కొబ్బరి పీచు భూవస్త్రం | coconut fiber landscape | Sakshi
Sakshi News home page

కొబ్బరి పీచు భూవస్త్రం

Published Tue, Jun 23 2020 5:53 AM | Last Updated on Tue, Jun 23 2020 5:53 AM

coconut fiber landscape - Sakshi

కేరళలో కొబ్బరి పీచు చాపలతో పటిష్టం చేసిన సాగు నీటి కాల్వ గట్లు; కొబ్బరి పీచుతో తయారైన ‘భూవస్త్రాలు’

మన ఆకలి తీర్చుతున్న ఆహారంలో 95% వరకు భూమాతే మనకు అందిస్తుంది. అందువల్ల భూమి పైపొర మట్టి మనకే కాదు జంతుజాలం మొత్తానికీ ప్రాణప్రదమైనది. భూమి పైమట్టి సారవంతమైనదే కాకుండా ఎంతో విలువైనది కూడా. కాబట్టి, మనకు మాదిరిగానే భూమికి కూడా ఆచ్ఛాదనగా వస్త్రం కప్పి పరిరక్షించుకోవాల్సిన ప్రాణావసరం మనది. మట్టి ఎండకు ఎండి నిర్జీవమైపోకుండా.. గాలికి, వర్షపు నీటి తాకిడికి కొట్టుకుపోకుండా రక్షించుకోవడానికి కొబ్బరి పీచుతో చేసిన చాపలు భేషుగ్గా పనిచేస్తున్నాయి.

ఈ కొబ్బరి చాపలనే కాయర్‌ బోర్డు ‘భూవస్త్రం’ అని పిలుస్తోంది. ఇరవయ్యేళ్లుగా కేరళ తదితర రాష్ట్రాల్లో పీచు పరిశ్రమదారులు ‘భూవస్త్రాల’ను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే, మన దేశంలో వాడకం తక్కువే. ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. కొబ్బరి పీచు భూవస్త్రాన్ని పంటలకు మల్చింగ్‌ షీట్‌గా, కాల్వలు, చెరువులు, నదుల గట్లకు రక్షణ కవచంగా కూడా వాడుకోవచ్చు. భూమిని కాపాడటమే కాకుండా ఐదారేళ్లలో భూమిలో కలిసిపోయి సారవంతం చేస్తుంది.

కూరగాయ పంటల్లో  ఆచ్ఛాదన
పంట పొలాల్లో, చెట్లు, మొక్కల పెంపకంలో భూమికి ఆచ్ఛాదన కల్పించడానికి మల్చింగ్‌ షీట్లుగా ప్లాస్టిక్‌కు బదులుగా కొబ్బరి పీచుతో తయారైన భూవస్త్రాలు చక్కగా పనికివస్తాయని కాయిర్‌ బోర్డు రాజమండ్రి విభాగం అధిపతిగా ఇటీవలే రిటైరైన మేడిగ రామచంద్రరావు ‘సాక్షి’తో చెప్పారు. ఈ షీట్‌ మొక్కల చుట్టూ పరిస్తే ఎండ, వానల నుంచి భూమిని కాపాడటమే కాకుండా కలుపు మొలవకుండా అడ్డుకుంటుందన్నారు. కలుపు మందుల పిచికారీ అవసరం లేదు. కలుపు తీత ఖర్చులు ఉండవు. నాగాలాండ్‌లో పైనాపిల్‌ పంటను విస్తారంగా సాగు చేసే రైతులు భూవస్త్రాలతో మల్చింగ్‌ చేస్తున్నారని ఆయన వివరించారు.

అరటి, వంగ, టమాటా, బెండ తదితర పంటలకు బాగా మల్చింగ్‌ బాగా ఉపయోగపడుతుందన్నారు. కొబ్బరి భూవస్త్రాలు 600 జి.ఎస్‌.ఎం.(గ్రామ్స్‌ పర్‌ స్క్వేర్‌ మీటర్‌) నుంచి 2,000 జి.ఎస్‌.ఎం. మందం వరకు దొరుకుతాయి. మల్చింగ్‌ షీట్‌గా 600 జి.ఎస్‌.ఎం.(సుమారు పావు అంగుళం) మందం ఉండే భూవస్త్రం సరిపోతుంది. ఇది భూమిపై పరిచిన ఐదారు సంవత్సరాలలో చీకి భూమిలో కలిసిపోతుందని రామచంద్రరావు (92477 98246) చెప్పారు.   

భూవస్త్రాల మన్నిక ఎంత?
కొబ్బరి పీచుతో తయారైన భూవస్త్రాలు పర్యావరణ హితమైనవి. వీటిని వినియోగించుకుంటే కాలువలు, చెరువులు, నదుల గట్లు, ఏటవాలు ప్రాంతాల్లో నుంచి గాలికి, వర్షానికి మట్టి కొట్టుకుపోకుండా జాగ్రత్తపడవచ్చు. రోడ్ల నిర్మాణంలోనూ ఉపయోగపడుతుంది. చెరువులు, సరస్సుల గట్లు, నదుల వరద కట్టల నవీకరణ పనుల్లో భూవస్త్రాలు చక్కగా పనికివస్తాయి. ఇంతకీ వీటి మన్నిక, పటుత్వం ఎంత? ఐదారేళ్ల వరకూ మన్నుతాయని నిపుణులు చెబుతున్నారు. ‘కొబ్బరి పీచు పటుత్వం చాలా ఎక్కువ. ఇందులో లిగ్నన్‌ ఎక్కువ మోతాదులో ఉండటమే ఇందుకు కారణం.

టేకు, ఇరుగుడు చావ కలపలో కన్నా కొబ్బరి పీచులోనే లిగ్నన్‌ ఎక్కువగా ఉందని కోయంబత్తూరులోని జాతీయ కాయిర్‌ పరిశోధన, యాజమాన్య సంస్థ (ఎన్‌.సి.ఆర్‌.ఎం.ఐ.) డైరెక్టర్‌ కె.ఆర్‌. అనిల్‌ అంటున్నారు. అంతేకాదు, నీటిని సంగ్రహించే సామర్థ్యం, అతినీల లోహిత(యు.వి.) కిరణాలను తట్టుకునే శక్తి కూడా ఎక్కువే, వేసిన తర్వాత ఐదారేళ్ల వరకు మన్నుతాయని అంటున్నారాయన.  

90% తేమ, 30 డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రతలో కూడా దీర్ఘకాలంపాటు భూవస్త్రం పటిష్టంగా నిలిచినట్లు ‘జెర్మన్‌ బున్‌దేసంత్‌ ఫర్‌ మెటీరియల్‌ టెస్టింగ్‌ ఆన్‌ నేచురల్‌ ఫైబర్స్‌’ తెలిపింది. పత్తి ఉత్పత్తుల కన్నా 15 రెట్లు, జనపనార ఉత్పత్తుల కన్నా 7 రెట్లు ఎక్కువ రెట్లు మన్నిక కొబ్బరి పీచు భూవస్త్రాలకు ఉందని తెలిపింది. వరద నీటిలో 4 వేల గంటలు మునిగి ఉన్న తర్వాత కూడా ఇవి చెక్కుచెదరలేదని సంస్థ తెలిపింది.

భూవస్త్రాల ధర ఎంత ఉంటుంది?
కొబ్బరి కాయ మన ఆహార, ఆధ్యాత్మిక సంస్కృతిలో పెద్ద పీట ఉంది. కొబ్బరి పంట నుంచి కొబ్బరి కాయ ప్రధాన ఉత్పత్తి. కాయను ఒలిస్తే వచ్చే డొక్కల నుంచి పీచును వేరు చేస్తారు. ఈ క్రమంలో పొట్టు వస్తుంది. కొబ్బరి పొట్టును స్వల్ప ప్రక్రియ ద్వారా సేంద్రియ ఎరువుగా తయారు చేస్తారు. ఈనెలతో చాపలను లేదా మాట్స్‌ను తయారు చేస్తారు. ఇవే భూవస్త్రాలు (కాయిర్‌ జియో టెక్స్‌టైల్స్‌). వీటిని మీటరు పన్నాతో సుమారు 50 మీటర్ల పొడవున తయారు చేస్తారు. భూవస్త్రాలు రెండు రకాలు.. చేనేత వస్త్రం మాదిరిగా కొన్ని దశల్లో నేసేవి (వోవన్‌), ఒక యంత్రంతో సులువుగా అల్లిక చేసేవి (నాన్‌ వోవన్‌). నాన్‌ వోవన్‌ భూవస్త్రాల ధర చదరపు మీటరుకు రూ. 50–60 ఉంటే, వోవన్‌ భూవస్త్రాల ధర నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటుంది.

భూవస్త్రాల ఉత్పత్తిలోకి తొలి ఎఫ్‌.పి.ఓ.
కోనసీమ కొబ్బరి రైతులతో ఏర్పాటైన కృషీవల కోకోనట్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ(ఎఫ్‌.పి.ఓ.) త్వరలో భూవస్త్రాలు సహా వివిధ కొబ్బరి ఉప ఉత్పత్తుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నది. విశేషమేమిటంటే దేశంలోనే ఈ పని చేయబోతున్న తొలి ఎఫ్‌.పి.ఓ. ఇది. తూ.గో. జిల్లా అయినవోలు మండలం నేదునూరులో ఈ యూనిట్‌ ఏర్పాటవుతోంది. ప్రాజెక్టు విలువ రూ. 341.38 లక్షలు. కేంద్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ రూ. 313.94 లక్షలు గ్రాంటుగా ఇస్తోంది. రైతుల వాటా రూ. 27.44 లక్షలు.

రోడ్ల మన్నిక పెరుగుతుంది
కొబ్బరి పీచు భూవస్త్రాలను మట్టి, తారు రోడ్ల నిర్మాణంలో వినియోగిస్తున్నారు. గ్రావెల్, ఎర్రమట్టికి అడుగున భూవస్త్రాలను పరుస్తారు. భూవస్త్రం వాడటం వల్ల రోడ్ల మన్నిక 20–40% పెరిగినట్లు రుజువైందని కాయిర్‌ బోర్డు మాజీ అధికారి రామచంద్రరావు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పంచాయతీ రోడ్ల నిర్మాణంలో ఇప్పటికే వాడుతున్నట్లు చెప్పారు. ప.గో. జిల్లాలో చించినాడ బ్రిడ్జి అప్రోచ్‌రోడ్డు నిర్మాణంలో వాడామని, 20 ఏళ్లయినా చెక్కుచెదరలేదన్నారు.  

కొబ్బరి పీచు భూవస్త్రాలను ప్రధాన మంత్రి గ్రామీణ్‌ సడక్‌ యోజన–3 కింద గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే రోడ్లలో ఉపయోగించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ఏపీలో 164 కి.మీ., తెలంగాణలో 121 కి.మీ. మేరకు రోడ్ల నిర్మాణంలో భూవస్త్రాలను వాడేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి కూడా. ఇవి మంచి శోషణ శక్తిని కలిగి ఉంటాయని, బలంగా, చల్లగా ఉండి ఎక్కువ కాలం మన్నుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

కృష్ణా, గోదావరి డెల్టాలో కాలువ గట్లు జారిపోతూ ఉంటే ఏటా బాగు చేస్తూ ఉంటారు. ఈ గట్లను భూవస్త్రాలతో కప్పి, వాటిపై మొక్కలను పెంచితే గట్లు బాగా గట్టిపడతాయి. ఐదారేళ్ల వరకు చెక్కుచెదరవు. రైలు పట్టాలకు ఇరువైపులా మట్టికట్టలను కూడా ఇలాగే పటిష్టం చేసుకోవచ్చని రామచంద్రరావు సూచిస్తున్నారు.

భూవస్త్రం పరచి, ఆ పైన రోడ్డు వేస్తున్న దృశ్యం
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement