biological world
-
రాగాల పల్లకిలో హెర్మిటమ్మా...
జీవ ప్రపంచం ఉత్తర అమెరికాలో ఎక్కువగా కనిపించే హెర్మిట్ను ‘పాటల పక్షి’ అంటారు. హెర్మిట్ పాడుతుంటే... కళ్ల ముందు అమృత ప్రవాహం కనిపిస్తుందని, ఆ పాట మనల్ని మరో లోకానికి తీసుకెళుతుందని, ప్రకృతిలో వినిపించే అరుదైన అద్భుతమైన గొంతు దానిదని...ఇలా భావుకంగా హెర్మిట్ గురించి చెప్పుకుంటారు. వెర్మంట్(అమెరికా) రాష్ట్ర పక్షి అయిన హెర్మిట్ ప్రస్తావన ప్రసిద్ధ కవి టి.యస్. ఇలియట్ ‘ది వేస్ట్ ల్యాండ్’లో కనిపిస్తుంది. భావుకత తాలూకు భ్రమలో నుంచి హెర్మిట్ గాన ప్రతిభను ఎక్కువగా అంచనా వేశారా? లేక నిజంగానే దానిలో ప్రతిభ ఉందా? ఈ సందేహాలకు సమాధానాలు తాజా పరిశోధనలో దొరుకుతాయి. యూనివర్సిటీ ఆఫ్ వియన్నా (ఆస్ట్రియా) కు చెందిన పరిశోధకులు ఇటీవల హెర్మిట్పై పరిశోధన నిర్వహించారు. రాగ జ్ఞానం ఉన్నప్పుడు గానం మరింత రాణిస్తుంది. ‘మరి హెర్మిట్కు ఆ జ్ఞానం ఉందా? లేక సహజంగానే ఆ గొంతులో పాట పలుకుతుందా?’ దీని గురించి పరిశోధకులు ఇలా చెబుతున్నారు: ‘‘ఒక గాయకుడు నోట్స్ ప్రకారం, లెక్క ప్రకారం ఎలాగైతే గానం చేస్తాడో... హెర్మిట్ పక్షులు కూడా అలాగే పాడుతాయి. తేడా ఏమిటంటే, హెర్మిట్ నోట్స్ మనకు కనిపించవు. అవి సహజంగా ఆ గొంతులో ఇమిడిపోయాయి.’’ మగ హెర్మిట్లు ఆరు నుంచి పది రకాలుగా పాడగలవు. ఆ గానం వేగంగా, హైపిచ్‌తో ఉంటుంది. తమ పరిశోధనలో భాగంగా గత అయిదు దశాబ్దాలకు చెందిన హెర్మిట్ రికార్డులను కూడా పరిశోధకులు లోతుగా విశ్లేషించారు. పధ్నాలుగు మగ హెర్మిట్లు పాడిన 144 భిన్నమైన పాటలను విశ్లేషించిన సంగీతకారిణి, జీవశాస్త్రవేత్త ఎమిలీ డోలి- ‘‘హెర్మిట్ గానాన్ని పరిశీలిస్తే... మానవ సంగీత సంప్రదాయానికి, జీవశాస్త్రానికి ఎంత దగ్గర సంబంధం ఉందో అర్థమవుతుంది’’ అంటున్నారు. ఏది ఏమైనా, గాయకులకు సాధనతో వచ్చే ఆరోహణ, అవరోహణ, విరుపు, హైపిచ్... మొదలైనవి హెర్మిట్ గొంతులో సహజసిద్ధంగా ఉండడం వరం అని చెప్పవచ్చు. -
అదిగదిగో ప్రమాద ఘంటికలు!
జీవప్రపంచం వాతావరణంలో జరిగే మార్పులు ఆల్పైన్ జాతి మేకల బరువుపై ప్రభావం చూపుతున్నట్లు తాజా పరిశోధన ఒకటి చెబుతోంది. ఆల్పైన్ మేకలు 1980తో పోలిస్తే 25 శాతం మేర బరువు తగ్గినట్లు ఉత్తర ఇంగ్లాండ్‌లోని డర్హమ్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఆల్పైన్ మేకలు రొమేనియా పర్వత ప్రాంతాలు, పోలండ్‌లోని టార్టా పర్వత ప్రాంతాలు, టర్కీలోని కొన్ని ప్రాంతాలు, న్యూజిలాండ్‌లోని దక్షిణ దీవిలో ఎక్కువగా కనిపిస్తాయి. ‘‘శరీర పరిణామం, బరువు తగ్గిపోవడం అనేది ఆల్పైన్ మేకలకు మాత్రమే పరిమితమైన వ్యవహారం కాకపోవచ్చు. జంతు ప్రపంచంలో చాలా జాతులపై వాతావరణ మార్పులు ప్రభావం చూపుతున్నాయి అనడానికి ఇది తిరుగులేని సాక్ష్యం’’ అంటున్నారు పరిశోధనకు నేతృత్వం వహించిన డా. టామ్ మాన్సన్. బరువు, పరిమాణం తగ్గడం అనేది వాటి శక్తిసామర్థ్యాలపై కూడా ప్రభావం చూపుతుంది. మునపటిలా చలికాలాన్ని తట్టుకునే సామర్థ్యం వాటిలో ఉండడం లేదు. గతంతో పోల్చితే ఆహారాన్వేషణలో చూపే ఉత్సాహం మేకలలో తగ్గిపోయింది. ఆహార అన్వేషణ కంటే విశ్రాంతికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు చెబుతున్నారు పరిశోధన బృందంలో ఒకరైన డా.స్టీఫెన్ విల్స్. ప్రమాదం నుంచి తప్పించుకోవడంలో ఆల్పైన్ మేకలకు గొప్ప పేరు ఉంది. ఎంత ప్రమాదం చుట్టుముట్టినా...అప్పటికప్పుడు వచ్చిన మెరుపు ఆలోచనతో అవి ప్రమాదం నుంచి బయటపడతాయి. రకరకాల ఈలలు, కూతలతో తోటి మేకలకు కూడా ప్రమాద హెచ్చరికను చేరవేస్తాయి. అసాధారణ నైపుణ్యాలతో ప్రమాదాల నుంచి బయటపడే ఆల్పైన్ మేకలకు తాజా ప్రమాదం గురించి తెలియకపోవచ్చు. తెలిసినా చేయగలిగేది ఏమీ లేక పోవచ్చు. పాపం! -
రెక్కల బల్లి!
జీవ ప్రపంచం బ్రెజిల్‌లోని పరాన రాష్ట్రంలో క్రూజైరో ప్రాంతంలో రెక్కలబల్లి(టెరోసార్)కు సంబంధించిన శిలాజాలను ఇటీవల కనుగొన్నారు. వాటి రెక్కల పొడవు సుమారు ఎనిమిది అడుగులు. రెక్కల బల్లులకు సంబంధించిన ఎముకలు ఇంత పెద్ద మొత్తంలో కనుక్కోవడం ఇదే తొలిసారి. ‘టెరోసార్’ అనే గ్రీకు పదానికి ‘రెక్కల బల్లి’ అని అర్థం. అయితే చాలామంది దీన్ని ‘రెక్కల డైనోసర్’ అని పిలుస్తున్నారు. ఇది సరైనది కాదంటున్నారు జీవశాస్త్ర నిపుణులు. ‘‘రెక్కల బల్లులు ఒకే ప్రాంతంలో గుంపులుగా నివసించేవి. ప్రస్తుతం మేము కనుగొన్న ప్రాంతం అలాంటి వాటిలో ఒకటి’’ అంటున్నాడు ‘ఫెడరల్ యూనివర్శిటీ ఆఫ్ రియోడిజనీరో’కు చెందిన పరిశోధకుడు డా.కెల్నర్. ఇవి అంతరించడానికి కరువు పరిస్థితులు లేదా ఎడారి తుపానులు కారణమని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ‘శక్తిమంతమైన విమానం’గా పేరున్న రెక్కల బల్లి శరీరాకృతిలో కాలక్రమంలో మార్పులు వచ్చాయి. మొదట్లో అవి నోటి నిండా పళ్లు, పొడవాటి రెక్కలతో ఉండేవి. ఆ తరువాత కాలంలో తోక పొడవు తగ్గింది. పళ్లు చాలా తక్కువగా కనిపించేవి. కొన్నిటికైతే అసలు పళ్లే ఉండేవి కావు. ఇటలీ శాస్త్రవేత్త కొసిమో 1784లో తొలిసారిగా రెక్కలబల్లికి సంబంధించిన శిలాజాన్ని కనుగొన్నాడు. అయితే దీన్ని ‘సముద్రపు జీవి’గా ఆయన పొరబడ్డాడు. కసుమి సాటో అనే జపాన్ శాస్త్రవేత్త ఆధునిక పక్షులతో పోల్చుతూ రెక్కలబల్లి మీద పుస్తకం కూడా రాశాడు. రెక్కలబల్లి గంటకు 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించేది. అలా వేలాది కిలోమీటర్ల దూరాన్ని సునాయాసంగా ప్రయాణించే సహజశక్తి దానికి ఉంది. డైనోసర్ల దాయాదులుగా చెప్పబడే రెక్కల బల్లులు కాల్పనిక సాహిత్యం, సినిమాలలో డైనోసర్ల స్థాయిలో పేరు తెచ్చుకోనప్పటికీ 1912లో అర్థర్ కానన్ రాసిన ‘ది లాస్ట్ వరల్డ్’ నవలలో, ‘కింగ్‌కాంగ్’ ‘వన్ మిలియనీర్స్ బి.సి’ సినిమాలలో వీటి ప్రస్తావన కనిపిస్తుంది. రెక్కల బల్లుల గురించి వివిధ దేశాల్లో లోతైన పరిశోధనలు ఎన్నో జరిగాయి. ప్రస్తుతం కనుగొన్న శిలాజాలు... పాత పరిశోధనలకు సరికొత్త సమాచారాన్ని అందించవచ్చు. -
ప్రమాదం అంచున...
జీవప్రపంచం బ్రిటన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో కీటకాలకు సంబంధించిన దురదృష్టకరమైన వాస్తవం ఒకటి బయటపడింది. గత 35 ఏళ్లలో కీటకాల జనాభా ప్రపంచవ్యాప్తంగా 45 శాతం తగ్గిపోయింది. ఒక విధంగా చెప్పాంటే ఇది కీటకాలకు మాత్రమే పరిమితమైన విషాదం కాదు. సమస్త మానవాళిని దిగ్భ్రాంతికి గురి చేసే సందర్భం. వాతావరణ మార్పులు, పట్టణీకరణ పెరగడం, పచ్చదనం తగ్గడం, ఆవాసాలకు అనువైన చోటు లేకపోవడం... మొదలైన కారణాల వలన కీటకాల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. పంట ఉత్పత్తికి, పర్యావరణ సమతూకానికి ఉపయోగపడే కీటకాల జనాభా తగ్గిపోవడం ప్రమాదకర సంకేతం అని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘‘కీటకాల జనాభా తగ్గుతూ పోవడం అనేది భవిష్యత్తులో అనేక రకాల ప్రతికూల ఫలితాలకు దారి తీస్తుంది. నిజానికి మనం... తెలిసిన నష్టాల గురించే భయపడుతున్నాం. రాబోయే కాలంలో ఊహకు కూడా అందని ప్రతికూల ఫలితాలను చూడాల్సి రావచ్చు’’ అంటున్నారు లండన్‌లోని ‘బయోసెన్సైస్ డిపార్ట్మెంట్’కు చెందిన డా.బెన్ కోలెన్. ‘‘ఈ పెద్ద ప్రపంచంలో ఈ చిన్న కీటకాల గురించి ఆలోచించే వ్యవధి ఎవరికి ఉంటుంది?’’ అంటున్నాడు స్టాన్ఫోర్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్మెంట్ (అమెరికా)కు చెందిన ప్రొఫెసర్ రోడాల్ఫ్ డిర్జో బాధగా. ‘ది డైవర్సిటీ ఆఫ్ లైఫ్’ అనే పుస్తకంలో జీవశాస్త్రవేత్త ఎడ్వర్డ్ ఒ. విల్సన్ ఇలా అంటారు: ‘‘కీటకాలన్నీ కనిపించకుండా పోయిన కొన్ని నెలలలోనే మనుషులు కూడా కనిపించరు’’ ఆయన హెచ్చరిక నిజం కాకూడదని ఆశిద్దాం. కీటకాల సంరక్షణకు కరాలు కలుపుదాం. -
మానవా... మారవా?!
జూలు ఏనుగు (ఊల్ మామత్)లు, ఇతర పెద్ద జంతువులు... ఎలా అంతరించి పోయాయి? అనే ప్రశ్నకు, ‘వాతావరణ మార్పులు’ అనే జవాబు సిద్ధంగా ఉండేది. నాలుగు వేల సంవత్సరాల క్రితం సైబీరియాలో అంతరించి పోయాయి మామత్‌లు. వాతావరణ మార్పుల వల్ల కాకుండా వేటగాళ్ల వల్లే అవి అంతరించిపోయాయని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. మెరుగైన ఆయుధసంపత్తి లేని ఆ కాలంలో అంత పెద్ద జంతువులను ఎలా వేటాడారు? అనే సందేహం రావచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మామత్లాంటి పెద్ద జంతువులను చంపడానికి అసాధారణమైన ఆయుధాలేవి వేటగాళ్లు వాడలేదు. పెంపుడు కుక్కల సహకారాన్ని మాత్రం తప్పనిసరిగా తీసుకునేవారు. ‘‘ముందుగా కుక్కలన్నీ మామత్ను చుట్టుముట్టేవి. అది కదలడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో వేటగాళ్లు వచ్చి దాడి చేసేవాళ్లు’’ అంటున్నాడు డెన్మార్క్‌కు చెందిన ఆంత్రోపాలజిస్ట్ పాట్ షిప్మాన్. గత సంవత్సరం విడుదలైన ఒక అధ్యయనం ప్రకారం... ఎన్నో వేల సంవత్సరాల క్రితమే యూరప్‌లో శునకాలు పెంపుడు జంతువులుగా ఉండేవి. వాటిని ప్రధానంగా వేటకు వాడుకునేవారు. అన్నట్టు మామత్ ఎముకలతో వేటగాళ్లు ఇండ్లను కూడా నిర్మించుకునేవారు. మొత్తం మీద ‘‘జూలు ఏనుగులు అంతరించిపోవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చుగాక, ప్రధానకారణం మాత్రం వేటగాళ్లే’’ అంటున్నారు యూనివర్శిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాకు చెందిన గ్లెన్ మెక్‌డోనాల్డ్ అనే పరిశోధకుడు. ‘‘ఆనాటి నుంచి ఈనాటివరకు ఎన్నోరకాల మార్పులు వచ్చాయి. మనుషుల నుంచి జీవజాతులకు ఏర్పడుతున్న ముప్పు విషయంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. పెపైచ్చు ప్రమాదం ఎన్నో రెట్లు పెరిగింది’’ అని ఆవేదన చెందుతున్నాడు మెన్డొనాల్డ్. నిజమే కదా మరి! -
కోడి డైనోసర్!
జీవ ప్రపంచం ఏమో... డైనోసర్ ఎగరవచ్చు! అని ఎవరైనా చమత్కారంగా అంటే- ‘‘చమత్కారం కాదు. అక్షరాలా నిజం. రెక్కల డైనోసర్ నిజంగానే గాల్లోకి ఎగిరింది’’ అనొచ్చు మనం. విషయంలోకి వద్దాం... సుమారు 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ‘కోడి రాక్షసబల్లి’ అనే ఒక భయానకమైన రాక్షసబల్లి తిరుగాడింది. ‘నరకం నుంచి వచ్చిన కోడి’ అని కూడా దీన్ని పిలుస్తారు. సౌత్ డకోటా (అమెరికా)లోని పురాతన పర్వత ప్రాంతంలో ఈ ప్రాచీన డైనోసర్ అస్తిపంజరాన్ని యూనివర్శిటీ ఆఫ్ ఉట శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పురాణ కథలలో అంజు అనే పక్షి ఉంది. ఈ పక్షి రాక్షసుడిలా భయంకరంగా ఉంటుంది. అందుకే ఆ ప్రాచీన డైనోసర్‌కు ‘అంజు’ అని పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. పది అడుగుల ఎత్తు ఉండే అంజుకు కోడి తల మీద ఉన్నట్లు తురాయి ఉంటుంది. అందుకే దీన్ని ‘కోడి డైనోసర్’ అని కూడా అంటారు. శక్తిమంతమైన రెక్కలు, ప్రమాదకరంగా కనిపించే ముక్కుతో ఇది చూపరులను భయపెడుతుంది. రెండు వందల అరవై ఎనిమిది కిలోల బరువు ఉంటే ఈ డైనోసర్ గుడ్లను, చిన్న చిన్న జంతువులను తినేది. అయితే డైనోసర్ అస్తిపంజరంపై అక్కడక్కడా గాయాల ఆనవాళ్లు కనిపించాయి. ‘‘అవి ఒకదానితో ఒకటి పోట్లాడుకొని ఉండవచ్చు. లేదా ఏదైనా శక్తిమంతమైన జంతువు వీటిపై దాడి చేసి ఉండవచ్చు’’ అని ఊహిస్తున్నారు శాస్త్రవేత్తలు.