డైలీ సోప్ అనేది అందుకే!
సీరియల్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడల్లా డైలీ సోప్ డైలీ సోప్ అంటూ ఉంటారు. కానీ అలా ఎందుకంటారో మీకు తెలుసా?
టెలివిజన్ రంగప్రవేశం చేయకముందు రేడియో హవా నడుస్తుండేది. ఇప్పుడు టీవీలకు కళ్లప్పగించినట్టే అప్పుడు అందరూ రేడియోలకు చెవులప్పగించేవారు. వాళ్లను మరింత కట్టిపడేయడానికి రకరకాల ప్రోగ్రామ్స్‌ను ప్లాన్ చేసేవి రేడియో స్టేషన్లు. ఆ క్రమంలోనే సీరియళ్లు వచ్చాయి. అనతి కాలంలోనే వాటికి మహిళల ఆదరణ లభించడంతో... ఆ ఆదరణను క్యాష్ చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది కొన్ని సబ్బుల కంపెనీలకి. గిన్నెలు కడగడం, బట్టలుతకడం, పిల్లలకు స్నానాలు చేయించడం... అన్నీ ఆడవాళ్ల పనులే కాబట్టి, అందుకు వాళ్లు వాడేది సబ్బుల్నే కాబట్టి, సూటిగా వాళ్లకే గేలం వేస్తే పోలా అనుకున్నాయి.
వెంటనే సీరియళ్ల మధ్యలో తమ యాడ్స్ వేయమంటూ స్పాన్సర్ల కోసం వెతుకుతోన్న రేడియో స్టేషన్ల వెంట పడ్డాయి. అలా 1920 ప్రాంతంలో మొదలై, దశాబ్దాల పాటు సీరియళ్ల మధ్యలో దర్శనమిస్తూనే ఉన్నాయి సోప్ అడ్వర్టయిజ్‌మెంట్లు. టెలివిజన్ వచ్చాక, అవి కూడా సీరియళ్లు వేయడం మొదలెట్టాక కూడా చాన్నాళ్ల వరకూ సోప్ యాడ్స్ తెగ హల్‌చల్ చేశాయి. అందువల్లే సీరియళ్లకు డైలీ సోప్ అన్న పేరు వచ్చింది. ఇప్పుడు కూడా ఊ అంటే లక్స్, ఆ అంటే సంతూర్ అంటూ సబ్బుల యాడ్స్ ప్రత్యక్షమవుతూ ఉన్నది అందుకే మరి!