సమావేశంలో పాల్గొన్న మేయర్, కమిషనర్ తదితరులు
► న్యూఢిల్లీలో జీహెచ్‌ఎంసీ మేయర్, అధికారుల పర్యటన
► మౌలిక సదుపాయాల కల్పనపై సంతృప్తి
► ఎన్‌డీఎంసీ చైర్మన్ నరేష్‌కుమార్, అధికారులతో సమావేశం
► త్వరలో నగరంలో అమలుకు యోచన
సాక్షి, సిటీబ్యూరో: న్యూ ఢిల్లీలో మౌలిక వసతులకు కల్పనకు అక్కడి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని చూసి జీహెచ్‌ఎంసీ మేయర్, అధికారులు కితాబునిచ్చారు. దేశంలో వివిధ నగరాల్లో అమలులో ఉన్న మెరుగైన విధానాలను జీహెచ్‌ఎంసీలో అమలు చేయాలన్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు ఢిల్లీలో అమలవుతున్న సదుపాయాలపై అధ్యయనం చేసేందుకు మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో అడిషనల్ కమిషనర్ శంకరయ్య, సీసీపీ దేవేందర్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ సురేష్‌కుమార్ తదితరుల బృందం మంగళవారం ఢిల్లీలో పర్యటించింది.
ఈ సందర్భంగా వారు ప్రధాన ప్రాంతాల్లోని బస్‌షెల్టర్లు, పబ్లిక్ టాయ్‌లెట్లు, బస్‌బేలు, ఫుట్‌పాత్‌ల నిర్వహణ, చెత్త తరలింపు విధానం, మల్టీ లెవెల్ పార్కింగ్ తదితర అంశాలను పరిశీలించారు. అందంగా తీర్చిదిద్దిన బస్‌షెల్టర్లు, ఆక్రమణలు లేని ఫుట్‌పాత్‌లు, ఉచితంగా పబ్లిక్ టాయ్‌లెట్ల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ కార్యాలయంలో ఎన్‌డీఎంసీ చైర్మన్ నరేష్‌కుమార్, సెక్రటరీ చెంచల్‌యాదవ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పారిశుధ్య నిర్వహణ, పౌరసదుపాయాల కల్పన, రెవెన్యూ వసూళ్లు, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై నరేష్ కుమార్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి అవగాహన కల్పించారు. రాష్ట్రప్రభుత్వ ప్రతినిధి తేజావత్ రాంచంద్రుడు, ఆస్కి ప్రొఫెసర్ శ్రీనివాసచారి, మేజర్ శివకుమార్, ఆర్టీసీ ఈడీ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.