రెండు కణుపుల కాండపు ముక్కలు
వాణిజ్య స్థాయిలో పాడి పశువుల పెంపకం చేపట్టే రైతులు ఏడాది పొడవునా పచ్చిమేత అందుబాటులో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. నీటి వసతి గల ఒక ఎకరం భూమిలో 5–6 పశువులకు, వర్షాధార భూముల్లో ఒక ఎకరం భూమిలో రెండు పశువులకు సరిపడా పచ్చిమేతను పెంచుకోవచ్చు. ధాన్యపు జాతి పచ్చిమేత మూడు పాళ్లు, పప్పుజాతి పచ్చిమేతను ఒక పాలు కలిపి పశువు శరీర బరువుననుసరించి 25–30 కిలోల వరకు మేపితే తగిన లాభదాయకంగా పాల ఉత్పత్తిని పొందవచ్చు. కొత్తగా డెయిరీ ప్రారంభించే రైతులు రెండు నెలలు ముందునుంచే పచ్చి మేతలను సాగు చేయడం అవసరం. పచ్చి మేతలను సాగు చేసే పద్ధతులను తెలుసుకుందాం...
ధాన్యపు రకం ఏక వార్షిక పచ్చిమేతలు
ధాన్యపు రకం ఏక వార్షిక పచ్చిమేతల్లో ముఖ్యమైనవి హైబ్రిడ్ జొన్న, మొక్కజొన్న, సజ్జ రకాలు.
హైబ్రిడ్ జొన్న
హైబ్రిడ్ జొన్నలో పి.సి.–6, పి.సి.–23, యం.పి. చారి, ఎస్.ఎస్.జి. 59–3 రకాలు మేలైనవి. వీటిని వర్షాధారంగా (జూన్–ఆగస్టు), నీటి పారుదల కింద (జనవరి–మే) నాటుకోవాలి. హెక్టారుకు 30–40 కిలోల విత్తనాలు అవసరం. సాళ్ల మధ్య, మొక్కల మధ్య 4–5 అంగుళాల దూరంలో విత్తుకోవాలి. హెక్టారుకు 80 కిలోల నత్రజని, 30 కిలోల పొటాష్ వేసుకోవాలి. ప్రకృతి/సేంద్రియ పద్ధతుల్లో పెంచుకునే రైతులు తగిన మోతాదులో ఘనజీవామృతం, ద్రవజీవామృతం, వర్మీకంపోస్టు, చివికిన పశువుల ఎరువు వేసుకోవాలి. 10–15 రోజులకోసారి నీటి తడులు ఇవ్వాలి. 50–55 రోజుల (50 శాతం పూత దశ)లో మొదటి కోత కోసుకోవచ్చు. ప్రతి 35–40 రోజులకు ఒక కోత కోసుకోవచ్చు. హెక్టారుకు 70–80 టన్నుల పచ్చి జొన్న గడ్డి దిగుబడి వస్తుంది.
మొక్కజొన్న
పచ్చిమేతగా పెంచుకునేందుకు మొక్కజొన్నలో ఆఫ్రికన్ టాల్, గంగ, హైబ్రిడ్ ఎఫ్, విజయ కిసాన్ రకాలు ఉంటాయి. వర్షాధారంగా జూన్–ఆగస్టు, నీటిపారుదల కింద జనవరి – మే మధ్యలో నాటుకోవాలి. హెక్టారుకు 40–50 కిలోల విత్తనం కావాలి. సాళ్ల మధ్య, మొక్కల మధ్య 10 అంగుళాల దూరం ఉండాలి. హెక్టారుకు 120 కిలోల నత్రజని, 120 కిలోల పొటాష్ వేసుకోవాలి. 7–10 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. విత్తిన 60–70 రోజులకు కంకి వేసే సమయంలో మొదటి కోత కోయాలి. 2–3 కోతలు వస్తాయి. హెక్టారుకు 50–60 టన్నుల పచ్చి మేత దిగుబడి వస్తుంది.
సజ్జ
సజ్జలో జైంట్ బాజ్రా, జైంట్ రాజ్‌కో, ఎ.పి.ఎఫ్.బి. రకాలు పచ్చిమేతగా సాగు చేయడానికి అనువుగా ఉంటాయి. వర్షాధారంగా జూన్–ఆగస్టు మధ్య, నీటిపారుదల కింద జనవరి–మే మధ్య విత్తుకోవాలి. హెక్టారుకు 15–20 కిలోల విత్తనాలు అవసరం. సాళ్ల మధ్య, మొక్కల మధ్య 5 అంగుళాల దూరం ఉండాలి. హెక్టారుకు 80 కిలోల నత్రజని, 30 కిలో పొటాష్ వేయాలి. 15–20 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. విత్తిన 60–70 రోజులకు మొదటి కోత వస్తుంది. తర్వాత 1–2 కోతలు వస్తాయి. 30–35 రోజులకు ఒక కోత వస్తుంది. హెక్టారుకు 25–30 టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది.
బహువార్షిక పచ్చి మేతలు
నేపియర్: ఒకసారి నాటితే 3–4 ఏళ్లపాటు అనేక కోతల్లో పశుగ్రాసాన్ని అందించే బహువార్షిక పచ్చి మేతలు పాడి రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయి. నేపియర్ పచ్చిమేతల్లో ఎన్.బి.21, ఎ.పి.బి.ఎన్., కో–1, కో–2 రకాలు ముఖ్యమైనవి. వీటిని చలికాలంలో తప్ప ఫిబ్రవరి–ఆగస్టు నెలల మధ్యలో రెండు కణుపుల కాండపు ముక్కలు నాటుకోవచ్చు. హెక్టారుకు 30 వేల ముక్కలు కావాలి. వరుసల మధ్య, మొక్కల మధ్య 2 అడుగులు(60 సెం.మీ.) దూరం పాటించాలి. హెక్టారుకు 110 కిలోల యూరియా, భాస్వరం 50 కిలోలు, పొటాష్ 40 కిలోలు వేయాలి. ఎండాకాలంలో 8–10 రోజులకు ఒకసారి, చలికాలంలో 15–20 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. నాటిన తర్వాత 60–75 రోజులకు మొదటి కోత వస్తుంది. తర్వాత ప్రతి 40–45 రోజులకు ఒకసారి.. ఏడాదికి 6–8 కోతలు వస్తాయి. హెక్టారుకు 250–300 టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది.
పారాగడ్డి : పారాగడ్డి కాండపు మొక్కలను జూన్–జూలై నెలల్లో నాటుకోవాలి. హెక్టారుకు 40 వేల కాండపు మొక్కలు కావాలి. వరుసల మధ్య, మొక్కల మధ్య అడుగు దూరం పాటించాలి. హెక్టారుకు 150 కిలోల నత్రజని, 60 కిలోల పొటాష్ వేసుకోవాలి. ఎండాకాలంలో 8–10 రోజులకు, చలి కాలంలో 15–20 రోజులకు ఒక సారి నీటి తడులు ఇవ్వాలి. నాటిన తర్వాత 75–80 రోజులకు మొదటిసారి గడ్డి కోతకు వస్తుంది. తర్వాత ప్రతి 40–45 రోజులకు ఒకసారి, 6–9 కోతలు వస్తాయి. హెక్టారుకు 200–240 టన్నులు సంవత్సరానికి పచ్చిమేత దిగుబడి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment