రొయ్యల రైతులు, మేత తయారీదారులతో సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు.. పక్కన ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు తదితరులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ జోక్యంతో రొయ్య మేత తయారీదారులు దిగివచ్చారు. పెంచిన ధరలను తగ్గించారు. శనివారం నుంచి పాత ధరలతోనే రొయ్య మేత అందుబాటులో ఉంటుంది. ముడిసరుకు ధరలను సాకుగా చూపి ఇటీవల కిలోకి రూ.2.60 చొప్పున టన్నుకు రూ.2,600 మేర మేత ధరలు పెంచారు. ధరల పెంపుపై నియంత్రణ ఉండాలని, లేకుంటే సాగు చేయలేమంటూ రొయ్య రైతులు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దీంతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రొయ్య రైతులు, మేత తయారీదారులతో మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సచివాలయంలో సమావేశమయ్యారు.
చదవండి: చంద్రబాబు పొంతనలేని వ్యాఖ్యలు.. అవాక్కయిన టీడీపీ కార్యకర్తలు
మేత ధరలపై సమీక్షించారు. అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు పెరగడంతో పాటు కరెంట్ కోతల వల్ల జనరేటర్లపై ప్లాంట్లు నిర్వహించాల్సి వచి్చందని అందువల్లే మేత ధరలు పెంచాల్సి వచ్చిందని తయారీదారులు చెప్పారు. ఇలా ప్రతి మూడు నెలలకు పెంచడం తమకు భారంగా మారుతోందని రొయ్య రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్సడా చట్టం ప్రకారం మేత ధరలు ఇష్టానుసారం పెంచడానికి వీల్లేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కోతలను ప్రభుత్వం ఎత్తివేసిందని మంత్రి చెప్పారు.
పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. ఇందుకు తయారీదారులు అంగీకరించారు. టన్నుకు రూ.2,600 చొప్పున తగ్గించి శనివారం నుంచి పాత ధరలకే అమ్ముతామని చెప్పారు. ఇక నుంచి నాలుగు నెలలకోసారి సమీక్షించాలని, అప్పటి ముడిసరుకుల ధరలను పరిగణనలోకి తీసుకొని మేత ధర నిర్ణయించాలని సమావేశంలో తీర్మానించారు.
తయారీదారుల సూచన మేరకు రొయ్యల మేతలో ఉపయోగించే సోయా దిగుమతులను అనుమతించి, ఎగుమతులపై నిషేధం కొనసాగేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, మేత ఉత్పత్తిదారులు, ఆక్వా రైతులు ఉమ్మడిగా కృషి చేయాలని నిర్ణయించారు. రొయ్యల పెంపకంలో యాంటిబయాటిక్స్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని మంత్రి చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, రాష్ట్ర ఆక్వా అభివృద్ధి సంస్థ కో వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, ఆల్ ఇండియా చేపల మేత ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడుæ బీద మస్తాన్‌రావు, ప్రాన్ ఫార్మర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మోహన్‌రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment