కోలాటం కలెక్షన్
నవరాత్రి రోజుల్లో ప్రతీ యేటా దాండియాకు ఒకే విధమైన డ్రెస్ ధరించాలంటే బోర్‌గా ఉంటుంది. అలాగని సందర్భానికి తగినట్టుగా ఉండకపోతే నలుగురిలో తేలిపోయినట్టుగా ఉంటుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఒక ఫ్రెష్ ట్విస్ట్‌ను మీ డ్రెస్‌లకు ఇవ్వాలి. సంప్రదాయ ఫ్యాబ్రిక్స్ ఎన్నో అందుబాటులో ఉన్న నేటి రోజుల్లో అద్దాలు కుట్టినవి ఔటాఫ్ స్టైల్ అనిపిస్తే కొద్దిపాటి మార్పులతోనే మీ డ్రెస్సింగ్ స్టైల్‌ను ఆకర్షణీయంగా రూపుకట్టవచ్చు. నవరాత్రి వేడుకలలో కోలాటానికి కొత్త కళ తీసుకురావచ్చు.
పుల్కారి వర్క్
రంగులతో చూపరులను ఇట్టే అట్రాక్ట్ చేస్తుంది పుల్కారి వర్క్. ఇది పంజాబీ ఎంబ్రాయిడరీ. ఇండో-వెస్ట్రన్ దుస్తులకు సరిగ్గా సరిపోయే వర్క్. కుర్తీలకు, చోళీలకు, ప్లెయిన్ లెహంగాలకు, స్ట్రెయిట్ ప్యాంట్స్‌కు.. ఈ వర్క్ బాగా నప్పుతుంది. ఈ వర్క్ దుపట్టా , లెహంగా అంచులుగా డిజైన్ చేయించుకున్నా మీ చుట్టూ ఉన్నవారి లుక్స్ మీ వైపు తిరగకుండా ఉండవు.
కట్‌వర్క్
లాంగ్, షార్ట్ జాకెట్స్‌ను కట్‌వర్క్‌తో మెరిపిస్తే వేడుకలలో హైలైట్ కాకండా ఉండరు. కుర్తా లేదా అనార్కలీ జాకెట్ కట్‌వర్క్ ఉన్నది ఎంచుకుంటే సింపుల్‌గా అనిపించడమే కాదు విభిన్నంగా అట్రాక్ట్ చేస్తుంది. ఇది సరైన ఎంపిక కూడా అవుతుంది. షిమ్మర్ ఫ్యాబ్రిక్‌ని కట్‌వర్క్‌కు ఎంచుకుంటే మరింత ఆకర్షణీయంగా కనపడతారు.
గోటాపట్టి
ఈ వర్క్ హెవీగా ఉన్నప్పటికీ లైట్‌వెయిట్‌గా చూడటానికి రిచ్‌గా ఉంటుంది. పెద్ద పెద్ద అంచులను లెహంగాలకు, అనార్కలీ కుర్తాలను వాడితే పండగ కళ వచ్చేసినట్టే. నిలువు, అడ్డం పట్టీలుగా ఫ్లోర్ లెంగ్త్ స్కర్ట్‌లకు గోటాపట్టిని వాడి చూడండి.
- ఎన్.ఆర్.