వెబ్‌లో చౌక రుణాలు..
బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం ఆన్‌లైన్ ఫైనాన్స్ సంస్థలు తెరపైకి వచ్చాయి. ఇవి అప్పులిచ్చేవారిని, తీసుకునే వారిని అనుసంధానం చేస్తుంటాయి. ఫెయిర్‌సెంట్, ఐ-లెండ్ తదితర వెబ్‌సైట్లు ఈ కోవకి చెందినవే. వీటిలో కనిష్టంగా 12 శాతం వడ్డీకి కూడా రుణాలు లభిస్తున్నాయి. ఇటు ఇచ్చేవారికి కాస్త అదనంగా రాబడి, అటు తీసుకునే వారికి కాస్త తక్కువ వడ్డీ రేటు ప్రయోజనాలు అందించేలా ఈ వెబ్‌సైట్లు ఉభయతారకంగా ఉంటున్నాయి.
ఈ వెబ్‌సైట్లు పనిచేసే తీరు ప్రత్యేకంగా ఉంటుంది. తమ దగ్గరున్న డబ్బుపై బ్యాంకు డిపాజిట్ రేటు కన్నా అదనపు వడ్డీ కావాలనుకునే వారు ఈ సైట్లలో రిజిస్టరు చేసుకుంటారు. తాము ఎంత వడ్డీ రేటుకు, ఎంత మందికి, ఎంత చొప్పున రుణం ఇవ్వాలనుకుంటున్నదీ అందులో పేర్కొంటారు. అలాగే, అప్పు కావాలనుకునే వారు కూడా ఈ సైట్లో రిజిస్టరు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత రుణం కావాలి, ఎంత వడ్డీ రేటు చెల్లించగలరో పేర్కొని, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఆ వివరాలను పోర్టల్ ధృవీకరించుకుని వెబ్‌సైట్లో ఉంచుతుంది.
ఇచ్చేవారు, తీసుకునే వారి మధ్య ఒప్పందం కుదిరితే రుణ మంజూరు ప్రక్రియ మొదలవుతుంది. ఆన్‌లైన్లోనే నగదు బదలాయింపు జరుగుతుంది. రుణం తీసుకున్న వారు ప్రతి నెలా ఈఎంఐని పోర్టల్‌కి చెల్లించాల్సి ఉంటుంది. దాన్ని పోర్టల్ మళ్లీ రుణం ఇచ్చిన వారికి బదలాయిస్తుంది. కొన్ని వెబ్‌సైట్లు.. రిజిస్ట్రేషన్‌కు, రుణ వితరణకు సంబంధించి స్వల్పంగా చార్జీలు విధిస్తున్నాయి. ఈ లావాదేవీల్లో ఆర్‌బీఐ వంటి నియంత్రణ సంస్థల ప్రమేయమేమీ ఉండదు.