రంగుల ప్రయాణం | Colorful journey | Sakshi
Sakshi News home page

రంగుల ప్రయాణం

Published Thu, Mar 13 2014 10:17 PM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM

రంగుల ప్రయాణం

రంగుల ప్రయాణం

పచ్చని తరువులే కాదు మోడువారిన చెట్లు సైతం
 రంగు పువ్వులను తొడుక్కునే మాసం ఇది.
 ప్రకృతిలోని రంగులన్నీ జీవితం నిండా విరబూయాలని కోరుకునేవారి ఆకాంక్షలకు నాంది ఇది.
 ఉత్తరం నుంచి దక్షిణం వరకు...
 పశ్చిమం నుంచి తూర్పు వరకు భరతఖండమంతా భాసిల్లే రంగుల కేళి హోలీ మన సంస్కృతిలో ఓ భాగం.
 మన శ్వాసలో ఓ ఉల్లాసమైన రాగం.

 
రంగుల పొడులు, గులాల్ నింపిన నీరు.. ఒకరి మీద ఒకరు హుషారుగా చల్లుకుంటూ ఆనందనృత్యం చేసే పండుగ హోలీ! ప్రతి ఒక్కరూ మరొకరిపై మొదటగా రంగు చల్లాలని ఉత్సాహపడుతుంటారు. వారు చల్లేది రంగు కాదు... తమలోని ప్రేమను. ‘హోలీ హోలీల రంగ హోలీ చమ్మకేళిల హోలీ...’ అంటూ ఆడి, పాడే ఈ వినోదాత్మక క్రీడలో శత్రువులు సైతం మిత్రులుగా మారి నవ్వుల జల్లులు రువ్వుకుంటారు. అందుకే ఈ వేడుకను పిల్లా, పెద్దా అంతగా ఇష్టపడతారు. ఎద నిండుగా ప్రేమను నింపి ఆనందంగా జీవించమని ఆశీర్వదించే వేడుకకు మన దేశం వేదిక. హోలీ మన ఇంటి సంబరం.
 
దక్షిణాన దీవెన

హోలీ రోజు దేశమంతటా రాధాకృష్ణుల దేవాలయాలను సుందరంగా తీర్చిదిద్ది, సమూహాలుగా చేరి, నృత్యగానాలతో ఆనందిస్తారు. అయితే ఉత్తరభారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో అంత వేడుకగా ఈ పండగను జరుపుకోరు. మనరాష్ట్రంలో హైదరాబాద్, కొన్ని ప్రాంతాలలో మినహా మిగతా చోట్ల చిన్న స్థాయిలోనే హోలీని జరుపుకుంటారు. పున్నమి రాత్రి కాముని దహనం పేరిట పెద్ద మంట వేసి, ఆ బూడిద పశువుల కొట్టాల్లో చల్లుకుంటారు. మరుసటి రోజు మోదుగ పువ్వులను ఉడకబెట్టగా వచ్చిన రంగు నీళ్లను, గులాల్ రంగును ఒకరి మీద ఒకరు చల్లుకుంటారు. కొన్ని చోట్ల పెద్దల పాదాలమీద గులాల్ చల్లి, వారి దీవెనలు తీసుకుంటారు.
 
ఉత్తరాన ఉత్సవం
 
రాధ పుట్టిన ప్రాంతంగా ఉత్తరప్రదేశ్‌లోని బర్సానా ఊరికి పేరు. ఈ ఊరు మథుర పట్టణానికి 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ప్రతి పురుషుడూ కృష్ణుడిగా, ప్రతి స్త్రీ రాధగా భావించుకుంటారు. హోలీ రోజున స్త్రీలు పురుషులను కర్రలతో వెంబడిస్తారు. పురుషులు తమ వద్ద ఉన్న డాలుతో కర్రలను అడ్డుకుంటారు. పురుషులు రెచ్చగొట్టే పాటలు పాడుతూ స్త్రీలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ హోలీ చాలా సరదాగా ఉంటుంది. కృష్ణుడి జన్మస్థలం అయిన మథురలో, బృందావన్‌లో హోలీ రోజు ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఫాల్గునమాసం చివరి రోజున వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ వేడుకను సంవత్సర ముగింపుగా కూడా భావిస్తారు. పూర్ణిమకు ముందు ప్రజలందరి సమక్షంలో పురోహితుడు మంటను వెలిగించి, శుభాకాంక్షలు తెలుపుతాడు. తరువాత రోజు ఈ పండగను అంతా కలిసి రంగులతో ఉల్లాసంగా జరుపుకుంటారు.
 
తూర్పు-పడమరలను కలిపిన రంగులు
 
బెంగాల్‌లో ‘బసంత్ ఉత్సవ్’ పేరిట వసంతకాలాన్ని ఆహ్వానిస్తూ అమ్మాయిలు, అబ్బాయిలు ఈ వేడుకను జరుపుకుంటారు. అయితే వీరు రంగులు చల్లుకోరు. పాటలు, నృత్యాలు, శ్లోక పఠనం.. అంతా శాంతినికేతన్ పద్ధతుల్లో సాగుతుంది. పౌర్ణమి రోజు ఉదయాన్నే అమ్మాయిలు కుంకుమపువ్వు రంగు దుస్తులను, సువాసనలు వెదజల్లే పువ్వుల దండలను ధరించి సంగీత వాద్యాలను మీటుతూ, పాటలు పాడతారు.

వీళ్లు హోలీని ‘డోల్ జాత్రా, డోలా పూర్ణిమ’గా ఊయలోత్సవంగా జరుపుకుంటారు. ముఖ్యమైన వీధులలో రాధాకృష్ణుల ప్రతిమలను అలంకరించి పల్లకిలో ఊరేగిస్తారు. కుటుంబ పెద్దలు కృష్ణుడిని, అగ్నిదేవుడిని ప్రార్థిస్తారు. ఒరిస్సాలో హోలీ సందర్భంగా జగన్నాథుడి విగ్రహాలను పూజిస్తారు. పంజాబ్‌లో సిక్కులు హోలీని ‘హోలా మోహల్లా’ అంటారు. మనదేశంలో పంజాబ్‌లో జరిగే ఆనంద్‌పూర్‌సాహిబ్  ఉత్సవం చాలా పేరు గడించింది. విదేశాల నుంచి కూడా ప్రజలు పంజాబ్‌కు వచ్చి ఇక్కడ హోలీ పండుగలో పాల్గొంటారు. వీధులలో భోగి మంటలు వేసి, చుట్టూ చేరి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తారు.

అహ్మదాబాద్‌లో ఒక కుండలో నీళ్ల పెరుగును వేసి, వీధిలో వేలాడదీస్తారు. యువకులు ఆ కుండను పగులకొట్టడానికి పోటీపడుతుంటే అమ్మాయిలు వారిపై నీళ్లు విసురుతారు. చివరకు ఏ యువకుడైతే ఆ కుండను పగులకొడతాడో అతడికి ‘హోలీ రాజు’ గా కిరీటాన్ని అలంకరిస్తారు. మహారాష్ట్రలో ఫాల్గున పౌర్ణమికి వారం ముందు మంటకు కావల్సిన చెక్కను సేకరిస్తారు. సాయంత్రం మంటలను వెలిగించి, తినుబండారాలను, భోజనాన్ని అగ్నికి అర్పిస్తారు. ఈ సమయంలో ‘హోలీరే హోలీ పురాణచి పోలీ’ అని పాడతారు. పంచమి రోజున రంగులతో ఆడుకుంటారు.
 
వెన్నెల రాత్రులలో వసంతం
 
మణిపూర్‌లో ఆరు రోజులు హోలీ పండగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. పౌర్ణమి రోజు రాత్రి డోలు వాయిస్తూ జానపద పాటలు, నృత్యాలతో అలరిస్తారు. వెన్నెల రాత్రుల్లో ప్రజలు విందులలో పాల్గొంటారు. భోగిమంటలకు ఎండుగడ్డిని ఉపయోగిస్తారు. తెలుపు, పసుపు తలపాగాలను ధరించి గులాల్ ఆడుతూ నృత్యం చేస్తారు. చివరి రోజు గుడి ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దక్షిణ కొచ్చిలోనూ, కాశ్మీర్‌లోనూ ఎండాకాలానికి ప్రారంభంగా, పంటలు కోయడానికి సూచనగా ఈ పండగను జరుపుకుంటారు. రంగునీళ్లను విసురుకుంటూ పాటలు పాడుకుంటూ, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడుపుతారు.

ఏ దేశమేగినా!
 
నేపాల్‌లో హోలీ పండగ రోజును జాతీయ సెలవుదినంగా ప్రకటిస్తుంది అక్కడి ప్రభుత్వం. ప్రవాస భారతీయులు ఉంటున్న ఉత్తర అమెరికా, ఆఫ్రికా, యూరప్, ఆసియా దేశాలలోనూ హోలీని వేడుకగా జరుపుకుంటారు.
 పురాణేతిహాసాలలో ప్రఖ్యాతిగాంచిన హోలికా దహనం, రాధాకృష్ణుల వసంతకేళీ కథనాలు దేశమంతటా వ్యాప్తి చెందాయి. గడప గడపకూ చేరి మన సంస్కృతిలో భాగమయ్యాయి. ఈ వేడుకలోని ఆంతర్యాన్ని తెలుసుకోవడానికి విదేశీయులు మన దేశానికి వరస కడుతున్నారు. ఫొటోలలో భద్రపరుచుకుంటున్నారు. చిత్రాలుగా రూపుకడుతున్నారు. తమ తమ దేశాల్లో హోలీ రోజున రంగుల పువ్వులను పూయించుకోవడానికి ఉత్సాహపడుతున్నారు. ఎక్కడైనా చెడు పై మంచి సాధించిన విజయానికి సూచికగా జరుపుకునే ఈ పండగ భారతీయ ఆత్మకు అచ్చమైన ప్రతీక.
 
 గిరిజనుల కోలాహలం...

రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ఉన్న గిరిపుత్రుల హోలీ పండగ ప్రత్యేకంగానూ, ఆసక్తికరంగానూ ఉంటుంది. మామిడిపూత, గింజధాన్యాల రాకతో కొత్త జీవితానికి గుర్తులుగా భావిస్తారు వీరు. అగ్ని చుట్టూ చేరి, బిగ్గరగా ఏడుస్తారు. ఆ విధంగా చెడు తమ నుంచి దూరం అవుతుందని భావిస్తారు. ఈ వేడుకలో భాగంగా యథేచ్ఛగా యువతీయువకుల లైంగిక సంబంధాలకు అనుమతిస్తారు. హోలీ పండగ తమ జీవితంలో అత్యంత గొప్ప ఆనందాన్ని నింపుంతుందని భావిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement