ఆమె పేరు టాంగ్ జింగ్. స్వతంత్ర భావాలు గల మహిళ. చైనా మహిళలందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. కానీ ఆమె నిజం కాదు.. ఒక కల్పన.. చైనీస్ టీవీ డ్రామా ‘ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ మై లైఫ్’ లోని ఒక పాత్ర.. ఈ ప్రస్తావనకు ఓ కారణం ఉంది..
వివిధ రంగాలలో చైనా మహిళలు దూసుకుపోతున్నప్పటికీ, ఆర్థిక అసమానతలు, వ్యత్యాసం తగ్గాలంటే ఇంకో వందేళ్లైనా సరిపోదని ప్రపంచ లింగ వ్యత్యాస నివేదిక సూచిస్తోంది. 144 దేశాల్లో నిర్వహించిన సర్వేలో చైనా 100వ స్థానంలో ఉండటం ఇందుకు నిదర్శనం. మిగతా దేశాలతో పోలిస్తే చైనాలో నవజాత శిశువుల లింగ నిష్పత్తి అతి తక్కువగా ఉంది. చైనా ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఇది ముఖ్యమైనది. కొడుకు పుట్టాలని ఆశించే వారి సంఖ్య పెరగటం, కూతురంటే ‘ఆడ’పిల్ల అనే భావన ఉండటం ఇందుకు కారణం. టాంగ్ జింగ్ వంటి ఆదర్శ భావాలున్న మహిళలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ‘శక్తిమంతమైన మహిళలు సౌందర్యవతులు కారు’, ‘పనిమీద మాత్రమే శ్రద్ధ చూపించే మహిళలు పెళ్లికి అనర్హులు’, ‘30ఏళ్లు దాటిన మహిళలు కుటుంబానికే ప్రాధాన్యమివ్వా’లనే సంకుచిత భావనలున్న వ్యక్తులు ఉన్నంతకాలం పరిస్థితుల్లో మార్పురాదు. సమాన వేతనాలు పొందటం, పిల్లల బాధ్యతలు చూసుకోవడం, పనిని- ఇంటి బాధ్యతను సమతౌల్యం చేసుకోవడం, కెరీర్‌ను నిర్మించుకోవడం వంటి చర్యలు మాత్రమే సరిపోవు. మహిళలతో పాటు, వారి భర్తల, తోటి ఉద్యోగుల ఆలోచనా దృక్పథంలో మార్పు రావడంతో పాటు, ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి. కేవలం అంకెలకే పరిమితం కాకుండా నిజమైన మార్పు సంభవించినపుడే సమానత్వం చేకూరుతుంది. ఇప్పుడిప్పుడే చైనా మహిళలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారడానికి ఉదాహరణలు.
యూనివర్సిటీల్లో ఆమెదే పైచేయి...
చైనాలో పురుషుల సంఖ్యతో పోలిస్తే మహిళల సంఖ్య ఎక్కువ. నేటికీ చాలా కుటుంబాలు కొడుకులను మాత్రమే చదివించడానికి సుముఖంగా ఉన్నాయి. కానీ ఇందుకు పూర్తి విరుద్ధంగా చైనీస్ యూనివర్సిటీల్లో పురుషుల కన్నా మహిళల సంఖ్య ఎక్కువగా ఉందని అధికార గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకు కారణాలనేకం. చైనా విద్యా వ్యవస్థ బాలికలకు అనుకూలంగా ఉందని కొందరి వాదన. ప్రాథమిక స్థాయి విద్యా వ్యవస్థలో లింగ నిష్పత్తి సమానంగా ఉన్నప్పటికీ ఉన్నత స్థాయికి చేరేకొద్దీ బాలికల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. బాలుర కంటే బాలికలు విద్య పట్ల అమితాసక్తులు చూపడం, స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండటం వంటి అంశాలు వారి సంఖ్య పెరిగేందుకు దోహదపడుతున్నాయని నిపుణుల అభిప్రాయం. 90వ దశకం నుంచి చైనా యూనివర్సిటీల్లో మహిళలకు స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ వారి సంఖ్య పెరిగేందుకు చర్యలు తీసుకుంటోంది. అంతర్జాతీయ వ్యాపారం, మార్కెటింగ్, విదేశీ భాషలు ఇలా వివిధ రకాల కోర్సులను అందుబాటులోకి తెచ్చింది.
కార్మికశక్తిగా...
ప్రపంచ బ్యాంకు 2010- గణాంకాల ప్రకారం మహిళా కార్మిక ప్రాతినిథ్యంలో 73శాతంతో చైనా ప్రపంచ దేశాల్లోనే ప్రథమ స్థానంలో ఉంది. ఇటలీ, గ్రీస్ వంటి దేశాలలోని పురుషుల సంఖ్య కంటే కూడా ఇది అధికం. సాంకేతిక రంగంలో కూడా చైనా మహిళలు దూసుకుపోతున్నారు. 2013లో ఈ రంగంలోని మహిళల సంఖ్య 6.6 మిలియన్లకు చేరింది. మొత్తం మహిళా జనాభాలో ఇది 44 శాతం. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇంటర్నెట్ కంపెనీల స్థాపనలో 55 శాతం వాటా మహిళలదే. ఏ ఇతర దేశాలతో పోల్చినా ఇది అధికం.
ఆన్‌లైన్ షాపింగ్‌లోనూ ఆమె టాప్..
ఇంట్లోకి, ఇంట్లో వారందరికీ కావాల్సిన వస్తువులు చేకూర్చడం గృహిణులు ప్రాథమిక విధిగా భావిస్తారు. ఇక షాపింగ్ విషయం చెప్పనక్కర్లేదు. చైనా ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం ‘అలీబాబా’కంపెనీ గతేడాది తీసుకువచ్చిన సింగిల్స్ డే షాపింగ్ ఈవెంట్‌లో ఒక్కరోజులోనే 17.8 మిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. అలీబాబా యజమాని జాక్ మా అంతర్జాతీయ మహిళా వ్యాపారవేత్తల సదస్సులో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. తమ కంపెనీ ఎదుగుదలకు మహిళలే కారణమని, వచ్చే జన్మలో మహిళగా పుట్టాలని ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం 4.6 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ- కామర్స్ మార్కెట్ విలువ ఏటేటా 15 శాతం వృద్ధి చెందనుంది. చైనా విడుదల చేసిన బ్లూ బుక్ ఆఫ్ వుమన్స్ లైఫ్-2017 ప్రకారం దేశంలోని మెజారిటీ మహిళా వినియోగదారులు సుస్థిరాభిృద్ధి సాధించేందుకు, భావి తరాల కోసం సహజ వనరులు పరిరక్షించేందుకు గ్రీనర్ కన్జమ్‌ప్షన్ కాన్సెప్ట్‌లో భాగస్వాములవుతున్నారు.
సంపద సృష్టికర్తలు..
అద్భుత సృష్టికి మారుపేరైన చైనా మహిళా వ్యాపారవేత్తలకు స్వర్గధామం వంటిది. ప్రపంచ వ్యాప్తంగా స్వయంకృషితో ఎదిగి బిలియనీర్లుగా మారిన 88 మంది మహిళా వ్యాపారవేత్తల్లో 56 మంది చైనా మహిళలే ఉన్నారు. వీరిలో టెలికమ్యూనికేషన్, టెక్నాలజీ, మ్యానుఫాక్చరింగ్ వంటి వివిధ రంగాలకు చెందిన వారున్నారు. కఠోర శ్రమ, పని పట్ల ఉన్న నిబద్ధతలే వారి విజయ రహస్యం. దీనితో పాటు గత మూడు దశాబ్ధాలుగా దేశ ఆర్థిక వ్యవస్థలోని ఎదుగుదల కూడా ఇందుకు కారణమని భావించవచ్చు. ముప్పై ఏళ్లుగా చైనా అలుపరుస్తున్న సింగిల్ చైల్డ్ పాలసీ వలన మహిళలు కుటుంబ బాధ్యతల నుంచి కాస్త విరామం పొంది వ్యాపారంలో రాణించి వారి కలల్ని నిజం చేసుకుంటున్నారు.
బామ్మలే.. బంగారు కొండలు
చైనా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేవారిలో నడివయస్కులైన మహిళలది ప్రత్యేక స్థానం. 2013లో కేవలం 10 రోజుల్లోనే 300 టన్నుల విలువైన బంగారం కొనుగోలు చేసి అంపశయ్యపై ఉన్న గోల్డ్ మార్కెట్‌కు ప్రాణం పోశారు. చైనాలో ఇంటి పెత్తనమంతా మహిళలదే. ముఖ్యంగా బామ్మలది. విలాసవంతమైన వస్తువులు, ట్రావెల్ ఏజెన్సీలు, బ్యూటీ సెలూన్ల కస్టమర్లలో బామ్మల సంఖ్యే అధికం. ఇవే కాకుండా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిదారులుగా, రియల్ ఎస్టేట్, బిట్‌కాయిన్ కొనుగోలుదారులుగా కూడా ఉన్నారు. చైనా ఎకానమీ ‘సీక్రెట్ వెపన్’గా వీరిని భావిస్తారు. దామాలుగా పిలువబడే మహిళా గ్రూపులు పార్కులు, బాస్కెట్‌బాల్ కోర్టులు, షాపింగ్ మాల్స్, టీవీ ప్రోగ్రామ్‌లలో తన నృత్యాలతో అలరించి ఆదాయం గడిస్తున్నారు. దామా గ్రూప్ జానపద నృత్యంతో పాటు ఫ్లామెంకో, రుంబా, టాప్ డాన్స్ వంటి అనేక నృత్యరీతులు ప్రదర్శించగలరు. ప్రాథమిక అంచనా ప్రకారం ఈ విధమైన నృత్యరీతుల ప్రదర్శన కోసం కొనుగోలు చేసే సౌండ్ బాక్పులు, వివిధ సామాగ్రి విలువ నెలకు 3.9 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇది ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment