా అమ్మానాన్నలకే కాదు, ప్రతి జంటకీ వర్తిస్తుంది. అన్వయించుకోగలిగితే ప్రేమబంధం ఎప్పటికీ సజీవంగా ఉంటుంది’ అన్నారు షబానా. సమాజంలో మత సంఘర్షణలు వాటికవిగా జరగవు. వాటి వెనుక కొన్ని ప్రయోజనాలుంటాయి. అవి ప్రేరేపించినప్పుడే మతకల్లోలాలు జరుగుతాయని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ‘‘మీటూ ఉద్యమం చాలా గొప్ప సామాజికోద్యమం. పని ప్రదేశంలో మహిళలకు రక్షణ పూరిత వాతావరణం ఉండాలి. తమకు జరుగుతున్న అన్యాయం మీద గళమెత్తిన అమ్మాయిలకు సెల్యూట్’’ అని ప్రశంసించారు.
ఇన్‌పుట్స్ : మంజీర, ఓ మధు
Comments
Please login to add a commentAdd a comment