ప్రమాదం అంచున...
జీవప్రపంచం
బ్రిటన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో కీటకాలకు సంబంధించిన దురదృష్టకరమైన వాస్తవం ఒకటి బయటపడింది. గత 35 ఏళ్లలో కీటకాల జనాభా ప్రపంచవ్యాప్తంగా 45 శాతం తగ్గిపోయింది. ఒక విధంగా చెప్పాంటే ఇది కీటకాలకు మాత్రమే పరిమితమైన విషాదం కాదు. సమస్త మానవాళిని దిగ్భ్రాంతికి గురి చేసే సందర్భం.
వాతావరణ మార్పులు, పట్టణీకరణ పెరగడం, పచ్చదనం తగ్గడం, ఆవాసాలకు అనువైన చోటు లేకపోవడం... మొదలైన కారణాల వలన కీటకాల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది.
పంట ఉత్పత్తికి, పర్యావరణ సమతూకానికి ఉపయోగపడే కీటకాల జనాభా తగ్గిపోవడం ప్రమాదకర సంకేతం అని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
‘‘కీటకాల జనాభా తగ్గుతూ పోవడం అనేది భవిష్యత్తులో అనేక రకాల ప్రతికూల ఫలితాలకు దారి తీస్తుంది. నిజానికి మనం... తెలిసిన నష్టాల గురించే భయపడుతున్నాం. రాబోయే కాలంలో ఊహకు కూడా అందని ప్రతికూల ఫలితాలను చూడాల్సి రావచ్చు’’ అంటున్నారు లండన్‌లోని ‘బయోసెన్సైస్ డిపార్ట్‌మెంట్’కు చెందిన డా.బెన్ కోలెన్.
‘‘ఈ పెద్ద ప్రపంచంలో ఈ చిన్న కీటకాల గురించి ఆలోచించే వ్యవధి ఎవరికి ఉంటుంది?’’ అంటున్నాడు స్టాన్‌ఫోర్డ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ (అమెరికా)కు చెందిన ప్రొఫెసర్ రోడాల్ఫ్ డిర్జో బాధగా. ‘ది డైవర్సిటీ ఆఫ్ లైఫ్’ అనే పుస్తకంలో జీవశాస్త్రవేత్త ఎడ్వర్డ్ ఒ. విల్సన్ ఇలా అంటారు: ‘‘కీటకాలన్నీ కనిపించకుండా పోయిన కొన్ని నెలలలోనే మనుషులు కూడా కనిపించరు’’
ఆయన హెచ్చరిక నిజం కాకూడదని ఆశిద్దాం. కీటకాల సంరక్షణకు కరాలు కలుపుదాం.