మానవా... మారవా?!
జూలు ఏనుగు (ఊల్ మామత్)లు, ఇతర పెద్ద జంతువులు... ఎలా అంతరించి పోయాయి? అనే ప్రశ్నకు, ‘వాతావరణ మార్పులు’ అనే జవాబు సిద్ధంగా ఉండేది. నాలుగు వేల సంవత్సరాల క్రితం సైబీరియాలో అంతరించి పోయాయి మామత్‌లు. వాతావరణ మార్పుల వల్ల కాకుండా వేటగాళ్ల వల్లే అవి అంతరించిపోయాయని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది.
మెరుగైన ఆయుధసంపత్తి లేని ఆ కాలంలో అంత పెద్ద జంతువులను ఎలా వేటాడారు? అనే సందేహం రావచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మామత్‌లాంటి పెద్ద జంతువులను చంపడానికి అసాధారణమైన ఆయుధాలేవి వేటగాళ్లు వాడలేదు. పెంపుడు కుక్కల సహకారాన్ని మాత్రం తప్పనిసరిగా తీసుకునేవారు.
‘‘ముందుగా కుక్కలన్నీ మామత్‌ను చుట్టుముట్టేవి. అది కదలడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో వేటగాళ్లు వచ్చి దాడి చేసేవాళ్లు’’ అంటున్నాడు డెన్మార్క్‌కు చెందిన ఆంత్రోపాలజిస్ట్ పాట్ షిప్‌మాన్.
గత సంవత్సరం విడుదలైన ఒక అధ్యయనం ప్రకారం... ఎన్నో వేల సంవత్సరాల క్రితమే యూరప్‌లో శునకాలు పెంపుడు జంతువులుగా ఉండేవి. వాటిని ప్రధానంగా వేటకు వాడుకునేవారు. అన్నట్టు మామత్ ఎముకలతో వేటగాళ్లు ఇండ్లను కూడా నిర్మించుకునేవారు. మొత్తం మీద ‘‘జూలు ఏనుగులు అంతరించిపోవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చుగాక, ప్రధానకారణం మాత్రం వేటగాళ్లే’’ అంటున్నారు యూనివర్శిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాకు చెందిన గ్లెన్ మెక్‌డోనాల్డ్ అనే పరిశోధకుడు.
‘‘ఆనాటి నుంచి ఈనాటివరకు ఎన్నోరకాల మార్పులు వచ్చాయి. మనుషుల నుంచి జీవజాతులకు ఏర్పడుతున్న ముప్పు విషయంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. పెపైచ్చు ప్రమాదం ఎన్నో రెట్లు పెరిగింది’’ అని ఆవేదన చెందుతున్నాడు మెన్‌డొనాల్డ్.
నిజమే కదా మరి!