Dairy farming
-
పశువులను స్థానికంగా ఎంపిక చేసుకోవడం మంచిది
-
అవినీతికి తావు లేకుండా చూడాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి : స్వయం ఉపాధి కల్పనలో మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ చేయూత పథకంలో లబ్ధిదారులకు ఇచ్చే ఆవులు, గేదెల కొనుగోలులో నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు ఏ ఆవు లేదా గేదె కొనవచ్చు అన్నది మాత్రమే సూచించాలని తుది నిర్ణయం వారికే వదిలేయాలన్నారు. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల అమలుపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్ చేయూత పథకంలో మహిళలకు ఉపాధి కల్పనపై పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నందున ఎక్కడా లోపం లేకుండా చూసుకోవాలని సూచించారు. చదవండి: రేపే జగనన్న విద్యా కానుక ఉపాధి కోరుతున్న మహిళలు నిజంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని అభివృద్ధి చెందాలని ఆశించారు. దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలనని ఆదేశించారు. కిరాణా షాపుల నిర్వాహకులకు ఏ సమస్య వచ్చినా, ఎక్కడైనా, ఎవరైనా లంచం అడిగినా, వెంటనే ఫోన్ చేసేందుకు వారికి ఒక నెంబరు ఇవ్వాలన్నారు. ఆ నెంబర్‌ను షాపు వద్ద ప్రదర్శించాలని తెలిపారు. వ్యవస్థలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా చూడాలని, లేకపోతే విశ్వాసం కోల్పోతామని హెచ్చరించారు. లబ్దిదారుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం రాకుండా చూడాలని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటవుతున్న షాపులకు ఒక బ్రాండింగ్ తీసుకురావాలని, వాటికి తగిన ప్రాచుర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. చదవండి: మహిళల ఆధ్వర్యంలో పాల సేకరణ కేంద్రాలు అవినీతికి తావునివ్వొద్దు వైఎస్సార్ చేయూత పథకంలో లబ్ధిదారులు ఆవు, గేదె ఏది తీసుకున్నా నాణ్యత ఉండేలా చూసుకోవాలని, ప్రభుత్వం తరపున వెటర్నరీ వైద్యుడి ద్వారా ఆ భరోసా కల్పించాలని సూచించారు. అన్ని విధాలుగా పరీక్షించిన తర్వాతే వారు ఏ ఆవు లేదా గేదె తీసుకోవాలో సూచించాలని, దీని కోసం ఎస్ఓపీ రూపొందించుకోవాలన్నారు. ఎక్కడైనా ప్రభుత్వం ఏదైనా ఇచ్చినప్పుడు సబ్సిడీ వస్తుందని, అప్పుడే అవినీతికి తెర లేస్తుందన్నారు. కానీ ఇక్కడ సబ్సిడీ లేకుండా లబ్ధిదారులకు నేరుగా నగదు ఇస్తున్నామన్నారు.అందుకే ఎలాంటి అవినీతికి తావు ఉండకూడదని ఆదేశించారు. ఇక పథకంలో ఆవు లేదా గేదె పొందిన వారికి ఆర్బీకేల ద్వారా పశు గ్రాసం కూడా పంపిణీ చేయాలని పేర్కొన్నారు. పశువుల సేకరణ, వాటికి దాణా, అవసరమైన మందుల పంపిణీ ప్రక్రియలో అమూల్ సంస్థ కూడా పాలు పంచుకోవాలని తెలిపారు. చదవండి: 42.43 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి నాణ్యత ముఖ్యం -మేలుజాతి ఆవులు, గేదెలు మాత్రమే కొనుగోలు చేయాలి. -అదే విధంగా నాణ్యతతో కూడిన నిర్వహణ (క్వాలిటీ ఆఫ్ మెయింటెనన్స్) కూడా ఎంతో ముఖ్యం. -ఇందులో వెటర్నరీ యూనివర్సిటీ నిపుణులను కూడా ఇన్వాల్వ్ చేయండి. మేకలు–గొర్రెలు – మేకలు, గొర్రెలలో ఆడ, మగ రెండూ సేకరించాలి. – లబ్ధిదారులకు ఇస్తున్న రూ.75 వేలకు ఎన్ని మేకలు, గొర్రెలు వస్తే అన్నీ తీసుకోవాలి. – లబ్ధిదారులకు ఒక మగ మేకపోతు లేక గొర్రెపోతు తప్పనిసరిగా ఇవ్వాలి. – అదే విధంగా ఏ మాంసానికి (మేక లేక గొర్రె) డిమాండ్ ఉందో, ఉంటుందో తెలుసుకుని, వాటిని ఎక్కువగా సేకరించాలి. – ఇంకా ఏది పెంచుకుని, అమ్ముకుంటే ఎక్కువ లాభం ఉంటుందో తెలుసుకుని వాటిని లబ్ధిదారులకు ఇవ్వాలి. – మేకలు, గొర్రెల సేకరణలో కూడా పక్కాగా ఎస్ఓపీ ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. పథకాలు–లబ్ధిదారులు అదే విధంగా రాష్ట్రంలో వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా అమలుపై సమీక్షా సమావేశంలో అధికారులు పూర్తి వివరాలు తెలిపారు. పథకంలో ఇప్పుడు 21 లక్షల లబ్ధిదారులు ఉండగా, వారికి రూ.3937 కోట్లు,వైఎస్సార్ ఆసరా పథకంలో 87.74 లక్షల లబ్ధిదారులు ఉండగా వారికి రూ.6792 కోట్ల నిధులు విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. వారిలో స్వయం సహాయక బృందాలకు చెందిన 13.03 లక్షల మహిళలు రెండు పథకాల్లో ప్రయోజనం పొందారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 33,486 ఔట్లెట్లు (కిరాణా దుకాణాలు) ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 8,836 ఔట్లెట్లు ఏర్పాటయ్యాయని, మిగిలినవి కూడా ఈ నెలాఖరులోగా ఏర్పాటవుతాయన్న అధికారులు, ఆ తర్వాత వాటి సంఖ్య ఇంకా పెరుగుతుందని చెప్పారు. పాల ఉత్పత్తి రాష్ట్రంలో రోజూ 412.1 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయన్న అధికారులు, 9,889 గ్రామాల్లో పాల ఉత్పత్తి బాగా ఉందని తెలిపారు. వాటిలోనూ పాలు అత్యధికంగా ఉత్పత్తి అవుతున్న 6,510 గ్రామాల్లో పాల సేకరణకు ఆర్బీకేల వద్ద అదనంగా గదులు నిర్మించాలని ప్రతిపాదించామని, తద్వారా రోజూ 75 లక్షల లీటర్ల పాలు సేకరించవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా… ఆ 6510 గ్రామాల్లో 1000 నుంచి 5 వేల లీటర్ల సామర్థ్యంతో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ) ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం మీద రాష్ట్రంలో వచ్చే ఏడాది జూలై 31 నాటికి, బీఎంసీయూల ఏర్పాటుతో పాటు, పాల సేకరణ ప్రక్రియ మొదలవుతుందని అధికారులు వివరించారు. ఆవులు, గేదెల కొనుగోలు రాష్ట్రంలో 3.43 లక్షల గేదెలు, 2.20 లక్షల ఆవులు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు సమావేశంలో ఆ శాఖ అధికారులు వెల్లడించారు. తొలి ఏడాది 40 వేల ఆవులు, 55 వేల గేదెలు, రెండో ఏడాది 1.80 లక్షల ఆవులు, 2.88 లక్షల గేదెలు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా 2.97 లక్షల మేకలు, గొర్రెలు సేకరించి పంపిణీ చేయనున్నట్లు అధికారులు వివరించారు. ఈ సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీతో పాటు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ధాన్యపు రకం పచ్చి మేతల సాగు ఇలా..
వాణిజ్య స్థాయిలో పాడి పశువుల పెంపకం చేపట్టే రైతులు ఏడాది పొడవునా పచ్చిమేత అందుబాటులో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. నీటి వసతి గల ఒక ఎకరం భూమిలో 5–6 పశువులకు, వర్షాధార భూముల్లో ఒక ఎకరం భూమిలో రెండు పశువులకు సరిపడా పచ్చిమేతను పెంచుకోవచ్చు. ధాన్యపు జాతి పచ్చిమేత మూడు పాళ్లు, పప్పుజాతి పచ్చిమేతను ఒక పాలు కలిపి పశువు శరీర బరువుననుసరించి 25–30 కిలోల వరకు మేపితే తగిన లాభదాయకంగా పాల ఉత్పత్తిని పొందవచ్చు. కొత్తగా డెయిరీ ప్రారంభించే రైతులు రెండు నెలలు ముందునుంచే పచ్చి మేతలను సాగు చేయడం అవసరం. పచ్చి మేతలను సాగు చేసే పద్ధతులను తెలుసుకుందాం... ధాన్యపు రకం ఏక వార్షిక పచ్చిమేతలు ధాన్యపు రకం ఏక వార్షిక పచ్చిమేతల్లో ముఖ్యమైనవి హైబ్రిడ్ జొన్న, మొక్కజొన్న, సజ్జ రకాలు. హైబ్రిడ్ జొన్న హైబ్రిడ్ జొన్నలో పి.సి.–6, పి.సి.–23, యం.పి. చారి, ఎస్.ఎస్.జి. 59–3 రకాలు మేలైనవి. వీటిని వర్షాధారంగా (జూన్–ఆగస్టు), నీటి పారుదల కింద (జనవరి–మే) నాటుకోవాలి. హెక్టారుకు 30–40 కిలోల విత్తనాలు అవసరం. సాళ్ల మధ్య, మొక్కల మధ్య 4–5 అంగుళాల దూరంలో విత్తుకోవాలి. హెక్టారుకు 80 కిలోల నత్రజని, 30 కిలోల పొటాష్ వేసుకోవాలి. ప్రకృతి/సేంద్రియ పద్ధతుల్లో పెంచుకునే రైతులు తగిన మోతాదులో ఘనజీవామృతం, ద్రవజీవామృతం, వర్మీకంపోస్టు, చివికిన పశువుల ఎరువు వేసుకోవాలి. 10–15 రోజులకోసారి నీటి తడులు ఇవ్వాలి. 50–55 రోజుల (50 శాతం పూత దశ)లో మొదటి కోత కోసుకోవచ్చు. ప్రతి 35–40 రోజులకు ఒక కోత కోసుకోవచ్చు. హెక్టారుకు 70–80 టన్నుల పచ్చి జొన్న గడ్డి దిగుబడి వస్తుంది. మొక్కజొన్న పచ్చిమేతగా పెంచుకునేందుకు మొక్కజొన్నలో ఆఫ్రికన్ టాల్, గంగ, హైబ్రిడ్ ఎఫ్, విజయ కిసాన్ రకాలు ఉంటాయి. వర్షాధారంగా జూన్–ఆగస్టు, నీటిపారుదల కింద జనవరి – మే మధ్యలో నాటుకోవాలి. హెక్టారుకు 40–50 కిలోల విత్తనం కావాలి. సాళ్ల మధ్య, మొక్కల మధ్య 10 అంగుళాల దూరం ఉండాలి. హెక్టారుకు 120 కిలోల నత్రజని, 120 కిలోల పొటాష్ వేసుకోవాలి. 7–10 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. విత్తిన 60–70 రోజులకు కంకి వేసే సమయంలో మొదటి కోత కోయాలి. 2–3 కోతలు వస్తాయి. హెక్టారుకు 50–60 టన్నుల పచ్చి మేత దిగుబడి వస్తుంది. సజ్జ సజ్జలో జైంట్ బాజ్రా, జైంట్ రాజ్కో, ఎ.పి.ఎఫ్.బి. రకాలు పచ్చిమేతగా సాగు చేయడానికి అనువుగా ఉంటాయి. వర్షాధారంగా జూన్–ఆగస్టు మధ్య, నీటిపారుదల కింద జనవరి–మే మధ్య విత్తుకోవాలి. హెక్టారుకు 15–20 కిలోల విత్తనాలు అవసరం. సాళ్ల మధ్య, మొక్కల మధ్య 5 అంగుళాల దూరం ఉండాలి. హెక్టారుకు 80 కిలోల నత్రజని, 30 కిలో పొటాష్ వేయాలి. 15–20 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. విత్తిన 60–70 రోజులకు మొదటి కోత వస్తుంది. తర్వాత 1–2 కోతలు వస్తాయి. 30–35 రోజులకు ఒక కోత వస్తుంది. హెక్టారుకు 25–30 టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది. బహువార్షిక పచ్చి మేతలు నేపియర్: ఒకసారి నాటితే 3–4 ఏళ్లపాటు అనేక కోతల్లో పశుగ్రాసాన్ని అందించే బహువార్షిక పచ్చి మేతలు పాడి రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయి. నేపియర్ పచ్చిమేతల్లో ఎన్.బి.21, ఎ.పి.బి.ఎన్., కో–1, కో–2 రకాలు ముఖ్యమైనవి. వీటిని చలికాలంలో తప్ప ఫిబ్రవరి–ఆగస్టు నెలల మధ్యలో రెండు కణుపుల కాండపు ముక్కలు నాటుకోవచ్చు. హెక్టారుకు 30 వేల ముక్కలు కావాలి. వరుసల మధ్య, మొక్కల మధ్య 2 అడుగులు(60 సెం.మీ.) దూరం పాటించాలి. హెక్టారుకు 110 కిలోల యూరియా, భాస్వరం 50 కిలోలు, పొటాష్ 40 కిలోలు వేయాలి. ఎండాకాలంలో 8–10 రోజులకు ఒకసారి, చలికాలంలో 15–20 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. నాటిన తర్వాత 60–75 రోజులకు మొదటి కోత వస్తుంది. తర్వాత ప్రతి 40–45 రోజులకు ఒకసారి.. ఏడాదికి 6–8 కోతలు వస్తాయి. హెక్టారుకు 250–300 టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది. పారాగడ్డి : పారాగడ్డి కాండపు మొక్కలను జూన్–జూలై నెలల్లో నాటుకోవాలి. హెక్టారుకు 40 వేల కాండపు మొక్కలు కావాలి. వరుసల మధ్య, మొక్కల మధ్య అడుగు దూరం పాటించాలి. హెక్టారుకు 150 కిలోల నత్రజని, 60 కిలోల పొటాష్ వేసుకోవాలి. ఎండాకాలంలో 8–10 రోజులకు, చలి కాలంలో 15–20 రోజులకు ఒక సారి నీటి తడులు ఇవ్వాలి. నాటిన తర్వాత 75–80 రోజులకు మొదటిసారి గడ్డి కోతకు వస్తుంది. తర్వాత ప్రతి 40–45 రోజులకు ఒకసారి, 6–9 కోతలు వస్తాయి. హెక్టారుకు 200–240 టన్నులు సంవత్సరానికి పచ్చిమేత దిగుబడి వస్తుంది. -
'పాడి'తో బతుకు 'పంట'!
విధి చిన్న చూపు చూసింది. పెళ్లయిన మూడేళ్లకే పసుపు కుంకాలను తుడిచేస్తే గుండెలవిసేలా రోదించింది. ఇద్దరు బిడ్డల్ని తీపిగుర్తులుగా మిగిల్చి భర్త అకాల మరణం పాలయ్యాడు. అత్తింటివారు చిల్లిగవ్వ ఆస్తి ఇవ్వకుండా నిరాదరించినా కుంగిపోలేదు. ముక్కుపచ్చలారని బిడ్డల్ని వెంటబెట్టుకొని కట్టుబట్టలతో, కన్నీళ్లతో పుట్టింటికి చేరింది. ఎన్ని కష్టాలెదురైనా తన కాయకష్టంతో బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయాలనేదొక్కటే సుజాత సంకల్పం!పాడి, పొదుపులే ఆమెకు అండాదండలయ్యాయి.. ఆర్థిక స్వాతంత్య్రాన్నిచ్చాయి. జీవన రథం సజావుగా సాగడానికి అవే చేదోడు వాదోడుగా నిలుస్తున్నాయి.. సుజాత సొంతూరు చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని తిరివిరెడ్డిపల్లె గ్రామం. రేవతి, రంగస్వామిల కుమార్తె అయిన సుజాత 7వ తరగతి వరకు చదువుకుంది. గుడిపాల మండలం దాయంవారిపల్లెకు చెందిన గురుమూర్తితో 1996లో ఆమెకు పెళ్లయింది. మూడేళ్లలోనే దురదృష్టం వెంటాడింది. ఆశలన్నీ కుప్పకూలాయి. కుమారుడు పవన్, కుమార్తె పూజిత పుట్టిన తర్వాత.. భర్త విద్యుదాఘాతంతో అకాల మరణం చెందారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లీ పిల్లలను అత్త మామలు పట్టించుకోలేదు. ఆస్తి కూడా ఇవ్వలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో తన ఇద్దరు బిడ్డలను వెంటపెట్టుకొని సుజాత పుట్టింటికి చేరింది. బంధుమిత్రుల సూచన మేరకు అప్పట్లోనే రూ. 50 వేలు అప్పు చేసి రెండు పాడి ఆవులు కొన్నది. ఆర్థికంగా తన కాళ్లమీద తాను నిలదొక్కుకోవడానికి, బిడ్డలను చదివించుకోవడానికి ఈ పాడి ఆవులే ఆమెకు ఆధారమయ్యాయి. నీటి వసతి ఉన్న ఎకరం భూమిని ఏడాదికి రూ. 15 వేల చొప్పున కౌలుకు తీసుకొని కో4 రకం పచ్చగడ్డి పెంచుతూ, పచ్చగడ్డితో పాటు ఎండుగడ్డిని కలిపి మేపుకుంటూ సంతృప్తికరంగా పాల ఉత్పత్తి ఉండేలా జాగ్రత్తపడుతున్నారామె. ఇప్పుడు సుజాత వద్ద 5 ఆవులు ఉన్నాయి. రోజుకు 30 లీటర్ల పాలను డెయిరీకి అమ్ముతూ ఉంటుంది. ప్రస్తుతం లీటరుకు రూ. 28 చొప్పున ఆదాయం వస్తున్నది. లీటరుకు రూ. 4 బోనస్ ఇస్తామంటూ కొత్త ప్రభుత్వం ప్రకటించడంతో కొత్త ఆశలు మొలకెత్తుతున్నాయని సుజాత చెప్పారు. పాడిపశువులను పోషించుకుంటూనే పొదుపుపై ఆమె దృష్టి సారించారు. చాలా సంవత్సరాల క్రితమే ఆమె పొదుపుసంఘంలో సభ్యురాలిగా చేరారు. ప్రస్తుతం మండల పొదుపు సంఘం అధ్యక్షురాలిగా సుజాత పనిచేస్తున్నారు. నెలకు రూ. 4,500 ఆదాయం వస్తుంది. ఉన్న ఆదాయ వనరులతోనే ఇద్దరు బిడ్డలను ఉన్నత విద్యావంతులను చేయాలన్నదే ఆమె సంకల్పం. పొదుపు సంఘంలో రూ. 50 రుణం తీసుకొని బిడ్డల చదువుకు ఉపయోగించింది. పాడి ఆవుల ద్వారా వచ్చే ఆదాయంతో అప్పులు తీర్చడంతోపాటు ఉన్నంతలో పొదుపు చేస్తోంది. కుమారుడు పవన్ ఇంటర్‌తో చదువు చాలించి, ఓ ప్రైవేటు డెయిరీలో ఉపాధి వెతుక్కున్నాడు. తల్లి ఆకాంక్షలకు తగ్గట్టుగా కుమార్తె 83 శాతం మార్కులతో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. పదోతరగతిలో 9.5 పర్సంటైల్, ఇంటర్లో కూడా 97 శాతం మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంది. పూజిత తెలివి తేటలను తిరుపతి వ్యవసాయ కళాశాల డీన్ రమేష్ ఆమెను అభినందించారు. రాష్ట్ర పొదుపు సంఘాల అధికారి విజయభారతి ఆర్థిక తోడ్పాటునందించి ప్రోత్సహించారు. పొదుపు సంఘం సభ్యులను చైతన్యవంతం చేస్తూ, వారి సమస్యలు పరిష్కరిస్తూ సుజాత ప్రశంశలందుకుంటున్నారు. మహిళలకు, ముఖ్యంగా ఒంటరి మహిళలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. తల్లిదండ్రులకు భారం కాకుండా.. తన రెక్కల కష్టంతో బిడ్డలకు తండ్రి లేని లోటు కనపడకుండా కుటుంబాన్ని సమర్థవంతంగా, ఆదర్శప్రాయంగా నడుపుతున్నారు సుజాత. ‘చిన్నవయస్సులో భర్తను కోల్పోయాను. అత్తమామల నిరాదరణకు గురై సెంటు భూమి లేని నిరుపేదగా మిగిలాను. జీవితంలో ఎన్నో కష్టాలకు గురైనా ధైర్యం కోల్పోకుండా ఉపాధి కల్పించుకున్నాను. స్వశక్తితో జీవిస్తున్నా. బిడ్డలను చదివిస్తున్నా. అద్దె ఇంట్లోనే ఉంటున్నాం అన్నారు సుజాత. ‘నన్ను ఉద్యోగస్తురాలిగా చూడాలని మా అమ్మ కన్న కలలు నిజం చేస్తాను. తల్లి రుణం తీర్చుకుంటాను. అమ్మను జీవితాంతం నేనే చూసుకుంటాను..’ అంటున్న పూజితను నిండు మనసుతో ఆశీర్వదిద్దాం. – దూది త్యాగరాజులు,సాక్షి, పెనుమూరు, చిత్తూరు జిల్లా -
గోకులానికి మొండిచేయి
ప్రభుత్వ విధానాలతో జిల్లాలోని పాడిపరిశ్రమ అట్టడుగుస్థాయికి పడిపోతోంది. గతంలో, ప్రస్తుతం పాడి రైతులు సీఎం చంద్రబాబునాయుడు మోసాలకు బలవుతూనే ఉన్నారు. సొంత ప్రయోజనం కోసం గతంలో జిల్లాకే తలమానికమైన విజయా డెయిరీని మూయించి వేసి పాడి రైతులను అధోగతి పాలు చేశారు. అదే రీతిలో ప్రస్తుతం పాడి రైతులను ఆదుకుంటున్నామనే పేరుతో దిక్కుతోచని స్థితిలోకి నెట్టేస్తున్నారు. గోకులం పథకం పేరుతో ప్రతి పాడి రైతుకూ సబ్సిడీపై ఆవుల షెడ్డుకు నిధులు అందిస్తామని ప్రకటనలిచ్చారు. నిధుల లేమిని సాకుగా చూపి అర్ధంతరంగా నిలిపేశారు. షెడ్లు నిర్మించుకుని నిధులు మంజూరుకాకపోగా, కట్టిన డీడీలు కూడా వెనక్కి ఇస్తుండడంతో రైతులు అయోమయంలో పడ్డారు. సాక్షి, చిత్తూరు : జిల్లాలోని రైతాంగానికి పాడి పరిశ్రమే ప్రధాన జీవనాధారం. పంటలు లేకపోయినా పాడి పరిశ్రమతో జీవనం సాగిస్తున్న కుటుంబాలే అధికం. జిల్లావ్యాప్తంగా 6.67 లక్షల రైతు కుటుంబాలు ఉండగా పాడి పరిశ్రమపై ఆధారపడి దాదాపు 5 లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. 10.20 లక్షల పాడి ఆవులు, గేదెలను రైతులు పోషిస్తున్నారు. వాటి ద్వారా రోజుకు 32 లక్షల నుంచి 34 లక్షల లీటర్ల మేరకు పాల ఉత్పత్తి వస్తోంది. అందులో 21 లక్షల నుంచి 22 లక్షల లీటర్ల మేరకు పాలను విక్రయిస్తున్నారు. దీంతో వచ్చే ఆదాయంతో కుటుంబాలను, పశువులను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గోకులం పథకం ఇలా.. ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారు. పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు గాను ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాన్ని అందిస్తామని ప్రకటనలు గుప్పించారు. ఇందుకుగాను ప్రతి పాడి రైతుకూ పశువుల షెడ్డు నిర్మించుకునేందుకు 90 శాతం సబ్సిడీపై నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. అందులో రెండు ఆవుల షెడ్డుకు గాను రూ.97 వేలు, నాలుగు ఆవుల షెడ్డుకు గాను రూ.1.47 లక్షలు, ఆరు ఆవుల షెడ్డుకు గాను రూ.1.75 లక్షల చొప్పున నిధులను 90 శాతం సబ్సిడీపై అందిస్తామని గత ఏడాది నవంబరులో ప్రకటించారు. నీరుగారిన పథకం.. గోకులం పథకం కింద షెడ్లు నిర్మించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా 14 వేల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో డిసెంబరు నెలాఖరుకు 4,256 మంది రైతులు సబ్సిడీ పోగా మిగిలిన 10 శాతం నిధులకు డీడీలు కట్టారు. మరింత మంది రైతులు డీడీలు కట్టేందుకు ముందుకు రావడంతో ప్రభుత్వం గోకులం పథకాన్ని పెండింగ్‌లో పెట్టింది. జనవరిలో సబ్సిడీ మొత్తాన్ని 90 శాతం నుంచి 70 శాతానికి తగ్గించింది. దీంతో అప్పటికే డీడీలు కట్టిన రైతులు మిగిలిన 20 శాతం మొత్తాలకు కూడా డీడీలు ఇవ్వాలని పశుసంవర్థక శాఖ అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో అప్పటికే సొంత డబ్బు వెచ్చించి షెడ్లు నిర్మించుకున్న రైతులు విధిలేక మిగిలిన 20 శాతం డబ్బులను కూడా 1,982 మంది రైతులు కట్టారు. అయినా వారికి ఇంతవరకు షెడ్డు నిర్మాణానికి అందించాల్సిన నిధులు ఒక్కపైసా కూడా మంజూరు కాలేదు. డీడీలు చెల్లించిన 4,256 మంది రైతుల్లో ప్రభుత్వం 2,731 యూనిట్లు మాత్రమే మంజూరు చేసింది. మిగిలిన 1,525 మందిలో 20 శాతం డీడీలు కట్టని 749 మంది, 10 శాతం డీడీలు కట్టి పథకం మంజూరు కాని వారు ఉన్నారు. వీరు కట్టిన డీడీలను అధికారులు వెనక్కి ఇచ్చేస్తున్నారు. అదేగాక 30 శాతం డీడీలు కట్టిన వారికి కూడా ఇంతవరకు నిధులు మంజూరు కాకపోవడంతో డీడీలు వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో గోకులం పథకం ద్వారా షెడ్ల నిర్మాణానికి ముందుకు వచ్చిన రైతులకు ప్రభుత్వం మొండిచేయి చూపినట్లయింది. -
సాగు కంటే పాడి బాగు
పాడి పెంపకంతో లాభాలు పెరుగుతున్న పాల దిగుబడులు గొలుగొండ రైతాంగం విజయగాథ గొలుగొండ : పుడమితల్లిని నముకున్నా.. వాతావరణం సహకరించక బడుగు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాడి లేకపోతే వారి దైనందిన పరిస్థితి ఊహించడమే కష్టం. మండల రైతులు రెండేళ్లుగా ఆరుగాలయం కష్టించి పనిచేసినా.. పంటలు ఆశాజనకంగా లేకపోవడంతో అధికశాతం మంది పాడివైపు దృష్టిమళ్లించారు. మార్కెట్లో పాలకు ఉన్న డిమాండ్‌తోపాటు, పాల సేకరణ ధరలు కూడా బాగుండడంతో కుటుంబ పోషణకు ఢోకాలేకుండా పోయింది. పెరిగిన పాల దిగుబడులు మండలంలో 8 వేల ఎకరాలకు పైగా సాగు భూములున్నా, ఏటా పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు రైతులను కుంగదీస్తున్నాయి. భూమిని నుమ్ముకుంటున్నా అప్పులే మిగులుతుండడంతో.. పాడివైపు దృష్టిసారించారు. ఇలా చేయడం వల్ల గతంలో కంటే పాల దిగుబడులు రెట్టింపవుతున్నాయి. ప్రధానంగా పాకలపాడు, ఏటిగైరంపేట, శ్రీరాంపురం, కొత్తమల్లంపేట, కేడీ పేట, పుత్తడిగైరంపేట, కొంకసింగి, జోగుంపేట తదితర ప్రాం తాల్లో డైరీలకు రైతులు ఈ వేసవిలో అధికమొత్తంలో పాల సరఫరా చేస్తున్నారు. గత ఏడాది రోజుకు 3,211 లీటర్లు సరఫరా కాగా ప్రన్తుతం4,300 లీటర్లు ఎగుమతవుతున్నాయి. ఈ గ్రామాల్లో మోటారు బోర్లు అధికంగా ఉండడం వల్ల నీటి సదుపాయం అందివచ్చి పశుగ్రాసాన్ని విస్తారంగా పెంచుతున్నారు. నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో గడ్డి పెరగడం, పాల సేకరణ ధర కూడా బాగుండడంతో ఈ ఏడాది కూడా మంచి లాభాలు వస్తాయని పాడి రైతులు ధీమాగా ఉన్నారు. డెయిరీల మధ్య పోటీ వివిధ డైయిరీలు పోటీ పడి మరీ రైతుల నుంచి పాలు కొనుగోలు చేస్తున్నాయి. మార్కెట్లో పాలకు డిమాండ్ పెరగంతోనే సేకరణ ధర కూడా భారీగా పెంచాయి. 2012-2013 లో లీటరు పాలకు రూ.46 ఉండగా ఇప్పుడు రూ.51కి చేరింది. ధర పెంచడంతోపాటు వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తున్నాయి.