
విమానం సాఫీగా పైకి లేవాలన్నా, సురక్షితంగా కిందికి దిగాలన్నా రన్‌వే బాగుండాలి. కొచ్చి, అంతర్జాతీయ విమానాశ్రయంలో.. మరమ్మతులు అవసరమైన స్థితిలో ఉన్న రన్‌వే పైనే గత నవంబర్ ముందు వరకు విమానాల రాకపోకలు జరుగుతుండేవి. రీ–కార్పెటింగ్‌కి (మరమ్మతులకు) నిపుణులైన ఇంజినీర్ల కోసం సి.ఐ.ఎ.ఎల్ (కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్) తన ఇంజినీరింగ్ విభాగంలోని సిబ్బందిలోంచి పెద్ద వడపోతనే పోయవలసి వచ్చింది. చివరికి ఎనిమిది మంది ఇంజినీర్లను, వాళ్లకు సహాయంగా 20 మంది అప్రెంటీస్‌లను ఎంపిక చేసుకుంది. విశేషం ఏంటంటే.. వాళ్లంతా కూడా మహిళలే!
విమానం టేకాఫ్‌కి, ల్యాండింగ్‌కీ ఎలాగైతే మంచి రన్‌వే ఉండాలో, రన్‌వే రీ–కార్పెటింగ్ పనిని పరుగులు తీయించే బృందం అవసరమని భావించిన సి.ఐ.ఎ.ఎల్. మహిళా ఇంజినీర్ల వైపే మొగ్గు చూపింది. సి.ఐ.ఎ.ఎల్. సివిల్ ఇంజినీరింగ్ విభాగం జనరల్ మేనేజర్ బినీ టి.ఐ., అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌లు టి.పి.ఉషాదేవి, మినీ జాకబ్, జూనియర్ మేనేజర్‌లు పూజా టి.ఎస్., త్రీసా వర్ఘీస్, సీనియర్ సూపరింటెండెంట్‌లు పి.పి.శ్రీకళ, ఇ.వి. జెస్సీ, జిన్సీ ఎం పాల్.. ఈ ఎనిమిది మంది పర్యవేణలో, వారికి సహాయంగా ఉన్న ఇరవై మంది ట్రెయినీ ఇంజనీర్‌లతో గత ఏడాది నవంబర్ 20 న ప్రారంభమైన రీ–కార్పెటింగ్ పనులు తొలి రోజు నుంచే వేగంగా జరుగుతున్నాయి! ముందు అనుకున్న ప్రకారం ఈ నెల 29 కి రన్‌వే సిద్ధం అవాలి. అయితే ఈ మహిళా ఇంజనీర్ల అంకితభావం, దీక్ష చూస్తుంటే ఆలోపే రన్‌వే మా చేతికి వచ్చేలా ఉందని సి.ఐ.ఎ.ఎల్. అధికారులు ప్రశంసాపూర్వకంగా అంటున్నారు.
‘మిక్స్’ ప్లాంట్‌కూ వెళతారు
రన్‌వే కార్పెటింగ్ రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతోంది. ఆ సమయంలో విమానాశ్రయాన్ని మూసి ఉంచుతున్నారు. 200 మంది పనివాళ్లు ఉంటారు. పనిని కాంట్రాక్టుకు తీసుకున్న సంస్థల వాహనాలు ఓ 50 వరకు వచ్చిపోతుంటాయి. 60 మీటర్ల వెడల్పు, 3,400 మీటర్ల పొడవున రీకార్పెటింగ్ పని జరుగుతూ ఉంటుంది. రన్‌వేపై దిగాక విమానాల కదలికలకు వీలు కల్పించే ఐదు ‘టాక్సీవే’ల పునఃనిర్మాణం కూడా ఏకకాలంలో అవుతోంది. వీటన్నిటికీ కావలసిన కంకర కోసం ఈ మహిళా ఇంజినీరింగ్ టీమ్ ఎప్పటికప్పుడు క్వారీలకు వెళ్లి నాణ్యతను పరీక్షిస్తోంది. తారును మిక్స్ చేసే ప్లాంట్‌కూ వెళుతుంది. మెటీరియల్ ఎంత వస్తున్నదీ, ఎంత మిగిలి ఉన్నదీ, అవసరానికి తగ్గట్టుగా కొనుగోలు చేసిన మెటీరియల్ పూర్తిగా వినియోగం అవుతున్నదీ లేనిదీ వీరు పరిశీలిస్తారు. అంటే పని మొత్తం పూర్తిగా వీరి కనుసన్నల్లోనే నడుస్తుంది. రోజుకు 1500 టన్నుల తారు–కంకర కలుపు (మిక్సింగ్) విమానాశ్రయానికి చేరుకుంటుంది. అయితే అది సమయానికి చేరడం ముఖ్యం. సాయంత్రం 6 తర్వాత వస్తే ఇక ఆ రోజు పనికి వీలు పడనట్లే్ల. అందుకే ప్రతిదీ ఒక పద్ధతితో, ప్రణాళిక ప్రకారం అయ్యేలా శ్రద్ధ తీసుకుంటున్నారు బినీ, ఆమె బృందం.
చిన్న తేడా రానివ్వరు
మిక్సింగ్ ప్లాంట్ పని రోజూ తెల్లవారుజామునే 3 గంటలకు మొదలౌతుంది. ఉదయం 10 కల్లా విమానాశ్రయానికి ‘మిక్స్’ను మోసుకొచ్చేస్తాయి బండ్లు. సాయంత్రం 6 గంటలకు తొలి విమానం దిగేలోపే ఆవేళ్టి పని పూర్తి చేసేస్తారు. రీకార్పెటింగ్ ఒకసారి అయిపోయే పని కాదు. మిక్స్‌ని రెండు పూతలుగా (లేయర్లు) వేస్తారు. మొదటి పూత ఏడు సెంటీమీటర్ల మందంలో, దాని పైన వేసే రెండో పూత ఐదు సెంటీమీటర్ల మందంలో ఉంటుంది. పాత లెక్కలకు, కొత్త లెక్కలకు తేడాలు వచ్చాయంటే విమానం ల్యాండింగ్ ప్రమాదంలో పడినట్లే. ఇంత సూక్ష్మంగా, జాగ్రత్తగా అన్నీ సరి పోల్చుకుంటూ రోజుకు 150 మీటర్లు చొప్పున రన్‌వే రీ–కార్పెటింగ్ చేయిస్తున్నారు ఈ మహిళా ఇంజినీర్‌లు. ముందు అనుకున్న ప్రకారం ఈ నెల 29 కి రన్‌వే సిద్ధం అవాలి. అయితే ఈ మహిళా ఇంజనీర్ల అంకితభావం, దీక్ష చూస్తుంటే ఆలోపే రన్‌వే మా చేతికి వచ్చేలా ఉందని సి.ఐ.ఎ.ఎల్. అధికారులు ప్రశంసాపూర్వకంగా అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment