ప్లాన్ చేశా..ల్యాప్‌టాప్ కొన్నా..
నేనో ప్రైవేట్ సంస్థలో చిరుద్యోగిని. కొన్నాళ్ల క్రితం మా అమ్మాయికి కంప్యూటర్ కొనడం కోసం నేను అమలు చేసిన వ్యూహం.. నాలాంటి మరికొందరికి కొంతైనా ఉపయోగపడగలదన్న ఉద్దేశంతో ఈ లేఖ రాస్తున్నాను. కొన్నాళ్ల క్రితమే కాస్త పై చదువుల స్థాయికి వచ్చిన మా అమ్మాయికి ప్రాజెక్టు వర్కుల కోసం కంప్యూటర్ తప్పనిసరైంది. ఇంట్లో లేకపోవడంతో ఫ్రెండ్స్ ల్యాప్‌టాప్‌లపై ఆధారపడాల్సి వచ్చేది.
తను ఇబ్బందిపడుతుండటాన్ని చూడలేక ఎలాగైనా కంప్యూటర్ కొనివ్వాలనుకున్నాను. దీంతో ఒక మార్గం ఆలోచించాను. నాకు బడ్జెట్ మరీ ఎక్కువ కాకుండా, అలాగే తన అవసరాలకు ఉపయోగపడేలా ఉండే ల్యాప్‌టాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ముందుగా రేట్ల గురించి వాకబు చేశాను. దాదాపు రూ. 25,000 స్థాయిలో ఉన్నట్లు తెలిసింది. నా ఫ్రెండు ఒకరి దగ్గర క్రెడిట్ కార్డు ఉంది. దాని మీద ఈఎంఐలపై తీసుకోవాలనుకున్నాను.
అయితే, నెల నెలా కొంత మొత్తం తీసి పక్కన పెట్టగలిగే పరిస్థితి ఉంటుందా లేక తీసుకున్న తర్వాత మాట పోగొట్టుకోవాల్సి వస్తుందా అని సందేహం వచ్చింది. దీంతో ముందు ఒక మూడు, నాలుగు నెలల పాటు నేను ఎంత ఈఎంఐ అనుకుంటున్నానో అంత పక్కకు తీసి ఉంచాలనుకున్నాను. వెంటనే అమల్లో పెట్టాను. మిగతా ఖర్చులు కొంత తగ్గించుకోగా.. నిజంగానే అంత ఈఎంఐ మొత్తాన్ని మూడు నెలల పాటు పక్కకు ఉంచగలిగాను. ఫలితంగా మిగతాది కూడా కట్టేయగలనన్న భరోసా వచ్చింది.
ఈ మధ్యలో రేటు కూడా కాస్త తగ్గింది. నేను దాచిపెట్టిన మొత్తాన్ని కట్టేసి.. మిగతా మొత్తానికి ఫ్రెండు కార్డును ఉపయోగించి మొత్తానికి ల్యాప్‌టాప్ తీసుకున్నాను. మా అమ్మాయికి దాన్ని గిఫ్ట్ ఇచ్చినప్పుడు తను ఎంతగా ఆనందపడిందో. సరే ఇక, ఈఎంఐల విషయానికొస్తే.. అప్పటిదాకా ఒక రకరమైన బడ్జెట్‌కు పొదుపు అలవాటు పడటంతో మిగతా మొత్తాన్ని కట్టేయడం పెద్ద కష్టం అనిపించలేదు. సులువుగానే కట్టేయగలిగాను.
- రామసుబ్రహ్మణ్యం, విజయవాడ