న్యూఢిల్లీ : సాధారణ ఎన్నికల వేళ టెలివిజన్ చానళ్లలో పోటీపడేందుకు ఆకాశవాణి సిద్ధమవుతోంది. టీవీ చానళ్ల తరహాలోనే ఎన్నికల వార్తలు, విశ్లేషణలు, వ్యాఖ్యానాలు,ఫలితాలు, ట్వీట్‌లు ప్రసారం చేయనుంది. ఇటీవల ఉత్తరాదిన జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నాలుగు ప్రాంతీయ రేడియో స్టేషన్లను ప్రత్యక్షంగా అనుసంధానం చేయడంతో అద్భుతమైన ఫలితాలను ఏఐఆర్ సాధించింది. దీంతో మాంచి ఊపుమీదున్న ఆకాశవాణి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరింత సమర్థంగా దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు తెలియజేయడం, వార్తలను, విశ్లేషణలను ప్రసారం చేయడంతోపాటు ట్వీట్‌లను కూడా శ్రోతలకు అందజేయనుంది.
2014 సార్వత్రిక ఎన్నికల నుంచి ఇవన్నీ ప్రారంభిస్తామని ఆకాశవాణి డెరైక్టర్ జనరల్(న్యూస్) అర్చనా దత్తా తెలిపారు. డిసెంబర్ ఎనిమిదిన చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ ఎన్నికల ఫలితాల వెల్లడి సందర్భంగా నాలుగు రాష్ట్రాల్లో రేడియో స్టేషన్ల వార్తా విభాగాలను అనుసంధానించి మంచి ఫలితాలు రాబట్టామని ఆమె చెప్పారు. ప్రత్యక్ష ంగా ఫోన్ ఇన్ కార్యక్రమాలు కూడా నిర్వహించామని ఆమె తెలిపారు. టీవీ చానళ్ల వలెనే ప్రత్యక్ష ప్రసారం చేయడంతో శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని ఆమె వివరించారు. అందుకే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఈ ప్రయోగాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలని నిర్ణయించినట్టు అర్చన చెప్పారు. రాజకీయ పరిశీలకులతో చర్చలు, విశ్లేషణలు, వ్యాఖ్యాతలతో ఫలితాల ప్రకటనలు ఉంటాయన్నారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి ప్రత్యక్షంగా వీటిని ప్రసారం చేస్తామన్నారు. ఆకాశవాణి కరస్పాండెంట్ల ద్వారా, రాజకీయ నాయకుల వ్యాఖ్యానాలు, విశ్లేషకుల అభిప్రాయాలు ప్రత్యక్షంగా ప్రసారం చేస్తామన్నారు. ఇందుకోసం అనేక వర్క్‌షాప్‌లు కూడా నిర్వహిస్తామని ఆమె వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విధానాలు, పనితీరు మార్చుకోవాలని నిర్ణయించామన్నారు. తొలిసారిగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కే జ్రీవాల్ సీఎన్‌జీ ధరల పెంపుపై చేసిన ట్వీట్‌ను ఢిల్లీ ఆకాశవాణిలో ప్రసారం చేసినట్టు ఆమె చెప్పారు.