జావసత్త్వాలు | combine the favorite droplets | Sakshi
Sakshi News home page

జావసత్త్వాలు

Published Sat, May 12 2018 12:19 AM | Last Updated on Sat, May 12 2018 12:24 AM

combine the favorite droplets  - Sakshi

జావలను ఇక్కడ ఇచ్చిన పదార్థాలతోనే కాదు... జొన్నలు, కొర్రలు, సజ్జలు వంటి రకరకాల చిరుధాన్యాలతోనూ తయారుచేసుకోవచ్చు. ఇష్టాన్ని బట్టి పాలు, బెల్లం కలిపి తియ్యగాను, మజ్జిగ ఉప్పు కలిపి ఉప్పగానూ తీసుకోవచ్చు. చిన్న పిల్లలకు రుచిగా ఉండటం కోసం వెనిలా, స్ట్రాబెర్రీ, చాకొలేట్‌ వంటి ఎసెన్స్‌ జత చేసి  అందించవచ్చు. ఎవరికి నచ్చిన డ్రైఫ్రూట్స్‌ను వారు జావలో జత చేసుకుని తాగవచ్చు. మీ సృజనకు పదునుపెట్టండి.

జావ అనగానే జావగారిపోవలసిన అవసరం లేదు. జావలో జీవం ఉంది.జవం... అంటే వయసుకు శక్తినిచ్చే ధాతువు ఉంది. ఎండలలో శరీరానికి గొడుగు పట్టాలంటే జావ తాగాలి.రాగి, సగ్గుబియ్యం, బార్లీ, గోధుమరవ్వ...వీటితో జావ కాచండి, మాట వినకుండా ఆటలలోకి పరుగెత్తే పిల్లలకు ఇవ్వండి.వారిని అదుపుచేయలేక నీరసపడే మీరు కూడా కాస్త పుచ్చుకోండి.ఈ సెలవులు శక్తితో నిండుతాయి. సరదాగా గడుస్తాయి.

రాగి జావ(తియ్యగా)
కావలసినవి:రాగి పిండి – 4 టేబుల్‌ స్పూన్లు; పంచదార లేదా బెల్లం పొడి – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; పాలు – ఒకటిన్నర కప్పులు; నెయ్యి – నాలుగు చుక్కలు; ఏలకుల పొడి – చిటికెడు; డ్రై ఫ్రూట్స్‌ – కొద్దిగా
తయారీ:∙ఒక పాత్రలో, పాలు, నీళ్లు, రాగి పిండి వేసి ఉండలు లేకుండా బాగా కలిపి స్టౌ మీద ఉంచి ఉడికించి, దింపేయాలి ∙పంచదార లేదా »ñ ల్లం పొడి వేసి బాగా కలపాలి ∙నేతిలో డ్రైఫ్రూట్స్‌ వేయించి జావలో వేసి అందించాలి.

గోధుమ రవ్వ జావ
కావలసినవి: గోధుమ రవ్వ – అర కప్పు; ఉప్పు – తగినంత; మిరియాల పొడి, కొత్తిమీర – కొద్దికొద్దిగా; తరిగిన అల్లం – అర టీ స్పూను
తయారీ:∙ముందుగా రవ్వను బాణలిలో పొడిగా వేయించుకోవాలి 
∙రెండు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి.
∙రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి జతచేసి కలిపి దింపేయాలి. 
∙చివరగా అల్లం తరుగు, కొత్తిమీర జత చేసి అందించాలి. 
∙ఇష్టపడేవారు ఇందులో మజ్జిగ జత చేసుకుని తాగవచ్చు.

సగ్గు బియ్యం జావ (తియ్యగా)
కావలసినవి:సగ్గు బియ్యం – అర కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; పాలు – 3 కప్పులు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; కిస్‌మిస్‌ – ఒక టేబుల్‌ స్పూను; జీడి పప్పులు – ఒక టేబుల్‌ స్పూను; నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను

తయారీ:∙సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడిగి సుమారు గంటసేపు నానబెట్టాక, కుకర్‌లో ఉంచి ఉడికించి, ఒక పాత్రలోకి తీసుకోవాలి.
∙పాలు జత చేసి బాగా ఉడికేవరకు కలుపుతుండాలి.
∙బాగా చిక్కగా అయిన తరవాత బెల్లం పొడి లేదా పంచదార జత చేసి మరోమారు కలపాలి.
∙ఏలకుల పొడి జత చేసి బాగా కలిపి దించేయాలి.  
స్టౌ మీద బాణలిలో నెయ్యి వేడయ్యాక డ్రైఫ్రూట్స్‌ వేసి వేయించి తీసేసి, జావలో కలపాలి.

బార్లీ జావ
కావలసినవి: బార్లీ – ఒక కప్పు; నీళ్లు – ఐదు కప్పులు; నిమ్మ రసం – ఒక టీ స్పూను; తేనె – ఒక టేబుల్‌ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 2; దాల్చిన చెక్క పొడి – చిటికెడు; అల్లం ముక్క – చిన్నది

తయారీ: బార్లీని శుభ్రంగా కడిగి ఐదు కప్పుల నీళ్లు, వెల్లుల్లి రెబ్బ, దాల్చిన చెక్కపొడి జత చేసి, సన్నని మంట మీద సుమారు అరగంట సేపు మూడు వంతులు అయ్యేవరకు మరిగించి, దింపి చల్లారాక వడబోయాలి∙జావను ఫ్రిజ్‌లో ఉంచి కొద్దిగా చల్లగా తాగవచ్చు లేదా మామూలుగానే చల్లారిన తరవాత నిమ్మరసం, తేనె జత చేసి తీసుకోవచ్చు.

రాగి జావ (ఉప్పగా)
కావలసినవి:
రాగి పిండి – 4 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – తగినంత; నీళ్లు – ఒక కప్పు; మజ్జిగ – తగినంత; నెయ్యి – నాలుగు చుక్కలు; జీలకర్ర – చిటికెడు; కరివేపాకు – ఒక రెమ్మ; కొత్తిమీర – కొద్దిగా; పచ్చి మిర్చి – 1 (చిన్న చిన్న ముక్కలుగా తరగాలి)
తయారీ:ఒక పాత్రలో నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙ఒక గ్లాసులో కొద్దిగా నీళ్లు పోసి రాగి పిండి వేసి ఉండలు లేకుండా కలిపి, మరుగుతున్న నీళ్లలో పోసి ఉడికించి దింపేయాలి ∙చల్లారాక ఉప్పు, మజ్జిగ జత చేయాలి ∙స్టౌ మీద బాణలి వేడయ్యాక నెయ్యి వేసి కాగాక, కరివేపాకు, జీలకర్ర వేసి వేయించి, తయారుచేసి ఉంచుకున్న జావలో వేసి కలపాలి ∙చివరగా కొత్తిమీర జత చేసి బాగా కలిపి అందించాలి.

సగ్గు బియ్యం జావ (ఉప్పగా)
కావలసినవి: సగ్గు బియ్యం – ఒక కప్పు; ఉప్పు – తగినంత; నిమ్మరసం – టీ స్పూను; మజ్జిగ – రెండు కప్పులు; పుదీనా ఆకులు – కొద్దిగా; నీళ్లు – మూడు కప్పులు
తయారీ:సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి సుమారు గంటసేపు నానబెట్టాక, తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి.బాగా చల్లారాక మజ్జిగ, ఉప్పు, నిమ్మరసం జత చేసి మరోమారు కలిపి, పుదీనా ఆకులు వేసి అందించాలి.

దూరంగా ఉండాలి
పదార్థాలను నూనెలో డీప్‌ఫ్రై చేసి చాలామంది తింటుంటారు. రెస్టారెంట్లలోను, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లలోను ఈ ఫ్రైలను విరివిగా తయారుచేస్తారు. నూనెలో వేయించిన పదార్థాలకు రుచి ఎక్కువ. కాని ఇలా తయారయిన వాటిలో క్యాలరీలు, కొవ్వు అధికంగా ఉంటాయి. అందువల్ల రకరకాల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్, ఒబేసిటీ వంటి వ్యాధులు రావడానికి ఆస్కారం మెండుగానే ఉంటుంది. టైప్‌– 2 డయాబెటిస్‌ వచ్చే అవకాశం అధికమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వేయించిన పదార్థాలు తప్పనిసరిగా తినాలకునునేవారు... కొబ్బరినూనె, ఆలివ్‌ ఆయిల్, అవొకాడో నూనె వాడుకోవడం కొంతవరకు పరవాలేదు. అవెన్‌లో వేయించుకోవడం మరో మార్గం. అప్పడాల వంటివి నేరుగా అవెన్‌లో నూనె లేకుండా వేయించుకోవచ్చు. అలాగే ఎయిర్‌ ఫ్రయింగ్‌లో వేయించినా కూడా కొంతవరకు నష్టం తగ్గుతుంది. ఆవిరి మీద ఉడికించిన పదార్థాలు మన ఆరోగ్యాన్ని కాపాడతాయనే విషయాన్ని మరచిపోకూడదు.

ఆరోగ్యాన్ని ప్రసాదించే జావలు
మనకి ప్రధాన ఆహారధాన్యాలు ‘వరి, గోధుమ, బార్లీ, కొర్రలు, రాగులు, జొన్నలు’ మొదలైనవి. ఇవి వండేటప్పుడు నీటిని అధికంగా చేర్చి పల్చగా ఉండేలా ఉడికించి, వాటిని మనం ‘జావలు’ అంటాం. ఇలాంటి జావలను రకరకాల పేర్లతో ఆయుర్వేదం అభివర్ణించింది. అసలు ద్రవ్యానికి  ఎన్ని రెట్లు నీళ్లు కలిపితే ఎంత పలచగా ఉంటుందీ లేక ఎంత చిక్కగా అవుతుంది అన్న అంశాలను చాలా లోతుగా విశదీకరించింది ఆయుర్వేదం. ఆ పలుచని లేక చిక్కదనాన్ని బట్టి కొన్ని సాంకేతిక పదాలను సూచించింది. ఉదాహరణకు అతి పల్చగా ఉంటే ‘పేయం’ కొంచెం చిక్కగా ఉంటే ‘మండము’ అని స్పష్టీకరించింది. ఇలాంటివే అనేక సాంకేతిక పదాలు ఉన్నాయి. 

ఈ జావలని ప్రధాన ఆహారధాన్యాలతోనే కాకుండా, కొన్ని పప్పుల (పెసర, మినప) తో కూడా చేసుకోవచ్చు.  పాలను ఉపయోగించి చేస్తే, ‘క్షీర కృతములు’ అని, మాంసరసంతో చేస్తే ‘మాంసకృతములు’ అని స్పష్టం చేసింది. కొన్ని శాకాలతో (ముల్లంగి, చిక్కుడు, సొరకాయ, గాజర) కూడా చేసుకోవచ్చు.  కొన్ని సందర్భాలలో కొన్ని వ్యాధులలో పథ్యంగా కొన్ని ఔషధ ద్రవ్యాల్ని కూడా కలుపుకోవచ్చని ఆయుర్వేదం చెప్పింది. (శొంఠి, పిప్పలి, మిరియాలు, తిప్పతీVð....వంటివి) దానిమ్మ వంటి ఫలాలతో చేసిన జావలని ‘జల’ అని చెబుతారు. కొన్ని ఆకుకూరలు, పేలాలతో కూడా జావలు తయారుచేసుకోవచ్చు.

ప్రయోజనాలు
తేలికగా జీర్ణమై, అజీర్ణాన్ని పోగొట్టి, నాలుకకు రుచిని కలిగించి, జఠరాగ్నిని ఉత్తేజ పరుస్తుంది. తద్వారా తిన్న ఆహారం పచనానంతరం రక్తంలో చేరి ధాతుపుష్టి కలుగుతుంది. పొట్టలోని వాయువుని (ఆధ్మానం) హరిస్తుంది.  పేలాలతో చేసిన జావ దప్పిక, ఎక్కిళ్లను తగ్గిస్తుంది. శొంఠి కలిపిన జావ తాగితే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.క్షీరము (పాలు), శర్కర (పంచదార) కలిపిన వాటిని పాయసం అని సూచించి, ఇది శక్తివర్థకమని స్పష్టం చేసింది ఆయుర్వేదం. జీర్ణశక్తి బాగా ఉన్నప్పుడు మాత్రమే పాయసం సేవించాలి. ఫలాలతో చేసిన జావ తేలికగా జీర్ణమై, బలాన్ని కలిగిస్తుంది. పెసలతో చేసిన జావ గొంతుకను శుద్ధి చేస్తుంది. కంటిచూపుకు మంచిది.మినుములతో చేసిన జావ కృశత్వాన్ని హరిస్తుంది. ఈ విషయాలకు సంబంధించి కాశ్యప సంహిత ఇలా చెబుతోంది –    రోచనోదీపనో వృష్యః స్వరవర్ణ బలాగ్నికృత్‌ప్రస్వేద జననో ముఖ్యః తుష్టి పుష్టి సుసావః
 – డాక్టర్‌ వృద్ధుల లక్ష్మీ నరసింహ శాస్త్రి
ఆయుర్వేద వైద్య నిపుణులు 

మీ వంటలకు ఆహ్వానం
మీరూ గొప్ప చెఫ్‌ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకు లకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారుచేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జత చేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్‌... ఎవరైనా వంట చేసి లొట్టలేయించవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్‌కమ్‌.mail : familyvantakalu@gmail.com లేదా పోస్టు ద్వారా పంపండి. మా చిరునామా సాక్షి వంటలు,  సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హెదరాబాద్‌–34.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement