కోడి డైనోసర్!
జీవ ప్రపంచం
ఏమో... డైనోసర్ ఎగరవచ్చు! అని ఎవరైనా చమత్కారంగా అంటే- ‘‘చమత్కారం కాదు. అక్షరాలా నిజం. రెక్కల డైనోసర్ నిజంగానే గాల్లోకి ఎగిరింది’’ అనొచ్చు మనం. విషయంలోకి వద్దాం... సుమారు 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ‘కోడి రాక్షసబల్లి’ అనే ఒక భయానకమైన రాక్షసబల్లి తిరుగాడింది. ‘నరకం నుంచి వచ్చిన కోడి’ అని కూడా దీన్ని పిలుస్తారు.
సౌత్ డకోటా (అమెరికా)లోని పురాతన పర్వత ప్రాంతంలో ఈ ప్రాచీన డైనోసర్ అస్తిపంజరాన్ని యూనివర్శిటీ ఆఫ్ ఉట శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పురాణ కథలలో అంజు అనే పక్షి ఉంది. ఈ పక్షి రాక్షసుడిలా భయంకరంగా ఉంటుంది. అందుకే ఆ ప్రాచీన డైనోసర్‌కు ‘అంజు’ అని పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. పది అడుగుల ఎత్తు ఉండే అంజుకు కోడి తల మీద ఉన్నట్లు తురాయి ఉంటుంది.
అందుకే దీన్ని ‘కోడి డైనోసర్’ అని కూడా అంటారు. శక్తిమంతమైన రెక్కలు, ప్రమాదకరంగా కనిపించే ముక్కుతో ఇది చూపరులను భయపెడుతుంది. రెండు వందల అరవై ఎనిమిది కిలోల బరువు ఉంటే ఈ డైనోసర్ గుడ్లను, చిన్న చిన్న జంతువులను తినేది. అయితే డైనోసర్ అస్తిపంజరంపై అక్కడక్కడా గాయాల ఆనవాళ్లు కనిపించాయి. ‘‘అవి ఒకదానితో ఒకటి పోట్లాడుకొని ఉండవచ్చు. లేదా ఏదైనా శక్తిమంతమైన జంతువు వీటిపై దాడి చేసి ఉండవచ్చు’’ అని ఊహిస్తున్నారు శాస్త్రవేత్తలు.