
నిజమూ నీడ...
ఆకాశంలో ఎగురుతున్న ఒక గద్ద కింద దాని నీడ. గద్ద దారి ధారాళం నీడ బాట గందరగోళం రెంటికీ మధ్య కనిపించని దారం. గద్దకు ఎదురు లేదు నీడకు అన్నీ ఎదురుదెబ్బలు కొండలూ లోయలూ నదులూ సముద్రాల మీద విజయం సాధించానని గర్వం గద్దకు. ముడుతలు పడ్డా సర్దుకుని లేచి నేల మీద పరుచుకుంటుంది నీడ.
మేఘాల జాడల్లో గద్ద రంగులు మారుతాయి నీడది ఒకటే రంగు అతి నీలి కలువ గద్ద మరింత పైకి ఎగుర్తుంది నీడ భూమిని వదలదు గద్ద నేలకు దిగక తప్పదునీడకు ఆ అవసరం రాదు ఆకాశం ఎత్తుల్లో గద్ద ఒంటరి నీడ భూమిపై కొనసాగే స్నేహవల్లరి నీడవేళ్లలోంచి మొలవలేదు గద్ద నీడకు మూలం గద్ద మాత్రమే కాదు గద్దా నీడల అనుబంధం వాటికే పరిమితం కాదు అది సూర్యుడు నేసిన యవనిక అద్భుతమైన తికమక.
- డా.ఎన్.గోపి