ఔషధ మొక్కల రైతు, వైద్యుడు! | Cultivate medicinal plants in vijayanagaram | Sakshi
Sakshi News home page

ఔషధ మొక్కల రైతు, వైద్యుడు!

Published Tue, Dec 12 2017 5:50 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Cultivate medicinal plants in vijayanagaram - Sakshi

కేన్సర్‌ చికిత్సకు ఉపయోగించే గెడ్డబోడ మొక్కతో చలపతిరావు

మారుమూల గిరిజన ప్రాంతాల్లో వనమూలికలతో సంప్రదాయ వైద్యం కొత్తేమీ కాదు. అయితే, అడవుల విస్తీర్ణం తగ్గిపోతున్న తరుణంలో వనమూలికల కోసం పూర్తిగా అడవులపై ఆధారపడలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తనకున్న అరెకరం భూమిలో వందలాది రకాల ఔషధ మొక్కలను సాగు చేస్తూ రోగులకు మూలికా వైద్యం అందిస్తూ ప్రశంసలందుకుంటున్నారు మండంగి చలపతిరావు.

విజయనగరం జిల్లా కురుపాం మండలం వెంపటాపురం (పెదగొత్తిలి పంచాయతీ) మండంగి చలపతిరావు స్వగ్రామం. తాత నుంచి నేర్చుకున్న మూలికా వైద్యాన్ని కొనసాగిస్తున్న ఆయన తన అరెకరం పొలంలో 363 ఔషధ మొక్కలను సాగు చేయటంతోపాటు.. ఆ మూలికలతోనే గిరిజనులకు వైద్యసేవలు అందిస్తున్నారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుండి మూలికా వైద్యం కోసం రోగులు ఆయన వద్దకు తరలివస్తున్నారు. అల్సర్, టీబి, షుగర్, రక్తహీనత, పచ్చకామెర్లు, పక్షవాతం, కాలేయ సమస్యలు, విరిగిన ఎముకలకు, చివరకు కేన్సర్‌కు కూడా మూలికా వైద్యం అందిస్తున్నారు.  

చలపతిరావు 1995లో జరడ గ్రామంలో తన తాత వద్ద వనమూలికా వైద్య సేవలు నేర్చుకున్నారు. దానిని అందరికి అందించాలన్న లక్ష్యంతో 1999లో వెంపటాపురం గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. అప్పటి నుండి వనమూలికా వైద్యాన్ని గిరిజనులకు, ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారికి అందిస్తున్నారు. తక్కువ ఖర్చుతోనే మొండి వ్యాధులను సైతం నయంచేసి ఔరా అనిపిస్తున్నారు. మూలికలను సేకరించడానికి అడవిలో అన్ని రకాల ఔషధ మొక్కలు లభించకపోవటంతో కొన్ని మొక్కలు, విత్తనాలను సేకరించి నాలుగేళ్లుగా సాగు చేయటం ప్రారంభించారు.

తనకున్న కొద్దిపాటి అరెకరం పొలంలోనే కొన్ని ఔషధ మొక్కలను సాగు చేస్తున్నారు. తెల్లపసుపు, నల్లపసుపు, నాగసారం, జిల్లేడు, అడవిధాన్యం చెట్టు, ఉత్రవెల్లి, లక్ష్మీ తులసి, తెల్లచిత్రమూల, బుర్జ చెట్టు, నాగర్‌జన్‌ ఉల్లి, కొమ్మెత్తుకొమ్ము, మురదండ, పాలతీగ, నేలవేము, తిప్పతీగ, అడవి గుమ్మడి, నేరేడు వంటి 363 వనమూలిక మొక్కలను సాగు చేసి వాటి వేర్లు, ఆకు చిగుర్లతో పొడులు, పసర్లు తయారు చేసి రోగులకు చికిత్స చేస్తున్నారు. వనమూలికల సాగు కోసం అవసరమైన మొక్కలు, విత్తనాలను అడవి నుంచే సేకరిస్తున్నారు.

ఔషధ మొక్కల సాగుకు వర్షపు నీరే ఆధారం కావడంతో నవంబర్‌ నెల దాటే సరికి అవసరమైన మేర సేకరించి, శుద్ధి చేసి భద్రపరుచుకుంటారు. కేవలం సేంద్రియ ఎరువులను మాత్రమే ఉపయోగిస్తారు. చీడపీడలు రాకుండా ఆవు మూత్రం అప్పుడప్పుడూ పిచికారీ చేస్తారు. మొక్కలు డిసెంబర్‌ నుంచి మే నెలాఖరు వరకూ ఎండిపోయిన స్థితిలోనే ఉంటాయి. వర్షాలు పడిన తర్వాత మొక్కలు మళ్లీ చిగురిస్తాయి. గెడ్డబోడ మొక్కను కేన్సర్‌ చికిత్సలో ఆయన ఉపయోగిస్తున్నారు.  ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు సహాయం అందిస్తే మరింత మందికి వైద్యం అందిస్తానన్నారు.

మూలికల సాగుకు తోడ్పడాలి!
నేను చదివింది 7వ తరగతి. మాత తాత దగ్గర నుంచి మూలికల సాగుతోపాటు వైద్యం కూడా నేర్చుకున్నాను. అడవి నుంచి తెచ్చిన మూలికలకు తోడు నేను అరెకరంలో పండించిన మూలికలను కలిపినా రోగులకు సరిపోవడం లేదు. ఐటీడీఏ అధికారులు ప్రోత్సాహం అందిస్తే మరింత విస్తీర్ణంలో ఏడాది పొడవునా ఔషధ మొక్కలను సాగు చేపట్టి.. వైద్యసేవలను మరింత విస్తృత పరచవచ్చు. వన మూలికల సాగుకు బోరు నీటి సదుపాయం కల్పించాలి. మందుల తయారీకి యంత్ర పరికరాల అవసరం ఉంది. ఐటీడీఏ ప్రోత్సహిస్తే ఏడాది పొడవునా మూలికలను సాగు చేస్తూ, మరింత మంది రోగులకు వైద్యం అందించవచ్చు. వైజాగ్‌లో నయం కాని కేసులు కూడా నా దగ్గరకు వస్తున్నాయి. రోగి వయసును, వ్యాధి తీవ్రతను బట్టి ఔషధాల మోతాదు, వాడే కాలం ఆధారపడి ఉంటుంది. నా వద్ద మందులు వాడిన వారికి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. మోతాదు ఎక్కువైనా ప్రమాదం ఉండదు.

– మండంగి చలపతిరావు (94941 32910), ఔషధ మొక్కల రైతు, వెద్యుడు, వెంపటాపురం, విజయనగరం జిల్లా
– బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, విజయనగరం.
ఫొటోలు: కె.చంద్రమౌళి, కురుపాం.


                         ఔషధాలను తయారుచేస్తున్న మండంగి చలపతిరావు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement