కోటి అందాల కోణార్క్
ఒడిషా రాష్ట్ర పర్యాటక శాఖ దేశంలో అన్ని రాష్ట్రాలలోనూ రోడ్ షోలను నిర్వహిస్తుంది. అందులో భాగంగా తెలుగువారికి ఒడిషా గొప్పదనాన్ని తెలియజేస్తూ ఇటీవల హైదరాబాద్‌లో రోడ్ షో కార్యక్రమం నిర్వహించింది. మహోన్నతమైన పర్యాటక ప్రదేశాలు కలిగిన ఒడిషాను బంగారు త్రికోణాకృతితో పోలుస్తుంటారు. వీటిలో భువనేశ్వర్, పూరీ, కోణార్క్‌లు ప్రధానమైనవి. ప్రపంచంలో సూర్యదేవాలయాలకు ఆంధ్రప్రదేశ్‌లోని అరసవిల్లి, ఒరిస్సాలోని కోణార్క్ మందిరాలు అత్యంత పేరుగాంచాయి. సూర్యమాసంగా పిలిచే మాఘమాసంలో ప్రతి యేటా కోణార్క్ ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ఈ సందర్భంగా అక్కడి రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ ఉత్సవాలను నిర్వహిస్తాయి. కోణార్క్ పూరీకి సరిగ్గా 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సూర్య రథాన్ని పోలినట్టు నిర్మించిన ఈ ఆలయం 12 చక్రాలతో 7 గుర్రాలతో శిల్పచాతుర్య పటిమతో నిర్మించారు. కోణార్క్ సముద్ర తీరంలో నిర్మించిన ఈ ఆలయం సూర్యగమనానికి అనుగుణంగా నిర్మించినట్టు తెలుస్తోంది. రథానికి అమర్చిన 12 చక్రాలు 12 నెలలు, 12 రాశులకు చిహ్నం. అలాగే సూర్య గమనం ఒక్కొక్క చక్రంలో ద్యోతకమవుతుంటుంది.
కళల కాణాచి...
అతి పురాతనమైన గిరిజన తెగలు బొండా, కోయ, పదజ, సంతాల్ వంటి వాటికి నిలయమైన ఒడిషా సందర్శకులు వీక్షించడానికి ఎన్నో అద్భుతాలను అందిస్తుంది. పచ్చదనం పరుచుకున్న తూర్పు కనుమలు, నీలి సొబగులతో రారమ్మనే బంగాళాఖాతం ఒడిషా అందాలను ద్విగుణీకృతం చేస్తుంటాయి.
హైదరాబాద్ నుంచి సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరంలో గల ఒడిషాకు రాజధాని భువనేశ్వర్. రాష్ట్రానికి కేంద్రబిందువుగా ఉన్న ఈ ప్రాంతానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రోడ్డు, రైలు, వాయు మార్గాల ద్వారా చేరుకోవచ్చు.
మరిన్ని వివరాలకు: www.odishatourism.gov.in
online booking: www.visitorissa.org
tollfree: 1800 2097 123
OTDC central reservation counter
(10 am - 6 pm)
tel: +91 6742430764
ఇండియా టూరిజమ్, పర్యాటక భవన్, బేగంపేట్, హైదరాబాద్ వారి ఫోన్ నెం. 040-23409199