అంతటి ఔన్నత్యాన్ని భరించలేకపోయాను!
వేదిక
మాది చాలా పెద్ద ఇల్లు. మాకొక పాలేరు ఉండేవాడు. అతని కూతురు భవాని. తనూ, నేనూ చిన్నప్పట్నుంచీ కలసి ఉండేవాళ్లం. అయితే అమ్మానాన్నలు భవానిని నాతో సమానంగా చూడడం, తనకీ నాతో సమానంగా బట్టలు కొనడం, నాతోపాటు స్కూల్లో చదివించడం నచ్చేది కాదు. భవాని పుష్పవతి అయినప్పుడు అమ్మ బంగారు గాజులు ఇవ్వడంతో నా అసూయ హద్దులు దాటింది. భవాని మీద అనిష్టం పెరిగిపోయింది. చివరికి... చాలా దారుణమైన పని చేశాను.
ఆ ఏడు అమ్మ నా పుట్టినరోజుకి ఒక ఉంగరం చేయించింది. నేను దాన్ని స్కూలుకు తీసుకెళ్లి, కావాలని భవాని బ్యాగులో వేశాను. ఆ విషయం తనకి తెలియదు. ఉంగరం కోసం అమ్మ ఇల్లంతా వెతుకుతుంటే చెప్పాను... భవాని గదిలోకి వచ్చిందని, ఏదో తీసుకుని గబగబా వెళ్లిపోవడం చూశానని! అమ్మ నమ్మలేదు. కానీ నేను గోల చేయడంతో భవాని వాళ్ల నాన్నకి బాధ కలిగింది. కావాలంటే ఇల్లంతా సోదా చేసుకోమన్నారు. నేనే వెళ్లి, సోదా చేసినట్టు నటించి, భవాని బ్యాగులోంచి ఉంగరం తీసిచ్చాను. దాంతో నాన్న అరిచారు. ‘నమ్మితే ఇలా మోసగిస్తున్నారా.. ఇంకెన్ని కాజేశారో’ అన్నారు. ఆ అవమానం తట్టుకోలేక భవానీ వాళ్ల నాన్న పని మానేసి, భవానిని తీసుకుని వెళ్లిపోయాడు. తర్వాత వాళ్లు ఎక్కడున్నారో కూడా మాకు తెలియలేదు.
ఇది జరిగిన రెండేళ్లకు నాన్న హఠాత్తుగా చనిపోయారు. తర్వాత మా జీవితాలు తల్లకిందులయ్యాయి. ఎవరెవరో వచ్చి, నాన్న తమ దగ్గర అప్పులు చేశాడన్నారు. సాక్ష్యాలు చూపించారు. ఆస్తులు లాక్కున్నారు. అమ్మ, నేను రోడ్డున పడ్డాం. అమ్మ ఎలాగో కష్టపడి నన్ను పెంచింది. డిగ్రీ వరకూ చదివించింది. ఇక చదివే స్తోమత లేకపోవడంతో ఉద్యోగం కోసం వేట మొదలు పెట్టాను. ఎంతో కష్టపడి ఓ ప్రభుత్వాఫీసులో క్లర్క్ పోస్టు సంపాదించాను. అక్కడ నేను ఊహించని ఆశ్చర్యం ఒకటి ఎదురయ్యింది. భవాని అక్కడ పెద్ద అధికారి. తన కిందే నేను పని చేయాల్సింది. షాకైపోయాను. నేను ఫలానా అని చెప్పడానికి కూడా నోరు రాలేదు. కానీ తను నన్ను గుర్తు పట్టింది.
ప్రేమగా పలకరించింది. నాన్న చనిపోయారని తెలిసి బాధపడింది. అంతటి ఔన్నత్యాన్ని భరించలేకపోయాను. కన్నీళ్లతో నేను తనకి చేసిన ద్రోహం చెప్పేశాను. కానీ, ఆమె పట్టించుకోనేలేదు. అవన్నీ మర్చిపొమ్మంది. సొంత సోదరిలా ఆదరించింది. చదువుకోవడానికి సాయం చేసింది. ఈ రోజు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, ఓ పెద్ద ఆఫీసులో మంచి హోదాలో ఉన్నానంటే దానికి కారణం భవానీయే! అర్థం లేని అసూయతో తనని, తన తండ్రిని అవమానించాను. నిలువ నీడ లేకుండా చేశాను. కానీ చివరికి ఏమైంది? ఆమె ఎత్తుకు ఎదిగింది. నేను ఎదగడానికి పెద్ద మనసుతో సాయం చేసింది. ఇంతకన్నా పెద్ద గుణపాఠం ఏం కావాలి!
- వత్సల, నరసాపురం