ఇప్పటివరకు అమెరికా, బ్రిటన్ తదితర పశ్చిమ దేశాలను కుదిపేసిన ‘మీ టూ’ ఉద్యమం ఇప్పుడు చైనాలోనూ ఊపందుకుంటోంది. పనిచేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై ప్రపంచవ్యాప్తంగా గొంతెత్తుతున్న మహిళలతో చైనీస్ మహిళలు కూడా గొంతు కలిపారు. ఆ దేశంలో ట్విటర్ తరహా సామాజిక మాధ్యమ వేదిక అయిన ‘వీబో’లో ‘మీ టూ ఇన్ చైనా’ పేరుతో స్త్రీలు గొంతెత్తుతున్నారు. ఈ వీబోలోనే ‘ఫెమినిస్ట్ వాయ్‌సెస్’ అనే బ్లాగ్‌లో చర్చకు వచ్చిన ఆయా అంశాలు సెన్సార్‌కు కూడా గురయ్యాయంటే చైనా ఏ స్థాయిలో తన ఇమేజ్‌ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తోందో తెలుస్తోంది. మరోవైపు యాంటీ–సెక్సువల్ హరాస్‌మెంట్ (ఏటీఎస్‌హెచ్) అనే ‘వీ ఛాట్’ అకౌంట్ల ద్వారా తాము ఎదుర్కున్న ఇబ్బందులు, అనుభవాలు పంచుకుంటున్నారు అక్కడి యువతులు. ఈ నేపథ్యంలో అక్కడ అత్యున్నత విద్యాప్రమాణాలున్న పేకింగ్ విశ్వవిద్యాలయం 20 ఏళ్ల క్రితం ఓ విద్యార్థినిపై అక్కడి ప్రొఫెసర్ లైంగికదాడికి పాల్పడిన ఉదంతాన్ని తొలిసారిగా బహిరంగంగా ఒప్పుకుంది. 1998లో ఈ ఘటన జరిగాక ఏడాదిలోగానే ఆ అమ్మాయి అత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తూ డెంగ్ హుహవో అనే విద్యార్థి వీఛాట్‌లో రాసిన కథనాన్ని పదిలక్షల మందికి పైగా చూడడంతో పాటు షేర్ చేశారు. అక్కడ ఈ చర్చ ఊపందుకోగానే లైంగికదాడులపై నోరు విప్పుతున్న వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది.
ఎలా మొదలైంది ?
దాదాపు మూడున్నర నెలల క్రితం బీజింగ్‌లోని బీహంగ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని పూర్వ పరిశోధనా విద్యార్థి లువో క్విన్‌క్విన్ ధైర్యంగా వెల్లడించింది. పూల మొక్కలకు నీరుపోసే సాకుతో ప్రొఫెసర్ తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని ‘వీబో’లో ఆమె పెట్టిన నూతన సంవత్సర పోస్ట్‌కు కొన్ని గంటల్లోనే 30 లక్షల వ్యూస్ వచ్చాయి. దీంతో ఇదొక సంచలనంగా మారింది. దీనిని స్ఫూర్తిగా తీసుకుని విశ్వవిద్యాలయ క్యాంపస్‌లలో తీవ్రంగా ఉన్న వేధింపులపై పెద్దసంఖ్యలో మహిళలు గొంతువిప్పారు. ఈ క్రమంలో చైనాలోనూ ‘మీ టూ’ ఉద్యమానికి బీజాలు పడ్డాయి.. ఈ ఉదంతంపై బీహంగ్ విశ్వవిద్యాలయ విచారణలో సదరు ప్రొఫెసర్ పలువురు విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలింది. ఈ ఉద్యమంలో భాగంగా ఇరవై ఏళ్ల క్రితం ఘటనను అందరూ గుర్తు చేసుకోవడంతో పెకింగ్ విశ్వవిద్యాలయం నాటి ఘటనను అంగీకరించక తప్పలేదు.యూనివర్సిటీల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ప్రొఫెసర్లు, ఇతర మేధావులు పోటెత్తుతున్నాయి. దాంతో చైనా విద్యా శాఖ లైంగిక వేధింపులను నియంత్రించేందుకు ఒక కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపింది.
– కె. రాహుల్, సాక్షి నాలెడ్జ్ సెంటర్
నిరసన కంఠం
Comments
Please login to add a commentAdd a comment