తనయుని తలపులు
నాన్నా.. కిరణ్. నీ దివ్యాత్మకు అమ్మ నివాళి. అశ్రుతర్పణ నివాళి. సజీవమై మాలో మిగిలిన నీ స్మృతుల నివాళి. నిండైన సుఖ‘శాంతి’లతో, ‘ఐక్య’ చిన్నారి అలరింపులతో నాడు కళకళలాడిన మన ఇంట్లో... నేడు నువ్వు లేక, వెలుగు రాక అంధకారం అలుముకుంది. నలుదిక్కులా శూన్యమే. నిత్యం బాధా వేదనలే. కుదిపి వేసే ఈ క్షోభ ఎలా తరుగుతుంది? ఆధ్యాత్మిక భావనలే ఆశ్రయమని తెలిసినా, వాటిని అందుకునే శక్తి నాకు ఉంటుందా? శక్తి కరిగిపోతోంది. శరీరం సహకరించడం లేదు. తనయుని తలపులు మాత్రమే ఇప్పుడీ హృదయాన్ని సాంత్వన పరుస్తున్నాయి. బాబూ... నువ్వు నా కన్నీరుగా మారి, గుండెలోని కార్చిచ్చును చల్లారుస్తుంటే అనిపిస్తోంది.. ఈ వృద్ధాప్యంలో కన్నీరే నాకు రక్షణ కవచమా అని!
విఖ్యాత పిల్లల వైద్యుడు బర్టన్ గ్రెటిన్ మాటలు నాకు గుర్తొస్తున్నాయి. ‘‘ఒక బిడ్డను చేజార్చుకోవడం అంటే నీలో కొంత భాగాన్ని చేజార్చుకొన్నట్లే’’ అంటారు ఆయన. బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులం.. మా శరీరంలో కొంత భాగాన్ని కోల్పోయి, ఆ వైకల్యంతోనే జీవితాన్ని భారంగా, మానసికమైన క్రుంగుబాటుతో గడుపుతూ, బాధ్యతల నిర్వహణలతో మమ్మల్ని మేము మరచి బతుకుతుంటాం కానీ... నాన్నా కిరణ్, నీ స్మృతులను మరచిపోలేం.
- పి.లీలాచంద్రారెడ్డి
(పి.ఆర్.కిరణ్‌కుమార్ రెడ్డి తల్లి)
పి.ఆర్. కిరణ్‌కుమార్‌రెడ్డి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేశారు. విజ్ఞప్తులతో నిత్యం క్యాంప్ ఆఫీస్‌కు వస్తుండే నిరుపేద ప్రజానీకానికీ, ముఖ్యమంత్రి వై.ఎస్.కు మధ్య ఆయన చక్కటి అనుసంధానకర్తగా ఉన్నారు. వై.ఎస్.ఆర్. ఆలోచనలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ‘ఆరోగ్యశ్రీ’ పథకం పటిష్టంగా అమలు కావడానికి శక్తి వంచన లేకుండా ఆయన సేవలు అందించారు. నేడు ఆయన ద్వితీయ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన తల్లి తన కుమారుడికి ఘటించిన నివాళే... ఈ ‘తనయుని తలపులు’.