నా వయసు 34 ఏళ్లు. నా జుట్టు ఇప్పుడిప్పుడే తెల్లబడుతోంది. అయితే ఇప్పటివరకు నేను జుట్టుకు రంగు వేయలేదు. ఇకపై హెయిర్–డై వాడదామని అనుకుంటున్నాను. దాని విషయంలో నా ఎంపిక ఎలా ఉండాలి? హెయిర్–డైతో ఏమైనా ప్రమాదాలు ఉంటాయా? దయచేసి నాకు హెయిర్–డై వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విపులంగా చెప్పండి.
చాలామంది హెయిర్–డై లను చాలారకాల ప్రయోజనాల కోసం వాడుతుంటారు. హెయిర్–డై విషయంలో మీ ఎంపిక అన్నది అసలు మీరు హెయిర్ డైని ఎందుకు ఉపయోగిస్తున్నారన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. అంటే... కొందరు జుట్టు తెల్లబడ్డందున దాన్ని నల్లగా కనిపించేలా చేసుకోవడం కోసం రంగేసుకుంటారు. అయితే మరికొందరు జుట్టు నల్లగా ఉన్నప్పటికీ దాన్ని ఫ్యాషనబుల్‌గా గ్రూమ్ చేసుకోవడం కోసం రంగు వేసుకుంటుంటారు. ఉదాహరణకు కొందరు జుట్టు చివర్లు ఎర్రగా మార్చుకునేందుకు, మరికొందరు కొన్ని పాయలు ఎట్రాక్టివ్‌గా కనిపించేందుకు రకరకాల షేడ్స్‌లో హెయిర్–డైని వాడుతుంటారు. మీరు ఏ ప్రయోజనం కోసం హెయిర్–డై వాడుతున్నప్పటికీ మీ బడ్జెట్‌లోనే కాస్తంత నాణ్యమైనది ఎంచుకోవడం మంచిది.
హెయిర్ డైతో వచ్చే సాధారణ ప్రమాదాలివే...
►హెయిర్ డైలో ఉండే రసాయనాలలో కొన్ని కెమికల్స్ మీకు, మీ చర్మానికి, మీ జుట్టుకు సరిపడకపోవచ్చు. దాని వల్ల కొందరిలో అలర్జీ రావచ్చు. ఫలితంగా చర్మం ఎర్రబారడం, దురదపెట్టడం, ఎర్రటి దద్దుర్లు (ర్యాష్), డై తగిలిన చోట కొద్దిగా వాపు వంటివి కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో తలకు రంగు పెట్టినా కళ్లు, పెదవులు లేదా మొత్తం శరీరం మీద వాపు రావడం వంటి దుష్ప్రభావాలూ కనిపించవచ్చు. ఇలా జరిగితే వీలైనంత త్వరగా హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్/డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి
►కొన్ని సందర్భాల్లో హెయిర్‌డైలో ఉండే రసాయనాలు కళ్లను మండించడం, కళ్ల నుంచి నీరుకారేలా చేయడం, గొంతులో ఇబ్బంది కలిగించడం, తుమ్ములు వచ్చేలా చేయడం వంటి ఇబ్బందులు కలగజేస్తాయి. ఇవి కొందరిలో శ్వాస తీసుకోవడంలోనూ తీవ్రమైన అవరోధాలకు దారితీస్తాయి. ఒక్కోసారి ఆస్తమాకూ దారితీయవచ్చు. చాలాసార్లు సురక్షితంగా వాడిన రసాయానాలే, చాలా ఏళ్లు గడిచాక కూడా మీకు ప్రమాదకరంగా, అలర్జిక్‌గా పరిణమించవచ్చు. అందుకే రంగు వేసుకునే ప్రతిసారీ అదే మొదటిసారి అయినట్లుగా జాగ్రత్తగా ఉండాలి
►అయితే మొదటిసారి హెయిర్–డై వాడేవారు అది మనకు సరిపడుతుందా లేదా అన్నది పరీక్షించుకొని, ఒకవేళ నిర్దిష్టంగా ఆ బ్రాండ్ హెయిర్–డైతో మీకు ఏవైనా అలర్జిక్ లక్షణాలు కనిపిస్తుంటే దానికి దూరంగా ఉండటం మేలు.
హెయిర్–డై వేసుకునే పద్ధతి ఇలా...
►ఒక గిన్నెలో మీరు వేసుకోబోయే హెయిర్–డైని కలుపుకుని సిద్ధం చేసుకోండి. దాన్ని మీకు అనువైన బ్రష్‌తో హెయిర్ డైలో ముంచుతూ... కొద్ది కొద్ది మోతాదుల్లో తీసుకుంటూ తీసుకుంటూ జుట్టుకు రాయండి. బ్రష్ మీద పెద్దమొత్తంలో తీసుకోకండి. ఎందుకంటే పెద్దమొత్తంలో బ్రష్ మీదకు రంగును తీసుకుంటే అది కంటిలోకి కారే ప్రమాదం ఉంది. హెయిర్ డై లోని రసాయనాలు కంటికి హాని చేస్తాయి. హెయిర్‌డై కళ్లలోకి స్రవిస్తే... కళ్లు మండటం, కళ్లకు ఇన్ఫెక్షన్ రావడం కూడా జరగవచ్చు. ఆ రసాయనాలు ఒక్కోసారి అంధత్వానికీ దారితీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి హెయిర్–డై వేసుకునే సమయంలో కంటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి
►హెయిర్ డైలో ఉండే రసాయనాలు వెంట్రుకలోకి ఇంకిపోతాయి. ఒక రసాయన చర్య జరిపి జుట్టును నల్లబారుస్తాయి. ఆ రసాయనాలు వెంట్రుకను బిరుసెక్కేలా చేస్తాయి. ఫలితంగా చాలాకాలం రంగువేసుకుంటూ ఉన్నవారిలో వెంట్రుక కాస్త రఫ్‌గానూ, తేలిగ్గా విరిగిపోయేలా (బ్రిటిల్‌గా) మారుతుంది. ఇక మహిళల్లో హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేసుకుంటూ రంగు వేసుకునేవారిలో ఈ పరిణామం మరింత స్పష్టంగా కనిపిస్తుంటుంది
►కృత్రిమంగా తయారు చేసే ప్రతి హెయిర్ డైలోనూ, కాలీ మెహందీలోనూ పీపీడీ (పారాఫినైలీన్ డై అమైన్– ఇదే రంగును కల్పించే ప్రధాన రసాయనం) వంటి రసాయనాలు ఉంటాయి. బ్లాక్ హెన్నా కూడా అంత సురక్షితం కాదు. వీటిలో ఉండే రసాయనాల వల్లనే రియాక్షన్స్ వస్తాయి. అయితే ఇప్పుడు ఒకింత సురక్షితమైన మెడికేటెడ్ హెయిర్ డైస్ దొరుకుతున్నాయి. మీ డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించి వాటిని మీరు సురక్షితంగా వాడుకోవచ్చు
►కొంతమంది హెయిర్ డై ప్యాక్‌మీద అమోనియా ఫ్రీ అనే మాట చూసి అది సురక్షితమని వాడుకుంటుంటారు. కానీ అందులో కూడా పీపీడీ అనే రసాయనం లేనిదే వాడాలి. ఎందుకంటే అమోనియా ఫ్రీ అని ఉన్నప్పటికీ ఈ పీపీడీ కూడా అమోనియా నుంచి వచ్చే రసాయనమే కాబట్టి అమోనియా ఫ్రీ అనే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...
►మీరు తొలిసారిగా తలకు రంగు వేసుకుంటున్నారా? అయితే మొదటిసారి మీరే ఇంటి దగ్గర వేసుకోకండి. ఒకటి రెండుసార్లు మంచి పార్లర్‌లో ప్రొఫెషనల్స్ సహాయంతో రంగు వేసుకోండి. వారెలా వేస్తున్నారో గమనించి, ఆ తర్వాత మీరు ఆ టెక్నిక్స్‌ను అనుసరించండి
►తొలిసారి రంగు వేసుకునే వారు నేరుగా దాన్ని తలకు పట్టించుకోవడానికి బదులు ముందుగా చెవి వెనక ఉండే ఒక పాయకు రంగు వేసి, కాసేపు ఉంచి, దాన్ని కడుక్కోవాలి. ఆ తర్వాత 48 గంటల పాటు పరిశీలించి చూసుకోవాలి. ఆ సమయంలో ఎలాంటి దుష్ప్రభావాలూ (సైడ్ ఎఫెక్ట్స్) కనిపించపోతే... ఇక ఆ రంగును నిరభ్యంతరంగా వాడవచ్చు. ఒకవేళ ఏదైనా సైడ్‌ఎఫెక్ట్ కనిపిస్తే ఆ బ్రాండ్‌ను వదిలేసి, మరో బ్రాండ్ ఎంచుకోండి
►మీకు సురక్షితమని తేలిన బ్రాండ్‌నే ఎప్పుడూ కొనసాగించండి. కొత్త బ్రాండ్ వాడదలచుకున్నప్పుడు మళ్లీ చెవి వెనక ఉన్న వెంట్రుకలలో ఒక పాయకు రంగు వేసి మళ్లీ మరో 48 గంటలు వేచిచూసి, సురక్షితమని తేలాకే బ్రాండ్ మార్చండి
►మీరు రంగు అంటకూడదని అనుకుంటున్న శరీర భాగాల చర్మంపైన ముందుగా పెట్రోలియం జెల్లీని పూయండి
►రంగు అంటకూడదని భావించే మెడ వెనక భాగంపై పాత టవల్‌ను చుట్టండి
►రంగును ఒకే తరహాలో (యూనీఫామ్‌గా) అంటేలా బ్రష్‌ను ఉపయోగించండి. అంతే తప్ప ఒక్కచోట ఎక్కువ, మరోచోట తక్కువ పూయకండి. దీంతో తెరపలు తెరపలుగా రంగు కనిపించే ఆస్కారం ఉంది
►రంగు పూసే సమయంలో చేతులకు గ్లౌవ్స్ తప్పక ధరించండి
►వెంట్రుక పెరుగుతున్న కొద్దీ కుదుళ్ల వద్ద తెల్లగా కనిపించే చోట మాత్రమే రంగు పూయదలచినప్పుడు, మిగతా నల్లగా ఉన్న వెంట్రుకల వరకు కండిషనర్ పూసి, తెల్లని చోట టచప్ చేయండి
►మీరు ఎంపిక చేసుకున్న షేడ్ ఏదో అదే వేసుకోండి. అంతేగానీ... రెండు షేడ్‌ల రంగులు తీసుకొని ఈ రెండింటినీ కలపకండి
►రంగు వేసే సమయంలో దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కళ్ల మీదికి జారనివ్వకండి. ఈ జాగ్రత్తను తప్పక పాటించండి
►రంగు వాసన వల్ల శ్వాస సరిగా తీసుకోలేకపోవడం లేదా ఆయాసం రావడం జరుగుతుంటే వాసన తగలకుండా ముక్కుపై శుభ్రమైన గుడ్డతో కవర్ చేసుకోండి
►హెయిర్‌డై కేవలం తలకు మాత్రమే వాడండి. కనుబొమలకూ, కనురెప్పలకూ ఎట్టిపరిస్థితుల్లోనూ హెయిర్‌డై వాడకూడదు
►మీరు కొన్ని బ్రాండ్‌లోని జాగ్రత్తలను, అందులో ఉపయోగించిన పదార్థాలను ఒకసారి చదవండి. అందులో కోల్‌తార్, లెడ్ ఎసిటేట్, రెసార్సినాల్ వంటి రసాయనాలు ఉన్నట్లు రాసి ఉంటే దాన్ని వాడకండి
►ఒకవేళ మహిళలు గర్భం ధరించి ఉంటే... తాము గర్భవతిగా ఉన్న సమయంలో హెయిర్‌డై ఉపయోగించకపోవడమే మంచిది
►హెయిర్‌డై వల్ల యౌవనంగా కనిపిస్తాం. అలా కనిపించడం మనందరం కోరుకునేదే. అయితే ఆ చర్య వల్ల మనకు హాని జరగకుండా చూసుకోవడం కూడా మన బాధ్యతే.
రంగు వేసుకునే సమయంలో మీ గోళ్లు జాగ్రత్త...
జుట్టుకు రంగు వేసుకునే సమయంలో మీరు సరైన జాగ్రత్త తీసుకోకపోతే... హెయిర్ డై గోళ్లకు అంటుకునే ప్రమాదం ఉంది. అది ఏ మాత్రం గోరుకు అంటుకున్నా పర్మనెంట్‌గా ఉండిపోతుంది. అయితే ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గోరు పెరుగుతున్న కొద్దీ, పెరిగిన గోరును మనం కట్ చేసుకున్న కొద్దీ మూడు నెలల్లో గోరు రంగు పూర్తిగా తొలగిపోతుంది. మన గోరూ, జుట్టూ ఈ రెండూ కూడా కెరొటిన్ అనే పదార్థంతో తయారవుతాయి. కాబట్టి జుట్టుకు అంటుకున్న రంగు ఎప్పటికీ ఉన్నట్లే గోరుకూ ఉంటుంది. కింది నుంచి పెరుగుతున్న కొద్దీ ఆ ఫ్రెష్ గోరుగానీ, జుట్టుగానీ తెల్లగా వస్తుంది.
డాక్టర్ స్వప్నప్రియ, డర్మటాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment