చైల్డ్ ప్లాన్
బేసిక్స్.. బీమా
చదువు మొదలు.. లైఫ్‌స్టయిల్ దాకా ఏ తల్లిదండ్రులైనా పిల్లలకు అత్యుత్తమ భవిష్యత్తునే అందించాలని కోరుకుంటారు. పిల్లల కలలు, ఆకాంక్షలు సాకారం చేయడానికి తోడ్పడే సాధనాల్లో చైల్డ్ ప్లాన్లు కూడా ఉంటాయి. పాలసీదారుకు లైఫ్ కవరేజీ ఇవ్వడంతో పాటు పిల్లల విద్యావ్యయాలను ఎదుర్కొనే ధీమాను కలిగిస్తాయివి. సాధారణంగా టర్మ్ ప్లాన్లలో పాలసీదారు మరణించిన పక్షంలో క్లెయిమ్ మొత్తం చెల్లించడంతో పాలసీ ముగిసిపోతుంది. అదే చైల్డ్ ప్లాన్ల విషయానికొస్తే... పాలసీదారు మరణించినా ఈ పథకం కొనసాగుతుంది. మిగిలిన ప్రీమియంల భారాన్ని బీమా కంపెనీనే చూసుకుంటుంది. పాలసీదారు పాలసీ వ్యవధి తర్వాత కూడా జీవించి ఉన్న పక్షంలో టర్మ్ ప్లాన్లలో ఎలాంటి మెచ్యూరిటీ ప్రయోజనాలు ఉండవు. అదే చైల్డ్ ప్లాన్లలో మెచ్యూరిటీ ప్రయోజనాలు లభిస్తాయి. పిల్లలు పుట్టినప్పట్నుంచీ ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించవచ్చు.
చైల్డ్ యూనిట్ లింక్డ్ ప్లాన్లు (యులిప్), చైల్డ్ ఎండోమెంట్ ప్లాన్లు అంటూ వివిధ రకాల ప్లాన్లు ఉన్నాయి. చైల్డ్ యులిప్‌లో కొంత మొత్తం ప్రీమియాన్ని బీమా కంపెనీలు డెట్ సాధనాల్లోను.. మిగతా మొత్తాన్ని స్టాక్ మార్కెట్లలోనూ ఇన్వెస్ట్ చేస్తాయి. ఫండ్ తరహాలోనే ఆయా యూనిట్ల నెట్ అసెట్ వేల్యూని బట్టి రాబడులు ఉంటాయి. చైల్డ్ ఎండోమెంట్ ప్లాన్ల విషయానికొస్తే.. మొత్తం ప్రీమియాన్ని డెట్ సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. దానికి అనుగుణంగానే రాబడులు ఉంటాయి. ఈ పథకాల్లో ప్రీమియం వెయివర్ (అంటే పాలసీదారు మరణించిన పక్షంలో ఇక ప్రీమియాలు కట్టనక్కర్లేదు), యాక్సిడెంటల్ డెత్, వైకల్యం వంటి రైడర్లు ఉంటాయి.