
సెంట్రల్ యూనివర్సిటీలకు ఉమ్మడి విధానాలు..
దేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి, పర్యవేక్షణ ఇతర అంశాలపై.. యూనివర్సిటీ ఆఫ్ కర్నాటక మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎ.ఎం. పఠాన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ గత ఏడాది అందించిన నివేదికను, అందులోని సిఫార్సులను అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని తాజాగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సెంట్రల్ యూనివర్సిటీలను ఆదేశించింది. దీంతో దేశంలోని అన్ని సెంట్రల్ యూనివర్సిటీల పర్యవేక్షణకు ఒకే విధానం అమలు కానుంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 45 సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి. కమిటీ చేసిన సిఫారసులు..
ప్రస్తుతం ఉన్న ఛాన్సలర్ విధానాన్ని రద్దు చేయాలి. కొత్తగా అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో కూడిన కౌన్సిల్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్‌ను ఏర్పాటు చేయాలి. దీనికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి ఎక్స్ అఫీషియో చైర్‌పర్సన్‌గా వ్యవహరించాలి.
ఈ కౌన్సిల్ అన్ని యూనివర్సిటీల పరిపాలన, విద్యా విధానాలు, అకడమిక్ క్యాలెండర్ వంటి అంశాలను పర్యవేక్షించాలి.
వైస్ ఛాన్సలర్ల నియామకం కోసం తొమ్మిది మంది సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీ ఏర్పాటు చేయాలి.
వైస్ ఛాన్సలర్లు యూజీసీ చైర్మన్‌కు బాధ్యులుగా ఉండాలి.
మూల్యాంకనంలో మార్పులు చేసి చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్‌కు రూపకల్పన చేయాలి.
అన్ని వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలను కేంద్రీకృత విధానంలో భర్తీ చేయాలి.