కట్ చేద్దాం... ముడివేద్దాం..! | Cut out ... mudiveddam ..! | Sakshi
Sakshi News home page

కట్ చేద్దాం... ముడివేద్దాం..!

Published Wed, Apr 2 2014 11:37 PM | Last Updated on Sat, Sep 2 2017 5:29 AM

కట్ చేద్దాం... ముడివేద్దాం..!

కట్ చేద్దాం... ముడివేద్దాం..!

ముస్తాబు
 
కురులను అపురూపంగా చూసుకుంటారు అమ్మాయిలు. బారుగా పెరగాలని రకరకాల నూనెలు రాసుకుంటారు. హెన్నాలు వాడుతారు. కలరింగ్‌లు చేయిస్తారు. అంత ఆప్యాయంగా పెంచుకున్న శిరోజాలను కట్ చేయడమా?! ‘ససేమిరా’ అంటారు ఎవరైనా!! కానీ ఇటీవలి కాలంలో అమ్మాయిల నోట పొడవైన  జుట్టుకు ‘నో’ అనే మాటే వినపడుతోంది. అందులోనూ వేసవిలో అయితే మరింత కురచ కేశాలనే ఇష్టపడుతున్నారు. పొడవు, పొట్టి, గరుకు, వంకీలు తిరగడం... ఇలా శిరోజాల తత్త్వం ఏదైనా, ఏతరహాకు చెందినా రకరకాల హెయిర్ కట్స్‌తో, కేశాలంకరణతో కొత్త కొత్త స్టైల్స్ పోతున్నారు. అతివలు ఇష్టపడే హెయిర్‌కట్స్, హెయిర్‌స్టైల్స్‌తో పాటు హెయిర్ కేర్ పాటిస్తే ఈ వేసవిలో మరింత కూల్‌గా గడిపేయచ్చు.
 
 వేసవి హెయిర్ కట్స్...
 స్టెప్ కట్: దీన్ని ‘్ఖ’షేప్ కట్ అని కూడా అంటారు. చాలామంది భారతీయ వనితలు ఇష్టపడే హెయిర్ కట్ ఇది. అటు పొడవు, ఇటు పొట్టి కాకుండా భుజాలమీదుగా కదలాడుతుండే శిరోజాలు అందంగా కనిపిస్తాయి. చిరాకు అనిపిస్తే జుట్టును ‘రోల్’ చేసి పైకి మడిచి క్లిప్ పెట్టేయచ్చు. లేదా నడినెత్తిన బ్యాండ్‌తో బిగించేయవచ్చు. అండాకార ముఖాకృతి ఉన్నవారు, కేశాలు సాధారణ పొడవులో మందంగా ఉన్నవారు ఈ కట్‌ను ఎంచుకోవచ్చు. మృదువుగా, స్ట్రెయిట్‌గా శిరోజాలు ఉన్నవారికే ఈ తరహా కట్ బాగా నప్పుతుంది. ఇందుకోసం పర్మనెంట్ హెయిర్ స్ట్రెయిటనింగ్ చేయించుకోవచ్చు.
 
 ఫెదర్ కట్: యువతులకు అత్యంత ఇష్టమైన కట్ ఇది. స్టైల్‌గా... సులువుగా ఉపయోగించేలా,  ముఖ్యంగా ఎక్కువ శ్రమ కలిగించని విధంగా ఉంటుంది ఈ హెయిర్ కట్. పైగా వయసు తగ్గినట్టు కనిపిస్తారు కూడా! ఈ తరహా కట్ టీనేజ్ అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. పొరలు పొరలుగా కట్ చేస్తారు కాబట్టి, పొట్టిగా ఉండే ఈహెయిర్ కట్ జుట్టును మందంగా చూపిస్తుంది. ఏ తరహా ముఖాకృతికైనా ఈ హెయిర్‌కట్ బాగా నప్పుతుంది. అలాగే ఆధునికం, సంప్రదాయం ఏ తరహా దుస్తులమీదకైనా ఈ హెయిర్ స్టైల్ చక్కని ఎంపిక.
 
 లేయర్డ్‌కట్: స్టైలిష్ హెయిర్‌కట్‌గా పేరొందింది. వెంట్రుకలను లేయర్లుగా కట్ చేసే ఈ పద్ధతిలో జుట్టు మందంగా కనిపిస్తుంది. అయితే ఇది స్ట్రెయిట్ జుట్టున్నవారికి నప్పుతుంది. పొడవు, పొట్టి, ఒత్తై జుట్టుకు కూడా సూటవుతుంది.
 
 బాబ్డ్ కట్: చెవుల కిందకు, భుజాలకు పైకి ఉండే హెయిర్‌కట్ ఇది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో స్త్రీలు సౌకర్యం కోసం ఈ స్టైల్‌ను ఎంచుకున్నారట. ఈ కట్‌లో ఉండే సౌలభ్యానికి ప్రపంచంలోని మహిళలంతా ఆకర్షితులయ్యారు. ఇప్పటికీ బాబ్డీ హెయిర్‌కట్ అతివల నోట అందమైన కట్‌గా ప్రశంసలు అందుకుంటోంది. బాబ్డీ హెయిర్‌కట్‌లోనే ఫ్రంట్ ఫెదర్, లేయర్ అంటూ ముఖం మీదకు పడేలా కొన్ని స్టైల్స్ తీసుకువస్తున్నారు. ఇది గుండ్రటి ముఖాకృతి గలవారికి బాగా నప్పే హెయిర్‌కట్. పొడవు జుట్టు వద్దనుకునేవారు తమ ముఖాకృతిని బట్టి ఈ హెయిర్‌కట్‌ను ఎంచుకుంటే సౌకర్యానికి సౌకర్యమూ, అందానికి అందమూ సొంతమవుతాయి.
 
 కేశసంరక్షణ...
 చలికాలంతో పోలిస్తే వేసవిలో వెంట్రుకలు ఊడడమనే సమస్య పెరుగుతుంటుంది. కారణం సూర్యకాంతి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు నేరుగా కేశాలను తాకడం వల్ల శిరోజాల ఆరోగ్యం ఎక్కువగా దెబ్బతింటుంది. త్వరగా పొడిబారి, తెల్లజుట్టుకు కూడా కారణమవుతుంది.
 
 అతినీలలోహిత కిరణాలు నేరుగా శిరోజాలను తాకకుండా బయటకు వెళ్లేటప్పుడు టోపీ,  స్కార్ఫ్స్ వంటివి తలకు ఉపయోగించాలి. బయటకు వెళ్లేముందు కండిషనర్‌ను లేదా సన్‌స్క్రీన్‌ను పై వెంట్రుకలకు రాయాలి. బయట నుంచి వచ్చిన వెంటనే జుట్టును శుభ్రపరుచుకోవాలి.
 
 వేసవిలో కొంతమంది స్విమ్మింగ్‌ను ఇష్టమైన అలవాటుగా ఎంచుకుంటారు. ఈత కొలనులలో ఉండే ఉప్పు వల్ల జుట్టు పొడిబారి, వెంట్రుకల చివరలు చిట్లుతుంటాయి. ఈత పూర్తయిన తర్వాత రసాయన గాఢత తక్కువగా ఉన్న షాంపూతో క్లోరిన్ లేని నీటితో తలను శుభ్రపరుచుకుంటే వెంట్రుకలు చిట్లడం, నిస్తేజంగా మారడం ఉండదు.
 
 వేసవిలో వేడి అమితం. దీంతో జుట్టు తడి పోగొట్టడానికి హెయిర్ డ్రయ్యర్, బ్లోయర్, స్ట్రెయిటనర్.. వంటివి వాడుతుంటారు. ఈ పరికరాల వల్ల వెంట్రుకలు చిట్లి, మరింత దెబ్బతింటాయి. అందుకని వేసవిలో ‘వేడి’ పరికరాలను దూరం పెట్టడం శ్రేయస్కరం.
 
 వేసవి చీకాకును పోగొట్టుకోవడానికి వారంలో ఎక్కువసార్లు తలస్నానానికి షాంపూను ఉపయోగిస్తారు. దీని వల్ల షాంపూలోనే ఉండే రసాయనాలు వెంట్రుకలపై ఉండే సహజసిద్ధమైన నూనెను తగ్గించి, వెంట్రుకలను గరుకుగా మారుస్తాయి. షాంపూతో తలంటుకున్న ప్రతీసారి ప్రొటీన్, కెరటీన్ ఉన్న కండిషనర్‌నే ఉపయోగించాలి. లేదా వారానికి రెండుసార్లు పెరుగుతో తలకు ప్యాక్ వేసుకొని, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. పెరుగు జుట్టుకు మంచి కండిషనర్‌లా ఉపయోగపడుతుంది. చల్లని ప్రభావాన్ని చూపుతుంది. వెంట్రుకలు మృదుత్వాన్ని కోల్పోవు.
 
 వేడినీటితో తలస్నానం చేసేవారు వేసవిలో ఆ అలవాటును మానుకోవడం మంచిది. సహజంగానే వేడి వల్ల వెంట్రుకల కుదుళ్లు దెబ్బతింటుంటాయి. అలాంటిది వేడినీటి వల్ల వెంట్రుక కుదురు మరింతగా పొడిబారి జీవం కోల్పోతుంది. అందుకని తలస్నానానికి చన్నీటినే ఉపయోగించాలి.
 
 ఈ జాగ్రత్తలు తీసుకుంటే వేసవిలో శిరోజాల నిగనిగలను కాపాడుకున్నట్టే!
 
 పొడవాటి జుట్టున్నవారికి ఇబ్బంది కలిగించని కొన్ని వేసవి హెయిర్ స్టైల్స్
 1.    {ఫంట్ కట్ ఉన్నవారికి ఈ హెయిర్‌స్టైల్ నప్పుతుంది. ఒక్కోపాయను తల పై భాగంనుంచి తీసుకుంటూ, పిన్నులు పెడుతూ సెట్ చేయాల్సి ఉంటుంది.
 
2.    జుట్టు అంతా కలిపి, మధ్యన హెయిర్ బ్యాండ్ పెట్టి, తర్వాత ఒక్కో పాయను రౌండ్‌గా చుట్టి, పిన్నులు పెట్టాలి. మధ్య మధ్యన సన్నని జడ అల్లి, అలంకరించాలి.
 
3.    ముందుగా హెయిర్‌బ్యాండ్‌తో జడ వదులుగా అల్లి, పైకిమడిచి పిన్నులతో అలంకరించాలి.
 
4.    నుదురు పై భాగాన కొంత హెయిర్ తీసి, వెనకభాగాన్ని నడినెత్తిన కొప్పులా చేసి ఈ అలంకరణ చేయాలి.
 
5.    జడను అల్లి, పైకి మడిచి, పిన్నులతో అమర్చాలి. తర్వాత నచ్చిన కేశాలంకరణ చేయవచ్చు.
 
6.    జుట్టును రోల్ చేసి, పైన ముడిలా చుట్టి, ముందుభాగంలో హెయిర్ క్లిప్ వాడాలి.

7.    నుదురుపై భాగం నుంచి ఒక వైపు పాయలుగా జుట్టును ఎడమచెవి వైపుగా అల్లి, చిన్న క్లిప్ పెట్టేయాలి. నుదురు, వీపు భాగాలలో వెంట్రుకలు పడి, చీకాకు కలిగే అవకాశం ఉండదు.
 
8.    రెండు జడలు అల్లి, తల మీదుగా తీసి, పిన్నులు పెట్టేయాలి.
 
9.    పాపిట భాగం నుంచి వెంట్రుకలను పాయలుగా తీసుకుంటూ ఒక వైపుకు జడ అల్లాలి.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement