
తినుబండారాలు, పానీయాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు కృత్రిమ రసాయనాలను వాడతారన్నది అందరికీ తెలిసిందే. రెడీమేడ్ ఫుడ్‌ను తింటే జబ్బులొస్తాయని అనేదీ ఇందుకే. అయితే నాన్‌యాంగ్ టెక్నలాజికల్ యూనివఉఇటీ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని ఇకపై కృత్రిమ ప్రిజర్వేటివ్స్ వాడాల్సిన అవసరం లేదు. వీటికంటే మెరుగైన, సహజసిద్ధమైన పదార్థాలతో తయారైన ప్రిజర్వేటివ్స్‌ను తాము అభివృద్ధి చేశామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలవిలియం ఛెన్ తెలిపారు. కాయగూరలు, పండ్లలో ఉండే ఫైటో న్యూట్రియంట్స్, ఫ్లేవనాయిడ్లు ఆహారాన్ని నిల్వ చేసేందుకు వాడుకోవచ్చునని వీరు నిరూపించారు.
అంతేకాదు.. ఫ్లేవనాయిడ్లతో బ్యాక్టీరియాను నాశనం చేసేందుకు కూడా వీరు ఒక పద్ధతిని అభివృద్ధి చేశారు. పండ్ల రసాలు, మాంసం ఉత్పత్తుల్లో ఈ కొత్త రకం ప్రిజర్వేటివ్స్‌ను వాడి మెరుగైన ఫలితాలు సాధించామని కృత్రిమ ప్రిజర్వేటివ్స్‌తో కూడిన ఆహార పదార్థంలో ఆరు గంటల్లోనే బ్యాక్టీరియా కనిపిస్తే సహజ ప్రిజర్వేటివ్స్ రెండు రోజులపాటు ఆహారాన్ని తాజాగా ఉంచగలిగాయని ఛెన్ వివరించారు. ఈ కొత్త ప్రిజర్వేటివ్స్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు తాము పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నామని చెప్పారు. పరిశోధన వివరాలు ఫుడ్ కెమిస్ట్రీ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.