దీర్ఘాయుష్షుకు మనిషి మరో అడుగు దగ్గరయ్యాడు. శరీరంలో వయసుతోపాటు నశించిపోయే కణాలను ఎంచక్కా తొలగించే మందును తయారు చేసిన టెక్సస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దాన్ని విజయవంతంగా మానవులపై ప్రయోగించారు కూడా. శరీరంలోని కణాలు నిత్యం విభజితమవుతూ పాడైపోతూంటాయన్నది తెలిసిన విషయమే. పాడైన కణాలన్నీ శరీరం బయటకు వెళ్లిపోవు. విభజితం కాకపోయినా.. ఈ కణాలు కొన్ని రసాయనాలను ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి. వయసుతోపాటు వచ్చే సమస్యలన్నీ ఈ రసాయనాల కారణంగానే అని కొంతమంది శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో టెక్సస్ వర్సిటీ శాస్త్రవేత్తలు 14 మంది ఊపిరితిత్తుల కేన్సర్ రోగులపై కొన్ని పరిశోధనలు చేపట్టారు.
పాడైన... వృద్ధ కణాలను తొలగించగలదని అనుకున్న మందులను మూడు వారాల పాటు వీరికి అందించారు. ఈ సమయంలోనే కేన్సర్ మందులు కూడా వీరు తీసుకున్నారు. మూడు వారాల తరువాత జరిపిన పరిశీలనల్లో ఈ రోగులు మునుపటి కంటే ఎక్కువ దూరం నడవగలరని తెలిసిందని జేన్ జస్టిస్ అనే శాస్త్రవేత్త తెలిపారు. వారి పరిస్థితి మెరుగైందనేందుకు కొన్ని ఇతర రుజువులు కూడా కనిపించాయని జేన్ తెలిపారు. దుష్ప్రభావాలు ఏమీ లేకపోవడం ఈ మందుతో కలిగే అదనపు ప్రయోజనమని అయితే మరిన్ని విస్తృత స్థాయి పరిశోధనలు చేపట్టి ఫలితాలను నిర్ధారించుకోవాల్సి ఉందని వివరించారు. ఈ దిశగా తాము ఇంకో 15 మంది ఊపిరితిత్తి రోగులకు, 20 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఈ మందు ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment